బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్
x
BRS working President KTR

బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్

కార్పొరేషన్లలో ఓడినందుకు కాదు కనీసం ఒక్క కార్పొరేషన్లో కూడా ఇటు కాంగ్రెస్ కు కాని అటు బీజేపీ కాని గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది


తెలంగాణలోని ఏడు కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే చెప్పాలి. ఇలాంటి ఫలితం ఎదురవుతుందని బహుశా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఏమాత్రం ఊహించుండరనే చెప్పాలి. 11వ తేదీన జరిగిన పోలింగ్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. రాష్ట్రంలో పది కార్పొరేషన్లుండగా ఇపుడు ఏడు కార్పొరేషన్లలో మాత్రమే ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెం, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కు సంబంధించి కడపటి వార్తలు అందేసమయానికి (T Congress)కాంగ్రెస్ నాలుగు చోట్ల గెలవగా, బీజేపీ(T BJP) 2 కార్పొరేషన్లలో గెలుపుదిశగా దూసుకుపోతోంది. మరో మరో కార్పొరేషన్ ఫలితం ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. వెల్లడైన ఫలితాలను బట్టి బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి.

ఎందుకంటే కార్పొరేషన్లలో ఓడినందుకు కాదు కనీసం ఒక్క కార్పొరేషన్లో కూడా ఇటు కాంగ్రెస్ కు కాని అటు బీజేపీ కాని గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. రామగుండం, నల్గొండ, మంచిర్యాల, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలిచింది. అయితే ఫలితాలు అధికారికంగా వెల్లడి కావాల్సుంది. రామగుండం కార్పొరేషన్లోని 60 డివిజన్లలో కాంగ్రెస్ 38 గెలుచుకున్నది కాబట్టి గెలిచినట్లే. అలాగే మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 44 చోట్ల గెలిచింది కాబట్టి ఇక్కడ కూడా గెలిచినట్లే అనుకోవాలి. మహబూబ్ నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 30 డివిజన్ల ఫలితాలు వచ్చాయి. ఫలితాలు ప్రకటించిన వాటిల్లో కాంగ్రెస్ 15 డివిజన్లలో, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 3 డివిజన్లలో గెలిచారు. నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో 9 డివిజన్ల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. వీటిల్లో కాంగ్రెస్ 2 చోట్ల, బీజేపీ 5 డివిజన్లలో, ఇతరులు 2 చోట్ల గెలిచారు. బీఆర్ఎస్ ఇప్పటివరకు బోణికొట్టలేదు. 51 డివిజన్ల ఫలితాలు ఇంకా రావాల్సుంది.

కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లున్నాయి. వీటిల్లో ఇప్పటికి 34 చోట్ల మాత్రమే ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ 22 చోట్ల, కాంగ్రెస్ ఏడు డివిజన్లలో, బీఆర్ఎస్ 4 డివిజన్లలో గెలవగా, ఇతరులు ఒక డివిజన్లో గెలిచారు. నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లున్నాయి. వీటిలో కాంగ్రెస్ 27 చోట్ల, బీఆర్ఎస్ 9 డివిజన్లలో, బీజేపీ 4 చోట్ల, ఇతరులు 8 డివిజన్లలో గెలిచారు. సో, అందుబాటులోని కడపటి సమాచారం ప్రకారం రామంగుండం, నల్గొండ, మంచిర్యాల, కార్పొరేషన్లను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకున్నది. కొత్తగూడెంలో 60 డివిజన్లున్నాయి. ఇందులో ఇతరులు 29 డివిజన్లలో గెలిచారు. ఇతరులు అంటే మ్యాగ్జిమమ్ సీపీఐ అభ్యర్ధులే గెలిచారు. ఇక కాంగ్రెస్ 22 చోట్ల, బీఆర్ఎస్ 8 డివిజన్లలో గెలవగా బీజేపీ ఒక చోట గెలిచింది.

గెలిచినవి పోను ఫలితాలు వెల్లడవ్వాల్సిన కార్పొరేన్లలో కూడా ఎందులోను బీఆర్ఎస్ కనీసమాత్రపు పోటీకూడా ఇవ్వలేకపోయింది. అందువల్లే ఏడు కార్పొరేషన్లలో ఎక్కడ కూడా కారుపార్టీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ కార్పొరేషన్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అని అర్దమైపోయింది. కేటీఆర్, హరీష్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా జనాలు పెద్దగా పట్టించుకోలేదని అర్ధమవుతోంది. ఎలాగంటే కొత్తగూడెం, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో సింగరేణి ఉద్యోగుల ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొద్దిరోజులుగా పై కార్పొరేషన్లలో గెలుపే టార్గెట్ గా కేటీఆర్, హరీష్ పదేపదే రేవంత్ పై సింగరేణిని దోచుకుంటున్నాడనే ఆరోపణలతో హోరెత్తించేసిన విషయం తెలిసిందే. తాజా ఫలితాలను చూస్తే వీళ్ళ ఆరోపణలను సింగరేణి ఓటర్లు పట్టించుకోలేదని అర్ధమవుతోంది.

Read More
Next Story