బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్
x

బాల్క సుమన్‌కు 14 రోజుల రిమాండ్

క్యాతన్‌పల్లి ఉద్రిక్తతల మధ్య అరెస్టైన మాజీ ఎమ్మెల్యేకు కోర్టు రిమాండ్; మంత్రి వివేక్‌తో పరస్పర ఆరోపణలు తీవ్రం.


బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికల వేళ క్యాతన్‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికకు సంబంధించి మంత్రి వివేక్, కాంగ్రెస్ కౌన్సిలర్లపై కీలక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ క్యాతనపల్లి బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ కొనసాగుతున్న సమయంలోనే పోలీసులు బాల్క‌సుమన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. సుమన్‌తో పాటు మరో ముగ్గురికి కూడా ఇదే ఆదేశం జారీ అయింది. పోలీసులపై దౌర్జన్యం, విధుల్లో ఆటంకం ఆరోపణలతో ఈ చర్యలు చోటుచేసుకున్నాయి.

అసలేం జరిగింది

క్యాతన్‌పల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ నేపథ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. మొదటి రోజు కోరం లేకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మంగళవారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌లో బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులపై దాడి చేసి విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో కేసు నమోదు చేశారు. రాళ్ల దాడి కేసులోనూ ఆయన పేరు చేరింది.

బుధవారం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గేటును బలవంతంగా తెరవడానికి ప్రయత్నించగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు గేట్లు తెరిచి బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించే ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం.

బాల్క సుమన్ ఆరోపణలు

అరెస్టుకు ముందు బాల్క సుమన్ మాట్లాడుతూ క్యాతన్‌పల్లిలో అన్యాయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 22 వార్డుల్లో కాంగ్రెస్‌కు 7 మాత్రమే వచ్చాయని, బీఆర్‌ఎస్-సీపీఐ కలిపి 14 గెలిచామని తెలిపారు. మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీ ప్రభావంతో పరిపాలన యంత్రాంగం పనిచేస్తోందని ఆరోపించారు. రాళ్లు విసిరింది కాంగ్రెస్ నేతలేనని, పోలీసులు లాఠీచార్జ్ చేసి కేసులు తమపై పెట్టారని అన్నారు. మహిళా కౌన్సిలర్లపై దాడులు జరిగాయని, తాము కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు.

మంత్రి వివేక్ ప్రతిస్పందన

తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ ఆరోపణలను ఖండించారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారని అన్నారు. మొదటి రోజు కోరం లేక వాయిదా పడిందని, రెండో రోజు బయటివాళ్లు వచ్చి గొడవ సృష్టించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోలేదని స్పష్టం చేశారు. సుమన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో అధికార దుర్వినియోగం జరిగిందని విమర్శించారు. తమపై రాళ్లు విసరడం సరైనదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలు పాటించాలని హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము ఎవరినీ అన్యాయంగా అరెస్టు చేయలేదని తెలిపారు.

Read More
Next Story