
మున్సి‘పోల్స్’పై సీఎం స్పెషల్ ఫోకస్
మెదక్ పర్యటనను రద్దు చేసుకుని మరీ మంత్రులతో ప్రత్యేక సమావేశం.
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించింది. ప్రచారానికి ఆఖరు రోజు కావడంతో సోమవారం ఉదయం 6:30 గంటలకే మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జూమ్‌లో జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. మంత్రులకు పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా అంతా కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. నిజానికి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాంటి ఒక్కసారిగా తన మెదక్ పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారు. ఎందుకు అంటే.. మంత్రులతో అత్యవసర భేటీ అవడం కోసమే.
ఉదయాన్నే మంత్రులు, పార్టీలోని కీలక నేతలతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఇందులో మున్సిపల్ ఎన్నికల సమయంలో నడుచుకోవాల్సిన పద్దతులపై వివరించారు. అంతా సమన్వయంతో పనిచేసి పార్టీని గెలిపించాలని తెలిపారు. ఈ సమావేశంలో బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో పోలింగ్ వ్యూహాలపై చర్చించారు. స్థానిక నేతల నేతృత్వంలో పోల్ మేనేజ్‌మెంట్ జరిగేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం, బుధవారాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండాలని సూచించారు.
అత్యవసర సమావేశం అందుకేనా..!
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం ఆఖరి రోజు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార రథాలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో ఆఖరి రోజు గట్టిగా ప్రచారం చేయాలని ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. అదే విధంగా అన్ని మున్సిపాలిటీల్లో స్థానిక నేతలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పోలింగ్ వ్యూహాలపై చర్చించడం కోసమే రేవంత్.. ఉదయాన్నే అత్యవసర సమావేశం నిర్వహించారని పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అందుకోసమే మెదక్ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారని వివరిస్తున్నాయి.
సాయంత్రం నుంచి వాటికి ఫుల్ స్టాప్
ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలకు ప్రచారాం ముగియనుంది. ఆ తర్వాత ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి అనుమతి ఉండదు. వాటిని నిర్వహస్తే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా పోలింగ్ గడువు ముగిసిన తర్వాత బయట నుంచి మున్సిపాలిటీలోకి వచ్చిన నేతలను తిరిగి వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తారు. ఒకవేళ అదే మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ పోలింగ్ రోజు బయటకు రాకూడదన్న నిబంధన ఉంది. అభ్యర్థికి మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతి ఉంటుంది. వాళ్లకి కూడా పలు నిబంధనలు, పరిమితులు ఉంటాయి.

