
కేంద్రమంత్రి పాదయాత్రలో తేనెటీగల దాడి
అక్కడే ఎత్తైన చెట్టుపైన ఉన్న తేనెతుట్టెకు ద్రోన్ కెమెరా తగిలింది.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ తృటిలో ప్రమాదంనుండి తప్పించుకున్నారు. శనివారం ఉదయం కరీంనగర్ పట్టణం నుండి బండి పాదయాత్ర మొదలుపెట్టారు. పాదయాత్ర ఎందుకంటే ఇదో మొక్కుబడి యాత్రనే చెప్పాలి. ఈమధ్యనే జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ గెలిస్తే కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి నడిచొస్తానని మొక్కుకున్నారు. మొక్కుకున్నట్లుగానే కార్పొరేషన్లో బీజేపీ గెలిచింది. అందుకనే ఈరోజు మేయర్, కార్పొరేటర్లు, పార్టీనేతలతో కలిసి బండి పాదయాత్రగా ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరారు.
మార్గమధ్యలోని రామడుగు మండలంలో జనాలు పెద్దఎత్తున తరలివచ్చారు. దాంతో తన అడుగుల వేగాన్ని తగ్గించిన కేంద్రమంత్రి వారితో మాట్లాడుతు సమస్యలు వింటు పాదయాత్ర చేశారు. రామడుగు మండలం కోన్ రావుపేట సమీపంలోకి వచ్చేసరికి మరింతమంది కార్యకర్తలు తోడయ్యారు. దాంతో జోష్ పెరిగిపోయిన నేతలు పాదయాత్రలో కార్యకర్తలు జాయిన్ అవటాన్ని చిత్రీకరించాలని అనుకున్నారు. వెంటనే ద్రోన్ కెమెరాను గాలిలోకి ఎగరేశారు. ఎత్తునుండి వీడియో తీస్తే కేంద్రమంత్రితో పాటు మొత్తం జనాలంతా కెమెరాలో పడతారని భావించిన కొందరు ద్రోన్ కెమెరాను మరింత ఎత్తుకు తీసుకెళ్ళారు.
అయితే అక్కడే ఎత్తైన చెట్టుపైన ఉన్న తేనెతుట్టెకు ద్రోన్ కెమెరా తగిలింది. ఇంకేముంది ఒక్కసారిగా తుట్టెలోనుండి తేనెటీగలు బయటకు వచ్చి జనాలమీదకు దాడిచేశాయి. దాంతో ఒక్కసారిగా గందరగోళం జరిగి ఎవరికి అవకాశం ఉన్న వైపుకు నేతలు, కార్యకర్తలంతా ఒకటే పరుగు. అప్పటికే కొందరు కార్యకర్తలపైకి తేనెటీగలు దాడులు చేసి బాగా కుట్టేశాయి. ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన బండి భద్రతాసిబ్బంది జాగ్రత్తలు తీసుకోవటంతో పెద్ద ప్రమాదంనుండి బయటపడ్డారు. అయితే అప్పటికే కొందరు కార్యకర్తలను ఈగలు బాగా కుట్టడంతో బండి వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్సలు చేయించారు. డాక్టర్ల వైద్యంతో కార్యకర్తలు కాస్త తేరుకోగానే బండి మళ్ళీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి పాదయాత్ర ప్రారంభించారు.

