BC Reservations
x

మున్సిపల్ ఎన్నికల్లో బీసీల హవా.. రిజర్వేషన్ కన్నా ఎక్కువ విజయాలు

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా బీసీలు 61శాతం సీట్లలో గెలిచారు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు తమ సత్తా చాటారు. డిమాండ్ చేస్తున్న 42శాతం రిజర్వేషన్ల కంటే ఎక్కువ శాతం మున్సిపల్ సీట్లను సొంతం చేసుకున్నారు. వార్డుల్లో గెలవడమే కాకుండా మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను అందుకోవడంలో కూడా తమ మార్క్ చూపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ నాయకులు సాధించిన విజయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుకు దారితీసే అవకాశాలు చాలానే ఉన్నాయని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు మొత్తం సీట్లలో 61 శాతం గెలుచుకోవడం కేవలం గణాంకం కాదు. అది భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు సంకేతమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికల్లో బీసీల విజయాలకు సంబంధించిన వివరాలను తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్ ప్రకటించారు. ఈ ఫలితాలపై కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలు 52.75 శాతం సీట్లు సాధించారని గుర్తు చేశారు.

రిజర్వేషన్ కంటే అధికం

మున్సిపల్ వార్డుల్లో 28.22 శాతం, కార్పొరేషన్ వార్డుల్లో 35.25 శాతం సీట్లు మాత్రమే బీసీలకు రిజర్వ్ అయ్యాయి. అయినప్పటికీ 61 శాతం సీట్లు గెలుచుకోవడం బీసీ సమాజంలో రాజకీయ చైతన్యం పెరుగుతోందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఫలితాలు ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. జనాభాలో 56.33 శాతం ఉన్న బీసీలు తమ సంఖ్యకు తగ్గ రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నారా అన్నది చర్చకు వస్తోంది. రాష్ట్ర సమగ్ర సర్వే ఈ శాతాన్ని నిర్ధారించిందని కమిషన్ తెలిపింది.

61శాతం ఛైర్ పర్సన్లు బీసీలే

మున్సిపల్ ఛైర్ పర్సన్లుగా ఎన్నికయిన వారిలో బీసీలు 60.95శాతం మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్‌పర్సన్లు ఉన్నారు. అదే విధంగా వైస్ ఛైర్‌పర్సన్లు కూడా 41శాతం మంది బీసీ నాయకులే. మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా బీసీల హవా కొనసాగింది. కరీంనగర్‌లో 64.28శాతం, మంచిర్యాలలలో 68.33శాతం, మహబూబ్‌నగర్‌లో 75శాతం, నిజామాబాద్‌లో 76శాతం, నల్లగొండలో 60శాతం, కొత్తగూడెంలో 35శాతం బీసీలు విజయం సాధించారు.

జిల్లాల వారీగా ఇలా

జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌లో 10 మున్సిపాలిటీలలో 6 చోట్ల ఛైర్‌పర్సన్, 5 చోట్ల వైస్‌ ఛైర్‌పర్సన్ పదవులు బీసీలు గెలిచారు. కరీంనగర్‌లో 13లో 8 ఛైర్‌పర్సన్, 6 వైస్‌ ఛైర్‌పర్సన్ స్థానాలు దక్కాయి. మెదక్‌లో 19లో 11 ఛైర్‌పర్సన్, 10 వైస్‌ ఛైర్‌పర్సన్ పదవులు లభించాయి. సంగారెడ్డిలో 17లో 9 చొప్పున రెండు పదవులు సాధించారు. మహబూబ్‌నగర్‌లో 18లో 16 ఛైర్‌పర్సన్ స్థానాలు గెలుచుకోగా, 2 వైస్‌ ఛైర్‌పర్సన్ స్థానాలు దక్కాయి. నిజామాబాద్‌లో 7లో 7 ఛైర్‌పర్సన్, 5 వైస్‌ ఛైర్‌పర్సన్ స్థానాలు లభించాయి. నల్గొండలో 13లో 3 ఛైర్‌పర్సన్, 4 వైస్‌ ఛైర్‌పర్సన్ స్థానాలు దక్కాయి. వరంగల్‌లో 12లో 3 ఛైర్‌పర్సన్, 2 వైస్‌ ఛైర్‌పర్సన్ పదవులు లభించాయి. ఖమ్మంలో 7లో 1 ఛైర్‌పర్సన్ పదవి మాత్రమే దక్కింది.

