
బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్
అధ్యక్షుడు కామారెడ్డికి చేరుకుంటే మరింత ఉద్రిక్తతలు పెరిగిపోతాయన్న ఆలోచనతో పోలీసులు ముందస్తుగా అరెస్టుచేశారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావును పోలీసులు ఆదివారం హౌస్ అరెస్టుచేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భూముల విషయంలో బీజేపీ ఎంఎల్ఏ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలవాన లాగ తయారైంది. కాంగ్రెస్-బీజేపీ పార్టీల క్యాడర్లమధ్య పెద్దఎత్తున ఉద్రిక్తత పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ నేతల కార్లపైన బీజేపీ కార్యకర్తలు శనివారం సాయంత్రం దాడులు చేయటంతో ధ్వంసమైపోయాయి.
రెండుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన నేపధ్యంలో ఆదివారం ఉదయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్ నుండి కామారెడ్డికి బయలుదేరారు. అధ్యక్షుడు కామారెడ్డికి చేరుకుంటే మరింత ఉద్రిక్తతలు పెరిగిపోతాయన్న ఆలోచనతో పోలీసులు ముందస్తుగా అరెస్టుచేశారు. రామచంద్రరావును ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వెంటనే హైదరాబాద్ లోని నేతలు, క్యాడర్ పెద్దఎత్తున ఆందోళనలు మొదలుపెట్టారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని భూముల విషయంలో తమ ఎంఎల్ఏల తప్పుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అధికారంలో ఉన్నామన్న కారణంగా ఇష్టారీతిగా వ్యవహరిస్తే తమకూ తొందరలో అవకాశం వస్తుందని హెచ్చరించారు. శిశుమందిర్ భూ వ్యవహారంలో తమ పార్టీ ఎంఎల్ఏకి సంబంధంలేదని స్పష్టంచేశారు. స్ధానిక ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు కలిసి తమ ఎంఎల్ఏపైన దాడికి ప్రయత్నించినట్లు అధ్యక్షుడు ఆరోపించారు. పోలీసులు తనను హౌస్ అరెస్టుచేయటంపై మండిపోయారు. ఇపుడు పోలీసులు తనను అడ్డుకున్నా కామారెడ్డికి కచ్చితంగా వెళ్ళితీరుతానని చెప్పారు.
రామచంద్రరావు హౌస్ అరెస్టుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మాట్లాడుతు తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేయటం ఏమిటని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు మొదలయ్యాయంటు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి చేస్తున్న అరాచకాలను బీజేపీ నేతలు, క్యాడర్ ధీటుగా ఎదుర్కొంటారని హెచ్చరించారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యంపోసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆరోపించారు. ఆత్మరక్షణకు తమ పార్టీ నేతలు అడ్డుకుంటే తాము కాంగ్రెస్ నేతల మీద దాడులుచేశామని అరెస్టులు చేయటం దుర్మార్గమన్నారు. బాన్సువాడలో తమపార్టీకి చెందిన 70మందిని పోలీసులు అరెస్టుచేయటం అన్యాయం అన్నారు. రెండుపార్టీల నేతలు, క్యాడర్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్ధితులు చివరకు ఎక్కడకు దారితీస్తాయో అన్న భయంతో స్ధానికులు బిక్కబిక్కుమంటున్నారు.

