
‘రేవంత్ ఒత్తిడిలో ఉన్నారు.. అందుకే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’
సీఎం వ్యాఖ్యల శైలి, కాళేశ్వరం ప్రాజెక్ట్, కవిత పార్టీ ప్రచారం నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారంటూ కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ల అమలు ఎలా చేయాలి? అన్న అంశంతో రేవంత్ ఒత్తిడికి లోనవుతున్నారని బండి అన్నారు. ఆ ఒత్తిడి ప్రభావంతోనే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారని, ప్రధానిపై దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి.. తెలంగాణకు మాత్రమే సీఎం అని ఉత్తరాదికి కాదని ఆయన అన్నారు.
సీఎం ఉపయోగిస్తున్న భాషపై తెలంగాణ సమాజం అసంతృప్తిగా ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యంపై కూడా ఆయన స్పందించారు. ఈ ప్రాజెక్ట్ డిజైన్ లోపాలకు మాజీ సీఎం కేసీఆర్ ప్రధాన కారణమని స్పష్టం చేశారు. ప్రజాధనం వృథా కావడానికి అప్పటి నిర్ణయాలే కారణమని చెప్పారు. అయితే, ఈ అవినీతి వ్యవహారంలో కేసీఆర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య కుమ్మక్కు ఉన్నందునే చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇదే సమయంలో కవిత కొత్త పార్టీపై వస్తున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో పార్టీ స్థాపన హక్కు అందరికీ ఉందని, ఈ పరిణామం కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశముందని పేర్కొన్నారు.