ఉమ్మడి జిల్లాలో బీసీ విజయాల శాతం ఇలా

ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపాలిటీలలో బీసీలు పోటీ చేసిన వార్డులు, గెలిచిన వార్డులు, టీడీపీ గెలిచినవి, అలాగే గెలుపు శాతం వివరాలు ఇచ్చారు. మొత్తం గణాంకాలు బీసీల స్థానిక స్థాయిలో బలమైన ప్రాతినిధ్యాన్ని చూపుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీల్లో 341 వార్డుల్లో బీసీలు పోటీ చేసి, 227 వార్డుల్లో గెలిచారు. గెలుపు శాతం 66.56. ఆదిలాబాద్‌లో 10 మున్సిపాలిటీల్లో 265 వార్డుల్లో పోటీ చేసి, 168 చోట్ల విజయం సాధించారు. గెలుపు శాతం 63.39. రంగారెడ్డిలో 13 మున్సిపాలిటీల్లో 294 వార్డుల్లో పోటీ చేసి, 142 వార్డులు గెలిచారు. అక్కడ గెలుపు శాతం 48.29.

నిజామాబాద్‌లో 7 మున్సిపాలిటీల్లో 178 వార్డుల్లో పోటీ చేసి, 130 వార్డుల్లో విజయం సాధించారు. గెలుపు శాతం 73గా ఉంది. సంగారెడ్డిలో 17 మున్సిపాలిటీల్లో 329 వార్డుల్లో పోటీ చేసి, 184 చోట్ల గెలిచారు. అక్కడ గెలుపు శాతం 56. మహబూబ్‌నగర్‌లో 18 మున్సిపాలిటీల్లో 315 వార్డుల్లో పోటీ చేసి, 193 వార్డుల్లో విజయం సాధించారు. గెలుపు శాతం 61.26. ఖమ్మంలో 7 మున్సిపాలిటీల్లో 163 వార్డుల్లో పోటీ చేసి, 69 చోట్ల గెలిచారు. గెలుపు శాతం 42.33. వరంగల్‌లో 12 మున్సిపాలిటీల్లో 260 వార్డుల్లో పోటీ చేసి, 119 వార్డులు గెలిచారు. గెలుపు శాతం 45.80. మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 403 వార్డుల్లో పోటీ చేసి, 248 వార్డుల్లో విజయం సాధించారు. గెలుపు శాతం 61.53.

42% రిజర్వేషన్ చుట్టూ రాజకీయ వ్యూహం

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. కానీ అది కేంద్ర ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంలో మున్సిపల్, పంచాయతీ ఫలితాలు బిల్లుకు నైతిక బలం ఇస్తున్నాయని కమిషన్ భావిస్తోంది. 42 శాతం అమలును అడ్డుకునేలా కోర్టుల్లో పిటిషన్లు వేయడం తగదని కమిషన్ అభిప్రాయపడింది. అదే సమయంలో కేంద్రం తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరింది. ఈ నిబంధనను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని విజ్ఞప్తి చేసింది.

రాజకీయ సమీకరణాలపై ప్రభావం

బీసీలు ఇప్పటికే స్థానిక సంస్థల్లో మెజారిటీ సాధించడం, భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. సంఖ్యాబలం రాజకీయ ఒత్తిడిగా మారితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలపై ప్రభావం పడవచ్చు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంశం కేవలం సామాజిక డిమాండ్ కాదు. అది రాజకీయ అజెండాగా మారుతోంది. కేంద్ర ఆమోదం, కోర్టు కేసుల పరిణామాలు, రాబోయే ఎన్నికల వ్యూహాలు అన్నీ ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి.

Read More
Next Story