
‘బీజేపీ ఏ త్యాగానికైనా సిద్ధం’ నబీన్
సనాతన భారత్ సంప్రదాయాలపై దాడులు జరుగుతుంటే బీజేపీ కార్యకర్తలు మౌనంగా ఉండరని అన్నారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ కార్యకర్తలు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటారని నితిన్ నబీన్ సిన్హా చెప్పారు. మహబూబ్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో (Telangana BJP)బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బుధవారం పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత (BJP President Nitin Nabin)నబీన్ మొదటిసారి తెలంగాణకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతు తెలంగాణలో పలుచోట్ల హిందూ దేవాలయాలపై బహిరంగంగా దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపకపోవటం బాధాకరం అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తు ఆలయాల భూములను ఆక్రమిస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో సనాతన ధర్మంపైన జరుగుతున్న దాడులను బీజేపీ ఎంతమాత్రం సహించదని హెచ్చరించారు. సనాతన భారత్ సంప్రదాయాలపై దాడులు జరుగుతుంటే బీజేపీ కార్యకర్తలు మౌనంగా ఉండరని అన్నారు.
తెలంగాణ భవిష్యత్తు కోసం, సంస్కృతి-సంప్రదాయాల రక్షణకోసం, న్యాయం-సమానత్వం కోసం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయటం ద్వారా ప్రజలు మద్దతుగా నిలబడాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రతినెలా రు. 2500 ఆర్ధికసాయం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, లక్ష రూపాయల నగదు వాగ్దానాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకునేందుకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ మరచిపోయినట్లు మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి మహిళలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తుచేస్తు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన జవాబు చెప్పేట్లుగా ప్రచారం చేయాలన్నారు.
రైతుభరోసా కింద రైతులకు ఎకరానికి రు. 15 వేలు, రైతుకూలీలకు రు. 12 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ, ఆదివాసీ వర్గాలను కూడా కాంగ్రెస్ మోసంచేసినట్లు ఆరోపించారు. మోసానికి కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ద్వారా మాత్రమే న్యాయం జరగుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లేసేటపుడు సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు, ఇపుడు కమిషన్ల పాలన, ల్యాండ్ మాఫియా కంటిన్యు అవుతోందన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ఎద్దేవాచేశారు. అభివృద్ధి పనులు, బిల్లుల మంజూరుకు కూడా చిన్న కాంట్రాక్టర్లు ట్యాక్స్ కట్టాల్సిన ఖర్మ పట్టిందన్నారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం హైదరాబాద్-పూణే, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య హైస్పీడ్ రైళ్ళను తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఫార్మా, పారిశ్రామికరంగాల్లో, మెగా టెక్సటైల్స్, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణంతో తెలంగాణను వేగంగా అభివృద్ధి చేస్తోందన్నారు. గడచిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 35 శాతంకు పైగా ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి బూత్ లో 50శాతం ఓట్లు సాధించటమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు పనిచేయాలని పిలుపిచ్చారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు ప్రజల మధ్యకు వెళ్ళి మోదీ నాయకత్వం పట్ల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని సుస్ధిరం చేయాలన్నారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు కూడా మాట్లాడారు.

