తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో
x

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపపీ సంకల్ప పత్రం విడుదల. గతంలోనూ మేనిఫెస్టోలతో పోటీ పడిన పార్టీలు.


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు హోరాహోరీగా జరిగే వాతావరణం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించిన తమ సత్తా చాటుకోవాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. పోటా పోటీగా ప్రచారం కూడా చేస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడుతున్నారు కీలక నేతలు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కీలక ప్రకటన చేసింది. మున్సిపల్ ఎన్నికలకు తమ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టో ఏంటన్న చర్చ మొదలైంది.

అయితే మున్సిపల్ ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కూడా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. బీజేపీ కూడా వాటిలో ఒకటి. అదే సాంప్రదాయాన్ని బీజేపీ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తూ ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఈ మేనిఫెస్టోను ఆయన సంకల్ప పత్రంగా చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ‘వికసిత తెలంగాణ – బీజేపీ సంకల్ప పత్రం’ పేరుతో మేనిఫెస్టోను ఆవిష్కరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ధీమా

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలిస్తే పెండింగ్‌లో ఉన్న పన్నుల్లో వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలను మోడ్రన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.

ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామని వెల్లడించారు. అవినీతి రహిత మున్సిపాలిటీలే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని తెలిపారు. కబ్జాలపై ఉక్కు పాదం మోపుతామని చెప్పారు. యువత కోసం వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

మేనిఫెస్టో హామీలు.. ఎన్నికల వ్యూహం

మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ నేతలను రంగంలోకి దించి గల్లీ స్థాయి ప్రచారానికి వ్యూహాలు రూపొందిస్తోంది. 60 శాతానికి పైగా మున్సిపాలిటీలు తమవేనని పార్టీ అంచనా వేస్తోంది.

ఎన్నికలను రాజకీయంగా కీలకంగా భావిస్తున్న బీజేపీ, జాతీయ నాయకత్వం ప్రత్యేక బృందాలను నియమించింది. మున్సిపల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ఆశిష్ షెలార్‌తో పాటు కో-ఇన్‌ఛార్జులు అశోక్ పర్ణామి, రేఖా శర్మ రాష్ట్రంలో మకాం వేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు పర్యవేక్షిస్తున్నారు. మేనిఫెస్టోలో పన్నుల పెంపు ఉండదని స్పష్టం చేశారు.

వారం రోజుల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. బస్తీ దవాఖానలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి, క్లీన్ సిటీ, గ్రీన్ టౌన్ లక్ష్యాలను ప్రకటించారు. 100 శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మహిళల రక్షణ, దేవాలయాల పరిరక్షణకు హామీ ఇచ్చారు. మున్సిపాలిటీల్లో దోమలు, పందులు, కుక్కలు, కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమ్మిళిత, సుస్థిర అభివృద్ధే మేనిఫెస్టో లక్ష్యమని తెలిపారు.

తొలిసారి తెలంగాణలో అన్ని మున్సిపల్ వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ, మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కనీసం ఐదు కార్పొరేషన్లను దక్కించుకోవాలనే టార్గెట్‌తో పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. యువ మోర్చాకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. జెన్-జీని లక్ష్యంగా చేసుకుని వినూత్న ప్రచార కార్యక్రమాలకు దిశానిర్దేశం చేశారు.

గతంలోనూ మేనిఫెస్టోలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రత్యేక మేనిఫెస్టోలు విడుదల చేయడం కొత్త విషయం కాదు. 2016, 2020 ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ నగర పాలనకే కేంద్రంగా హామీలతో కూడిన మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి.

2016 GHMC ఎన్నికలు – మేనిఫెస్టో రాజకీయాలకు నాంది

2016 జనవరిలో జరిగిన GHMC ఎన్నికల సమయంలో అప్పటి TRS (ప్రస్తుతం BRS) ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మేనిఫెస్టో రూపొందింది. డ్రెయినేజ్ వ్యవస్థ ఆధునీకరణ, సీవరేజ్ లైన్ల విస్తరణ, రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి పట్టణ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రాపర్టీ ట్యాక్స్ భారం తగ్గిస్తామన్న హామీ కూడా ఇందులో భాగంగా ఉంది.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా GHMC ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. నగరంలోని మౌలిక సదుపాయాల లోపాలు, పారిశుధ్యం, డ్రెయినేజ్ సమస్యలపై దృష్టి పెట్టింది. పట్టణ ప్రజల రోజువారీ సమస్యలకు పరిష్కారాలే లక్ష్యంగా హామీలు ప్రకటించింది.

బీజేపీ, టీడీపీ కలిసి ‘విజన్ డాక్యుమెంట్’ పేరుతో తమ ప్రణాళికలను ప్రకటించాయి. హైదరాబాద్‌కు ఆధునిక డ్రెయినేజ్ వ్యవస్థ, పట్టణ రవాణా సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఈ విజన్ డాక్యుమెంట్ కూడా మేనిఫెస్టో తరహాలోనే ప్రజల్లోకి వెళ్లింది.

2020 GHMC ఎన్నికలు – వరదలపైనే ఫోకస్

2020 GHMC ఎన్నికలు నగరంలో భారీ వరదల అనంతరం జరిగాయి. దీంతో అన్ని పార్టీల మేనిఫెస్టోలలో వరద నియంత్రణ ప్రధాన అంశంగా మారింది. అప్పటి TRS 2020 నవంబర్‌లో GHMC ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వరదల నివారణకు భారీ ప్రణాళిక, నాలాల అభివృద్ధి, డ్రెయినేజ్ బలోపేతం అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం వంటి పట్టణ మౌలిక వసతుల అంశాలు కూడా మేనిఫెస్టోలో చోటు దక్కించుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కూడా 2020 ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించింది. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం, ప్రాపర్టీ ట్యాక్స్‌లో సడలింపులు వంటి హామీలను ఇచ్చింది. నగర ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా తమ ప్రణాళికలను వివరించింది.

బీజేపీ 2020 GHMC ఎన్నికల్లో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. వరద బాధితులకు ఆర్థిక సహాయం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల వంటి అంశాలను ఇందులో పొందుపరిచింది. నగర పాలనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా మేనిఫెస్టోను ప్రకటించింది.

నగర ఎన్నికల్లో మేనిఫెస్టో సంప్రదాయం

GHMC ఎన్నికల్లో మేనిఫెస్టోలు విడుదల చేయడం ద్వారా పార్టీలు తమ పట్టణ పాలన దృక్పథాన్ని ప్రజల ముందు ఉంచాయి. డ్రెయినేజ్, వరద నియంత్రణ, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి అంశాలు ప్రతి ఎన్నికలో ప్రధానంగా కనిపించాయి. మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక ఎన్నికలనే అన్న భావనను దాటి, నగర భవిష్యత్తుపై పోరాటంగా GHMC ఎన్నికలు మారినట్లు ఈ మేనిఫెస్టోలు సూచించాయి.

Read More
Next Story