బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన సీపీఐ
x

బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన సీపీఐ

51 రోజుల ఉత్కంఠ తర్వాత క్యాతనపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠానికి కూటమి దక్కించింది, కీలక ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు ప్రభావం చూపాయి.


క్యాతనపల్లి మున్సిపల్ పీఠం విషయంలో కాంగ్రెస్‌కు మిత్రపక్షం సీపీఐ భారీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్ర అధికారంలో మిత్రపక్షంగా ఉన్నా మున్సిపల్ ఎన్నికకు వచ్చేసరికి జెండా తిప్పేసింది. బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ నుంచి మున్సిపల్ కుర్చీని లాగేసుకుంది. 51 రోజుల్లో కొనసాగుతున్న క్యాతనపల్లి మున్సిపల్ పీఠం ఫలితానికి తాజాగా తెరపడింది. కాగా ఇక్కడ.. మిత్రపక్షం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్‌తో సీపీఐ జతకట్టింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాటను సీపీఐ మరోసారి అక్షరసత్యం చేసింది. బీఆర్ఎస్, సీపీఐ కూటమి కట్టడంతో క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల శనివారం పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థి గొడిసెలల సంధ్యారాణి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవగా, సీపీఐ అభ్యర్థి మిట్టపల్లి సరితా వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

భారీ భద్రత మధ్య ఎన్నిక

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక భారీ బందోభస్తు మధ్య జరిగింది. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో నలుగు ఏసీపీలు, ఇద్దరు సీఐలు, 27 మంది ఎస్‌ఐలు, 650 మంది పోలీసుల బందోబస్తు మధ్య ఈ ఎన్నిక పూర్తయింది. ఒక మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికకు ఇంతటి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందన్న అనుమానం రావొచ్చు. గతంలో ఈ క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్బంగా జరిగిన గందరగోళాలే ఇప్పుడు ఇంతటి బందోబస్తుకు దారితీసింది.

ఇప్పటి వరకు క్యాతనపల్లి ఛైర్‌పర్సన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. ఒకసారి కోరం సభ్యులు సరిపడా లేనందున వాయిదా వేశారు. దాంతో పాటుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల సభ్యుల ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడం, మహిళా అభ్యర్థులని తోసేయడం వంటి ఘటనలు జరిగాయింది. అంతేకాకుండా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఇలాంటి గందరగోళ పరిస్థితుల కారణంగా క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఎన్నిక సజావుగా సాగింది.

క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక చుట్టూ నెలకొన్న గందరగోళంపై తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఎన్నికలు వాయిదా పడటం, రాజకీయ ఉద్రిక్తలపై దాఖలయిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఎన్నికలు చట్టబద్దంగగా జరగాలని, కాలయాపన చేయకూడదని వ్యాఖ్యానించింది. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నికను మూడు వారాల్లో పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏప్రిల్ 4న ఈ ఎన్నికలను భారీబందోబస్తు మధ్య పూర్తి చేశారు.

కాంగ్రెస్‌కు సీపీఐ షాక్

అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఐ భారీ షాక్ ఇచ్చింది. అధికారం కోసం మిత్రపక్షాన్ని పక్కనబెట్టింది. క్యాతనపల్లిలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. వాటిలో సీపీఐ 4, బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, ఇతరులు 1 గెలిచారు. ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగాలంటే ఒక పక్షం కనీసం 13 వార్డులు గెలిచి ఉండాలి. అయితే ఇక్కడ అధికారం కోసం సీపీఐ మైండ్ గేమ్ ఆడింది. రాష్ట్ర రాజకీయాల్లో మిత్రపక్షంగా ఉన్నా.. ఇక్కడకూడా కాంగ్రెస్‌తో జతకట్టడం వల్ల లాభం ఏమీ ఉండదని గ్రహించింది. కాంగ్రెస్, సీపీఐ జోడీ అయితే వారి వార్డుల సంఖ్య 11గా ఉండేది. కాబట్టి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు అర్హత రాదు. అందుకే సీపీఐ తెలివిగా బీఆర్ఎస్‌తో జతకట్టింది. వీరిద్దరి కూటమితో వీరి వార్డుల సంఖ్య 14కు చేరి ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తమ మద్దతు ఇచ్చినందుకు గానూ సీపీఐ వైస్‌ఛైర్‌పర్సన్ పదవిని పట్టింది. ఈ కారణంగానే మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్‌పర్సన్‌ల అధికారిక ప్రకటనకు కాంగ్రెస్ దూరం పాటించింది.

Read More
Next Story