
స్పీకర్ నిర్ణయాన్ని సవాలుచేసిన బీజేపీ
బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటు కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధిగా దానం పోటీచేయటం స్పీకర్ కు తప్పనిపించకపోవటాన్ని ఏలేటి తప్పుపట్టారు
ఫిరాయింపు ఎంఎల్ఏ దానం నాగేందర్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని బీజేపీ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి సవాలు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతు బీజేఎల్పీ నేత ఏలేటి శనివారం హైకోర్టులో పిటీషన్ వేశారు. బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని స్పీకర్ తీర్పుచెప్పటం ఆశ్చర్యంగా ఉందని ఏలేటి పిటీషన్లో పేర్కొన్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా సికింద్రాబాద్ లోక్ సభ స్ధానంలో దానం పోటీచేసిన విషయాన్ని ఎంఎల్ఏ తన పిటీషన్లో ప్రస్తావించారు.
బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటు కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధిగా దానం పోటీచేయటం స్పీకర్ కు తప్పనిపించకపోవటాన్ని ఏలేటి తప్పుపట్టారు. తన పిటీషన్ ను విచారించి దానం విషయంలో స్పీకర్ తీర్పును కొట్టేయాలని, దానంపై అనర్హత వేటు వేయటమే కాకుండా ఇప్పటివరకు దానం తీసుకున్న జీత, బత్యాలను రికవరీ చేయాలని పిటీషన్లో ఏలేటి అభ్యర్ధించారు. లోక్ సభ ఎంపీగా దానం నామినేషన్ వేసిన పత్రాలనే ఏలేటి సాక్ష్యంగా చూపించారు. ఏలేటి పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారానికి విచారణను వాయిదావేసింది.
నిజానికి దానం పార్టీ ఫిరాయించారు అనేందుకు పెద్దగా సాక్ష్యాలు అవసరంలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉంటు కాంగ్రెస్ ఎంపీగా పోటీచేయటానికి మించిన సాక్ష్యం ఏముంటుంది ? అయినా ఎందుకనో ఈ సాక్ష్యం స్పీకర్ కు సరిపోలేదు. ఇక్కడ బీఆర్ఎస్ తప్పులు కూడా చాలానే ఉన్నాయి. అవేమిటంటే తమ ఎంఎల్ఏగా ఉన్న దానం కాంగ్రెస్ ఎంపీగా పోటీచేయటాన్ని పార్టీ నాయకత్వం తప్పుపట్టలేదు. వెంటనే వివరణ ఇవ్వాలని దానంకు పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీసు జారీచేయలేదు. పార్టీనుండి సస్పెండ్ చేయలేదు. దానం జీతంలో నుండి పార్టీ నాయకత్వం ప్రతినెలా రు. 5 వేల పార్టీ ఫండ్ గా మినహాయించుకుంటోంది. అనర్హత వేటు వేయించాలని అనుకున్నపుడు దానంకు వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వాలి కదా ? ఎందుకు ఇవ్వలేదు.
వివరణ కోరుతు షోకాజ్ నోటీసు కూడా జారీచేయకపోవటంలో ఆంతర్యం ఏమిటి ? ప్రతినెలా జీతంలో నుండి 5 వేల రూపాయలను పార్టీ ఫండ్ కింద నాయకత్వం ఎలా మినహాయించుకుంటోంది ? ఈ పాయింట్ల మీదే బీఆర్ఎస్ నాయకత్వం వాదనలను స్పీకర్ కొట్టేశారు. ఇక, ఏలేటి కేసంటారా ? బీఆర్ఎస్ నాయకత్వానికి పట్టని దానం అనర్హత అంశం బీజేపీ ఎంఎల్ఏకు ఎందుకు అనే పాయింట్ చాలా కీలకమైనది. ఇదే పాయింట్ మీద దానం లాయర్ కోర్టులో వాదనలు వినిపించే అవకాశాలున్నాయి. చివరకు కోర్టు ఏమంటుందో చూడాలి.

