కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న కేసులు, విచారణలు
x
Kalvakuntla family and Harish Rao

కేసీఆర్ కుటుంబాన్ని వెంటాడుతున్న కేసులు, విచారణలు

అధినేత కుటుంబంలో యాక్టివ్ పాలిటిక్స్ లోని అందరిపైనా ఏదో ఒక కేసు, విచారణ జరగటం బహుశా కల్వకుంట్ల కుటుంబంలో మాత్రమే జరుగుతున్నదేమో


కేసులు, విచారణల్లో దేశరాజకీయాల్లోనే తెలంగాణ ప్రత్యేకంగా నిలుస్తుందేమో. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒకపార్టీ అధినేత కుటుంబంలో యాక్టివ్ పాలిటిక్స్ లోని అందరిపైనా ఏదో ఒక కేసు, విచారణ జరగటం బహుశా కల్వకుంట్ల కుటుంబంలో మాత్రమే జరుగుతున్నదేమో. విషయం ఏమిటంటే(KCR)కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్), కొడుకు కల్వకుంట్ల తారకరామారావు(KTR), కూతురు (Kavitha)కల్వకుంట్ల కవిత, మేనల్లుడు (Harish Rao)తన్నీరు హరీష్ రావులు కేసులు, విచారణలను ఎదుర్కొంటున్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన దగ్గర నుండి కేసులు, విచారణలతో కల్వకుంట్ల కుటుంబం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కేసీఆర్ కుటుంబానికి తోడు మేనల్లుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావును కూడా కేసులు, విచారణలు వెంటాడుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు కొడుకు కేటీఆర్, కూతురు కల్వకుంట్ల కవిత మీద కూడా కేసులు నమోదై విచారణలు జరుగుతున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టుల స్కామ్ లో కేసీఆర్, హరీష్ మీద విచారణలు జరిగాయి. కాళేశ్వరం అవినీతి మీద సీబీఐతో విచారణ చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మూడునెలలైనా ఎలాంటి సమాధానం రాలేదు.

ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్

టెలిఫోన్ ట్యాపింగులో కూడా కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ట్యాపింగ్ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేస్తోంది. ఈ విచారణకు తాజాగా హరీష్ రావు హాజరయ్యారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు అవినీతి కేసులో కేటీఆర్ మీద ఏసీబీ, ఈడీలు కేసులు నమోదుచేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి కూడా ఇచ్చారు. ఇక కూతురు కవితేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆరుమాసాలు తీహార్ జైలులో ఉండి ప్రస్తుతం బెయిల్ పైన బయట తిరుగుతున్నారు.


కాళేశ్వరం ఆరోపణల్లో కేసీఆర్, హరీష్


కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ తేల్చిచెప్పింది. ఇదే విషయమై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా అవినీతికి కేసీఆర్, హరీష్ తో పాటు మరికొందరి పాత్ర ఉందని తేల్చిచెప్పింది. కమిషన్ రిపోర్టు ఆధారంగా రేవంత్ ప్రభుత్వం తమపై యాక్షన్ తీసుకోకుండా స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇదే సందర్భంలో కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని కేంద్రహోంశాఖను రేవంత్ ప్రభుత్వం కోరింది. సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ ప్రభుత్వం మూడునెలల క్రితం హోంశాఖకు లేఖ రాసినా ఇప్పటివరకు సమాధానం రాలేదు.


ఫార్ములా కేసులో కేటీఆర్


ఫార్ములా ఈ కార్ రేసు పేరుతో రు. 50 కోట్ల అవినీతి జరిగిందని ఏసీబీ విచారణలో తేలింది. అవినీతికి ప్రధాన బాధ్యుడు అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్, మున్సిపల్ శాఖకు ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ అని ఏసీబీ విచారణలో బయటపడింది. కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలని ఏసీబీ రిక్వెస్టును గవర్నర్ ఆమోదించారు. ఈ కేసును ఏసీబీతో పాటు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా విచారిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసులో మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ విచారిస్తోంది. కేటీఆర్ మీద కేసు నమోదుచేసి అరెస్టు చేయాలంటే అందుకు బలమైన సాక్ష్యం అవసరం. కేటీఆర్ అవినీతి, అధికార దుర్వినియోగానికి అర్వింద్ కుమార్ సాక్షిగా ఉంటాడని ఏసీబీ భావిస్తోంది. అర్వింద్ అప్రూవర్ గా మారిపోయాడనే ప్రచారం జరుగుతోంది.

