
ప్రజల జీవిత్తాల్లో మార్పు తేవాలన్నదే మా సంకల్పం: రేవంత్
ప్రజల జీవితాల్లో మార్పు తేవడమే లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంపై కీలక సందేశం ఇచ్చారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ ప్రధాన సంకల్పమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రజల బాగోగుల కోసం తమ ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేరళ ఎన్నికల ప్రచారంలో బాల్గొంటున్న రేవంత్.. తెలంగాణ ప్రజల కోసం తన మెసేజ్‌ను పంపారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు దాటిన సందర్భంలో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన లోపాలను సరిచేస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తమ ప్రభుత్వం పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తోందని ఆయన భావన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ప్రతి నిర్ణయం ప్రజల మేలు దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన విజయాలు ప్రజల మద్దతుకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డట్లు తెలిపారు. ఈ మద్దతు తమపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో కొనసాగుతోందని వివరించారు.
ప్రతి అధికారి గ్రామ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడం, పారదర్శకత పాటించడం వంటి అంశాలు ముఖ్యమని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగాలని కూడా తెలిపారు. మొత్తంగా ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని భావిస్తున్నారు.

