
పరువు దక్కించుకున్న బీఆర్ఎస్
రెండు స్ధానాలకు ఇద్దరే నామినేషన్లు వేయటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లే
నిజంగా కారుపార్టీ తెలివైన నిర్ణయం తీసుకున్నది. లేకపోతే పరువుపోయేదే అనటంలో ఎలాంటి సందేహంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే గురువారం సాయంత్రంతో ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగా ఉండిపోయింది. ఈరోజు ముగిసిన రాజ్యసభ ఎంపీల నామినేషన్లతో రెండుస్ధానాలను అధికార కాంగ్రెస్ పార్టీయే దక్కించుకున్నది. సిట్టింగ్ ఎంపీగా అభిషేక్ మను సింఘ్వీ రెన్యువల్ అవకాశం దక్కించుకోగా ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి రెండో అభ్యర్ధిగా నామినేషన్ వేశాడు. రెండు స్ధానాలకు ఇద్దరే నామినేషన్లు వేయటంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లే.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రెండు స్ధానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన దగ్గరనుండి బీఆర్ఎస్ తరపున పోటీ ఉంటుందనే ప్రచారం విపరీతంగా జరిగింది. పార్టీ అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా అభ్యర్ధిని పోటీలోకి దింపటం పక్కా అనే లీకులైతే ఇచ్చింది. రేవంత్ ను తీవ్రస్ధాయిలో వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ రెండు స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎందుకు గెలిపించాలనే ధోరణితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మజ్లిస్ ఎంఎల్ఏలతో మాట్లాడుకుని, రేవంత్ వ్యతిరేకులతో మాట్లాడుకుంటే గెలుపు ఖాయమని కారుపార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు జరిగిన ప్రచారం ప్రకారం బీఆర్ఎస్ తరపున పోటీ ఉంటుందేమో అనే అనుమానాలు పెరిగిపోయాయి.
నిజానికి బీఆర్ఎస్ పోటీలోకి దిగినా గెలిచే అవకాశాలు లేవనే చెప్పాలి. అయినా సరే ఏవేవో సమీకరణలను పార్టీ మీడియాలో ప్రచారంలోకి తెచ్చింది. అసెంబ్లీవర్గాల సమాచారం ప్రకారం రెండుస్ధానాల్లో అభ్యర్ధులు గెలవాలంటే ఒక్కో అభ్యర్ధికి 41 ఓట్లు పడాలి. ఈ సంఖ్య టోటల్ వ్యాలీడ్ ఓట్ల ఆధారంగా గెలుపు లెక్క మారిపోతుంది. మొదటి అభ్యర్ధికి 41 ఓట్లు రాగానే రెండో అభ్యర్ధికి ఎన్ని అవసరం అన్నది మొత్తం ఓట్లలో వ్యాలీడ్ ఓట్లను బట్టి అసెంబ్లీ అధికారులు డిసైడ్ చేస్తారు. రాజ్యసభ ఓటింగులో ప్రిఫరెన్షియల్ ఓటింగ్ పద్దతిలోనే విజేతలను ప్రకటిస్తారు. ఇది బాగా క్లిష్టమైన ఎన్నిక ప్రక్రియ. ఒకపట్టాన చాలామందికి అర్ధంకాదు. పైగా రాజ్యసభ ఎన్నికలో విప్ చెల్లదు. కాబట్టి ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ఓట్లు వేసుకోవచ్చు.
ఇవి గెలుపు లెక్కలు
అసెంబ్లీలోని బలాల ప్రకారం కాంగ్రెస్ కు 66 మంది ఎంఎల్ఏలున్నారు. అంటే కాంగ్రెస్ కు 66 ఓట్లున్నట్లు లెక్క. అలాగే బీఆర్ఎస్ కు 37 ఓట్లు, మజ్లిస్ కు 7, బీజేపీకి 8, సీపీఐకి 1 ఓటుంది. ఇపుడు కాంగ్రెస్+సీపీఐ మిత్రపక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతిస్తోంది. కాబట్టి కాంగ్రెస్ బలం 74 ఓట్లు. ఇక బీఆర్ఎస్ బలం అసెంబ్లీ రికార్డుల ప్రకారం 37 ఓట్లయినా 9 మంది కాంగ్రెస్ కు దగ్గరగా ఉంటున్నారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించినా ఈమధ్యనే ఒక ఎంఎల్ఏ మళ్ళీ కారుపార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వాస్తవ బలం 28 అనుకోవాలి.
కాంగ్రెస్ బలం 74+బీఆర్ఎస్ ఫిరాయింపులు 9 మంది కలిపితే బలం 83గా ఉంటుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ బలం 28. 28 ఓట్లతో పోటీకి దింపితే అభ్యర్ధి ఎలా గెలుస్తాడు ? అసలే ఈమధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక, మున్సిపల్ ఎన్నికల్లో వరుస పరాజయాలతో పరువు పోయింది. ఇపుడు బలంలేకున్నా పోటీలోకి దిగితే ఉన్న కాస్త పరువు కూడా మూసీనదిలో కలిసిపోవటం ఖాయం. అందుకనే ఈలెక్కలన్నీ వేసుకున్న తర్వాత చివరి నిముషంలో పోటీలోకి దిగి పరువు పోగొట్టుకోవటం కన్నా దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించుకున్నట్లున్నారు.