అందుకనే అర్వింద్ మీద కూడా కేసుపెట్టి యాక్షన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రహోంశాఖ పరిధిలోని డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్(DOPT) కు లేఖ రాసి రెండునెలలు అవుతున్నా ఇప్పటివరకు సమాధానం రాలేదు. డీవోపీటీ గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే కేటీఆర్, అర్వింద్ మీద యాక్షన్ కు ఏసీబీ రెడీగా ఉంది.

కేసీఆర్, కేటీఆర్ పై ఆరోపణలు


ఇక టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్, కేటీఆరే ప్రధాన సూత్రదారులని అందరికీ తెలుసు. అయితే అందుకు బలమైన సాక్ష్యం కావాలి. అప్పట్లో ఇంటెలిజెన్స్ బాస్ గా పనిచేసిన టీ ప్రభాకరరావును సిట్ విచారించినా ఉపయోగం కనబడలేదు. ప్రభాకరరావు ఆదేశాలతోనే తాము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా నలుగురు పోలీసు అధికారులు రాధాకిషన్ రావు, తిరుపతయ్య, భుజంగరావు, ప్రణీత్ రావు సిట్ విచారణలో అంగీకరించారు. ఇదే విషయాన్ని ఈ నలుగురు అధికారులు కోర్టులో కూడా అంగీకరించారు. టెలిఫోన్లను ట్యాపింగ్ చేయమని ఈ నలుగురికి ఆదేశాలు ఇచ్చింది టీ ప్రభాకరరావే అన్న విషయం సాక్ష్యాలతో నిర్దారణైంది. అయితే ఎవరు ఆదేశిస్తే ప్రభాకరరావు ఫోన్లు ట్యాప్ చేయమని పై నలుగురు పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్న విషయమే తేలాలి.

కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతోనే వేలాది టెలిఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు, కేంద్రమంత్రి బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే అందుకు సాక్ష్యాలు మాత్రం లేవు. ప్రభాకరరావు నోరిప్పి అసలు విషయం చెబితే కాని కేసీఆర్, కేటీఆర్ మీద యాక్షన్ తీసుకునేందుకు లేదు. ఆ ప్రయత్నంలోనే సిట్ అధికారులున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం సిట్ అధికారులు హరీష్ ను విచారించింది.

లిక్కర్ స్కామ్ లో కవిత


కవిత విషయం చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఇప్పటికే ఆరుమాసాలు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. అతికష్టంమీద బెయిల్ తెచ్చుకుని ప్రస్తుతం బయట తిరుగుతున్నారు. బెయిల్ గనుక రద్దయితే వెంటనే ఆమె మళ్ళీ జైలుకు వెళ్ళాల్సిందే. మొత్తంమీద చూస్తే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ అందరు కేసులు, విచారణలను ఎదుర్కొంటున్నారు. సీబీఐ కేసును టేకప్ చేస్తే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల అవినీతిలో కేసీఆర్, హరీష్ మీద కేసులు నమోదవ్వటం ఖాయం. అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారిపోతే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ అరెస్టు ఖాయం. లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీలు అవినీతిని నిరూపిస్తే కవితకు జైలు తప్పదు. పై నలుగురు విచారణలు, కేసుల్లో ఇరుక్కుంటే బీఆర్ఎస్ భవిష్యత్తు ఏమిటన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు.

అందరు దొంగలే : కూరపాటి

కల్వకుంట్ల కుటుంబంలో అందరు దొంగలే అని ప్రొఫెసర్ కూరపాటి ఘాటుగా స్పందించారు. కల్వకుంట్ల కుటుంబపై కేసులు, విచారణలపై తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘తొమ్మిదిన్నరేళ్ళ అధికారంలో కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు’’ అని మండిపోయారు. ‘‘వేలాదిమంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం తన సొంతానికి వాడుకున్నది’’ అని ఎద్దేవాచేశారు. ‘‘రాష్ట్రాన్ని నాశనంచేసి తమ కుటుంబాన్ని బాగుచేసుకోవటం కోసమే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు’’ అని ఆరోపించారు. ‘‘కుటుంబంలోని అందరు అడ్డదిడ్డమైన దోపిడి కారణంగా ఏదో ఒక కేసులో ఇరుక్కున్నారు’’ అని చెప్పారు.

Read More
Next Story