
టెండర్ల టార్గెట్ కమీషన్లే: రామచందర్ రావు
కమీషన్లు కాంట్రాక్టుల పేరుతో కాంగ్రెస్ దోపిడీకి పాల్పడుతోందన్న రామచందర్ రావు.
తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పాలనలో టెండర్లు అనేవి అభివృద్ధి కోసం కాకుండా కమీషన్ల కోసం జరుగుతున్నాయని ఆరోపించారు. అందుకు సింగరేణి నైని బ్లాక్ టెండర్ల రద్దు అతిపెద్ద ఉదాహరణ అని అన్నారు. అంతేకాకుండా ఈ టెండర్ల రద్దు కమీషన్లు, కాంట్రాక్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న దోపిడీ పాలనకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఆలోచనంతా కమీషన్లపైనే
కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలపై ఇసుమంత ఆలోచన కూడా లేదని, వారి దృష్టి అంతా కూడా కమీషన్ల గురించేనంటూ రామచందర్ రావు విమర్శించారు. సింగరేణి కార్మికుల రక్తం, చెమట పీల్చి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల సొంత మనుషులు, బంధుమిత్రులకే కోల్ బ్లాక్స్, కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ నాయకులపై కూడా విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ పాలనలోనూ అదే
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు రామచందర్ రావు. ‘‘సింగరేణిలో జరిగిన కుంభకోణాల్లో సగం పాపం గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా సింగరేణి కాంట్రాక్టులు తమ సొంత మనుషులకే ఇచ్చిన విషయం ప్రజలకు తెలిసిందే. ఒకప్పుడు సింగరేణిలో వేలాది మంది ఉద్యోగులు ఉండగా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య 42 వేల వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరింతగా తగ్గి సుమారు 38 వేలకే పరిమితమైంది’’ అని వ్యాఖ్యానించారు.
దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిని ఈరోజు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమని, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయిపడి ఉందని తెలిపారు. ‘‘నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్‌షిప్ ఎలా ఇచ్చారు? లాస్‌లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
టెండర్లు ఎందుక రద్దు చేశారు?
‘‘ఈరోజు సింగరేణి పరిస్థితికి, నైని బ్లాక్‌లో జరుగుతున్న అవకతవకలకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాల్సిందే. నైని బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేశారో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకు ఆ కాంట్రాక్టులు ఇచ్చారు? ఎందుకు పారదర్శకత లేదు? ఎందుకు చివరికి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత ముడుపులు పుట్టాయి? ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు సమాధానం రావాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.
సమగ్ర దర్యాప్తు జరగాలి
‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలనపై కాదు, కేవలం కమీషన్లపైనే దృష్టి పెట్టింది. కష్టపడి సింగరేణిని ఆదుకుంటున్న కార్మికులను మరిచి, వారి శ్రమపై కమీషన్ల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఎవరికి టెండర్లు ఇచ్చారో, ఎవరికివ్వాలని ప్రయత్నం చేశారో.. ఇది నాయకులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు. సింగరేణి, నైని బ్లాక్, కోల్ టెండర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరగాలి’’ అని కోరారు.

