
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయం: కిషన్ రెడ్డి ధీమా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెండేళ్లుగా మాటలకే పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. ఏం చేస్తారో చేతల్లో చూపించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి లేకపోతే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తన పేరును మార్చి పిలుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి పెట్టిన పేరును మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలు సరికాదని పేర్కొన్నారు.
తెలంగాణలో అన్ని స్థానాల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరికీ దత్తపుత్రుడు కాదని మరోసారి స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఉంటే వారే పరిష్కరించుకోవాలని, తనను మధ్యలో లాగొద్దని అన్నారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేయకుండా తన పేరు మారుస్తామనే వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డురాదని తెలిపారు. ఈ విషయంలో బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన విమర్శించారు. తామెప్పుడూ బీఆర్‌ఎస్‌తో కలవలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయని గుర్తుచేశారు.
ఇప్పుడేమీ చేయలేక తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌పై చర్యల విషయంలో ఎవరి బాధ్యత ఏమిటన్నది తెలంగాణ సమాజమే ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు ఏమిచ్చారన్న అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి తన చేతగానితనాన్ని బీజేపీపై రుద్దొద్దని సూచించారు. ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని అన్నారు.

