
కేసీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినందుకే ‘గూడెం’ను మినహాయించిందా ?
గూడెంమినహా మిగిలిన తొమ్మిది మంది ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడాల్సిందే అని హైకోర్టులో కేసులు దాఖలుచేసింది
పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలకు సంబంధించి ఒక్కరి విషయంలో బీఆర్ఎస్ కీలకమైన నిర్ణయం తీసుకున్నది. దాదాపు రెండేళ్ళుగా పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏలపైన అనర్హత వేటు పడాల్సిందే అని న్యాయపోరాటం చేస్తున్న బీఆర్ఎస్, తాజాగా గూడెం మహిపాల్ రెడ్డిని మినహాయించింది. గూడెంమినహా మిగిలిన తొమ్మిది మంది ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడాల్సిందే అని హైకోర్టులో కేసులు దాఖలుచేసింది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన పదిమంది ఎంఎల్ఏలు గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, అరెకపూడి గాంధి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.
వీరంతా కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు కాబట్టి వీరందరిపైన అనర్హత వేటుపడాల్సిందే అని బీఆర్ఎస్ దాదాపు రెండేళ్ళుగా న్యాయపోరాటం చేస్తోంది. సుప్రింకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పదిమంది ఎంఎల్ఏల అనర్హతపై విచారణ జరిపారు. పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు అనేందుకు బీఆర్ఎస్ ఆధారాలను చూపటంలో విఫలమైందని స్పీకర్ తీర్పుచెప్పారు. అంటే పదిమంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్పేశారు.
స్పీకర్ తీర్పు ఆధారంగా బీఆర్ఎస్ దాఖలుచేసిన కేసులను సుప్రింకోర్టు కొట్టేసింది. దాంతో బీఆర్ఎస్ మళ్ళీ హైకోర్టులో కేసులు దాఖలుచేసింది. విచిత్రం ఏమిటంటే సుప్రింకోర్టులో పదిమంది ఎంఎల్ఏలపైన అనర్హత వేటు పడాల్సిందే అని కేసులు వేసిన బీఆర్ఎస్ తాజాగా హైకోర్టులో మాత్రం తొమ్మిదిమంది ఎంఎల్ఎలపైన అనర్హత వేటు పడాలని కేసులు వేసింది. అంటే ఒక ఎంఎల్ఏని బీఆర్ఎస్ మినహాయించినట్లు అర్ధమవుతోంది. ఆ ఒక్క ఎంఎల్ఏ ఎవరు ? ఎవరంటే పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి. ఎందుకు మినహాయించింది అంటే కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల కారణంగా గూడెం యూటర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గూడెం తిరిగి బీఆర్ఎస్ కు దగ్గరయ్యారు.
అందుకనే గూడెంను మినహాయించి మిగిలిన తొమ్మిది మంది ఎంఎల్ఏలపైన అనర్హత వేటుకు బీఆర్ఎస్ హైకోర్టులో కేసులు దాఖలుచేసింది. గూడెం ఎందుకు యూటర్న్ తీసుకున్నారంటే స్వతహాగా గూడెం వ్యాపారవేత్త. ఈయనకు రియల్ ఎస్టేట్, గ్రానైట్ తదితర వ్యాపారాలున్నాయి. ప్రభుత్వం నుండి ఏదో ఆశించి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అయితే తాను ఆశించినవి ఏవీ దక్కకపోగా తమ్ముడిమీద కేసులు నమోదవ్వటం, మద్దతుదారులపైన కేసులు పడి అరెస్టయ్యారు. దాంతో గూడెంకు ప్రభుత్వంపైన మండిపోయింది. ఏదో ఆశించి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తే ఇంకేదో జరుగుతోంది అన్నది అర్ధమైపోయింది. అందుకనే కాంగ్రెస్ కు దూరమయ్యారు. ఈ నేపధ్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్నీ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీఆర్ఎస్ ఎలా గెలిచిందంటే గూడెం కారణంగానే. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ను గెలిపించి కేసీఆర్ కు బర్త్ డే గిఫ్డ్ ఇచ్చానని స్వయంగా గూడెమే ప్రకటించారు.
అందుకనే పార్టీకి దగ్గరైన గూడెంను మినహాయించి మిగిలిన తొమ్మిదిమంది ఎంఎల్ఏలపైన అనర్హత వేటుకోసం బీఆర్ఎస్ పోరాటంచేస్తోంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏల్లో ఒక్కరిని కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేదిలేదని ఆమధ్య కేటీఆర్ పదేపదే మీడియాతో పాటు పార్టీ సమావేశాల్లో కూడా ప్రకటించారు. అలాంటిది ఇపుడు గూడెం అనర్హత విషయంలో బీఆర్ఎస్ ఎందుకు మినహాయింపు ఇచ్చింది ? ఎందుకంటే కేటీఆర్ చెప్పిందంతా ఉత్త కబుర్లే కాబట్టి. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన వారిని ఎలాగైనా సరే తిరిగి పార్టీలోకి లాక్కోవాలని అనుకున్నారు. మామూలుగా పిలిస్తే రారుకాబట్టి వాళ్ళతో మైండ్ గేమ్ ఆడారు. అయితే ఫిరాయింపుల్లో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు కాబట్టి తిరిగి పార్టీవైపు చూడలేదు. గూడెం ఆశించింది దక్కలేదు కాబట్టే తిరిగి బీఆర్ఎస్ కు దగ్గరయ్యారు. ఎలాగూ వచ్చారు కాబట్టి కేటీఆర్ కూడా గూడెంను దగ్గరకు తీసుకున్నారంతే.

