
బీజేపీ చేజారిన నిజామాబాద్
అత్యధిక డివిజన్‌లలో విజయం సాధించిన కమలం పార్టీకి దక్కని మేయర్ కుర్చి.
నిజామాబాద్ మేయర్ కుర్చి కోసం హోరాహోరీ పోరు జరిగింది. మేయర్ పీఠం తమ చేతికి దక్కిందిన బీజేపీ భావించిన.. చివర్లో అది చేజారింది. కార్పొరేషన్‌లో అత్యధిక డివిజన్‌లను గెలిచిన పార్టీగా బీజేపీ నిలిచింది. కానీ మేయర్ కుర్చీ మాత్రం దక్కలేదు. దీంతో బీజేపీ పరిస్థితి గెలిచీ ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి వచ్చింది. నిజామాబాద్‌లో మొత్తం 60 డివిజన్‌లు ఉన్నాయి. వాటిలో బీజేపీ 28 డివిజన్‌లలో జెండా ఎగరవేసింది. కానీ రాజకీయ సమీకరణాల కారణంగా మేయర్ కుర్చీ బీజేపీకి దక్కే పరిస్థితి లేకుండా పోయింది. అన్ని సమీకరణాలను చూసుకున్న తర్వాత బీజేపీ కూడా చేతులెత్తేసింది. ఈసారికి ప్రతిపక్షంలోనే ఉంటామని స్పష్టం చేసింది. దీంతో ఎంఐఎంతో జతకట్టి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్‌లో జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది.
నిజామాబాద్‌లోని మొత్తం 60 డివిజన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ 1 స్థానాల్లో విజయం సాధించాయి. నిజామాబాద్ మేయర్ స్థానంం దక్కాలంటే 31 స్థానాలు కావాలి. ఈ కార్పొరేషన్ ఎన్నికలో ఏ ఒక్క పార్టీ కూడా కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేదు. కాంగ్రెస్, ఎంఐఎం మిత్రపక్షాలు కావడంతో వారిద్దరి స్థానాలు కలిపితే సరిగ్గా 31 స్థానాలు అవుతాయి. అదే సమయంలో ఎక్స్‌అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి.
బీజేపీకి నిజామాబాద్‌లో మూడు ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుంటే బీజేపీ స్థానాలు 28+3 కలుపుకి మొత్తం 31 అవుతాయి. దాంతో మేయర్ కుర్చీకి కావాల్సిన 31 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షం కలుపుకుని వాళ్లు కూడా 31 స్థానాలను కలిగి ఉన్నారు. దాంతో పాటు కాంగ్రెస్‌కు ఒక ఎక్స్‌అఫీషియో ఓటు కూడా ఉంది. దానిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ అండ్ కో ఖాతాలో 32 స్థానాలు అయ్యాయి. దీంతో మేయర్ కుర్చీ కాంగ్రెస్‌కు దక్కే అవకాశం సుగమమం అయింది.
స్పీడ్ పెంచిన కాంగ్రెస్
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లాలో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాంగ్రెస్‌కున్న 17 స్థానాలకు తోడు, 14 స్థానాలున్న ఎంఐఎం మద్దతును ఆయన కోరారు. దీనికి అదనంగా మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి రూపంలో ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు బలాన్నిస్తున్నాయి. తన బలాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు, బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక కార్పొరేటర్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ శిబిరంలోకి చేర్చుకుంది.
బీజేపీ వెనకడుగు
అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజార్టీకి అవసరమైన సభ్యులు లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, తమకు మెజార్టీ రాలేదని, అందుకే తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని స్పష్టం చేశారు. అలాగే నిజామాబాద్ పేరును ఇందూరుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటామని చెబుతూ ప్రజలకు క్షమాపణలు కోరారు.
జోరుగా క్యాంపు రాజకీయాలు
మేయర్ ఎన్నికలో ఎటువంటి తేడాలు రాకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ సంఖ్యాబలం 31కి చేరుకోవడంతో మేయర్ పీఠం హస్తగతం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూడా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ, ఎంఐఎం మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

