రేవంత్ ను బండి సంజయ్ రెచ్చగొడుతున్నారా ?
x
Revanth and Bandi

రేవంత్ ను బండి సంజయ్ రెచ్చగొడుతున్నారా ?

కేసీఆర్(KCR) ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవాచేశారు


‘‘రేవంత్ లో పౌరుషం లేదు..చేవ చచ్చిపోయింది’’ ఈ మాటలన్నది ఎవరో కాదు సాక్ష్యాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి(Bandi Sanjay)బండి సంజయ్. టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై బండి మీడియాతో మాట్లాడుతు కేసీఆర్(KCR) ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవాచేశారు. చేతులు ముడుచుకుని కూర్చున్న దద్దమ్మప్రభుత్వం అని మండిపోయారు. ముడుపులు దండుకునేందుకు విచారణ పేరుతో వ్యవహారాన్ని సాగదీస్తున్నట్లు ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనటానికి అన్నీ ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు ఇంకా అరెస్టుచేయలేదని రేవంత్ ప్రభుత్వాన్ని బండి నిలదీశారు. ట్యాపింగ్ ద్వారా మందికొంపలు ముంచిన కేటీఆర్ ఇతరుల వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడటమా అని ఆశ్చర్యపోయారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తనను విచారించిన సందర్భంలో సిట్ అధికారులే తనకు ఆధారాలను చూపించారు అని బండి గుర్తుచేశారు. ట్యాపింగ్ ను అడ్డంపెట్టుకుని కేటీఆర్ అప్పట్లో చేసిన అరాచకాలను తలచుకుంటే ఇప్పటికీ తనరక్తం మరిగిపోతోందని బండి అన్నారు.

తాము గనుక అధికారంలోకి వచ్చుంటే ఈపాటికే కేసీఆర్ కుటుంబానికి గుణపాఠం చెప్పేవాళ్ళమని తీవ్రంగా ఆక్షేపించారు. రేవంత్ రెడ్డికి పౌరుషంలేదు, చేవ చచ్చిపోయింది అని తేల్చేశారు. కనీసం సిట్ అధికారులకు అయినా స్వేచ్చ ఇస్తే ట్యాపింగ్ కేసును వెంటనే కొలిక్కి తెచ్చేస్తారని సూచించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అవినీతి, అరాచకాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

బండి చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలను గమనిస్తే రేవంత్ ను బాగా రెచ్చగొడుతున్నట్లు అర్ధమవుతోంది. బండి చెప్పినట్లుగా కేసీఆర్ లేదా ఇంకెవరినీ అరెస్టు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే తగిన ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్టుచేసినా వెంటనే కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవటం ఖాయం. ఈరోజు సిట్ విచారణలో నేరాన్ని అంగీకరించిన పోలీసు అధికారులే రేపు కోర్టు విచారణలో అడ్డం తిరగరన్న గ్యారెంటీ లేదు. అందుకనే తగిన ఆధారాలు దొరికేవరకు ఎవరినీ అరెస్టు చేయకుండా సిట్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రిని, ఎంఎల్ఏలను అరెస్టుచేయాలంటే చాలా ప్రొసీజర్లు ఫాలో అవ్వాల్సుంటుందన్న విషయం కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండికి తెలియందికాదు.

కేసీఆర్ ఫ్యామిలీని ఎందుకు ఇంకా అరెస్టుచేయలేదు అని ప్రశ్నిస్తున్న బండి మరి కల్వకుంట్ల కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్ధలు ఏమిచేశాయి ? ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవితను విచారించటానికి, కేసుపెట్టి అరెస్టు చేయటానికి సీబీఐ, ఈడీకి ఎంతకాలం పట్టిందో అందరుచూసిందే. ఆరుమాసాలు తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ మీద బయటకు వచ్చేశారు. కవితకు బెయిల్ రానీయకుండా లేదా కవిత బెయిల్ రద్దుచేసి తిరిగి జైలుకు పంపేట్లుగా బండి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ? అరెస్టు చేయటం పెద్ద కష్టమేమీకాదు. అయితే అరెస్టును కోర్టులో సమర్ధించుకోవాలంటే చాలా కష్టం. అందుకనే ఛాన్స్ తీసుకోవటం ఇష్టంలేక సిట్ అధికారులు కేసీఆర్ ఫ్యామిలీలోని ఒక్కోళ్ళని విచారణకు పిలుస్తున్నారు. తొందరలోనే బండి కోరిక కూడా తీరుతుందేమో చూద్దాం.

Read More
Next Story