
‘మహబూబ్‌నగర్‌ను మహా నగరంగా తీర్చిదిద్దుతాం’
పదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన జిల్లా పాలమూరు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి నోచుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు తమ, తమ కుటుంబీకుల అభివృద్ధినే చూసుకున్నారని, రాష్ట్ర మేలు గాలికి వదిలేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్‌ను మహానగరంలా తీర్చిదిద్దే బాధ్యత తనదని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.1,284 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే నిర్వహించిన సభలో పాల్గొన్న రేవంత్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా అందులో పాలమూడు బిడ్డ శ్రమ ఉంటుందని అన్నారు. గత పాలకులు పలు జిల్లాలను తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు వెలుగు తీసుకురావాలనే లక్ష్యంతో నూతన సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. త్రిబుల్ ఐటీ ఏర్పాటు చేయడంతో పాటు మహబూబ్‌నగర్ కేంద్రంగా వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాను విద్య సాగునీటి రంగాల్లో ముందంజలో నిలిపే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
దేశంలో ఎక్కడ సాగునీటి ప్రాజెక్టు నిర్మించినా అందులో పాలమూరు బిడ్డలే కీలకంగా పనిచేస్తారని సీఎం పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం విద్యా అవకాశాలు లభించకపోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని తెలిపారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన మండలంగా గట్టు మండలాన్ని గుర్తించామని అన్నారు. గత ప్రభుత్వాలు తగిన నిధులు కేటాయించకపోవడమే పాలమూరు వెనుకబాటుకు కారణమని విమర్శించారు.
గత పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదని సీఎం ఆరోపించారు. భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ జూరాల పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి వంటి కీలక ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తికాలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వ కాలంలో కనీసం ఒక కొత్త ప్రాజెక్టుకైనా పూర్తి అనుమతులు ఇచ్చారా అని ప్రశ్నించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరిగిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డీకే అరుణ యన్నం శ్రీనివాస్ రెడ్డి కృషితో ఈ ప్రాజెక్టుకు అనుమతులు లభించాయని తెలిపారు. పదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు ఖర్చు చేసినా నిర్వాసితులకు పరిహారం ఇవ్వలేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్దండపూర్ రైతులకు పరిహారం చెల్లించామని చెప్పారు. సంగంబండ వద్ద బండ పగలగొట్టేందుకు అప్పుడే రూ.12 కోట్లు కేటాయించి ఉంటే వేల ఎకరాలకు నీరు అందేదని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ పనికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కల్వకుర్తి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు గతంలో పరిహారం ఇవ్వలేదని సీఎం విమర్శించారు. తాను సీఎం అయిన తరువాత భూసేకరణ కోసం రూ.75 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం సులభంగా రాలేదని స్పష్టం చేశారు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటాడి సర్వేకు నిధులు మంజూరు చేయించానని చెప్పారు.
2014లో రూ.2000 కోట్లతో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి అనుమతి సాధించామని సీఎం గుర్తుచేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినా మహబూబ్‌నగర్ జిల్లాకు న్యాయం జరగలేదని అన్నారు. మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి 96 శాతం రైతుల సమ్మతి తీసుకుని వంద రోజుల్లో నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. జూరాల ప్రాజెక్టుపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.123 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
బూర్గుల రామకృష్ణారావు తరువాత 75 ఏళ్లకు మహబూబ్‌నగర్ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని సీఎం తెలిపారు. సభలు పెట్టి ఆరోపణలు చేయడం కాదు అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ సవాల్ విసిరినట్లు చెప్పారు. నీళ్లు నిజాలపై అసెంబ్లీలో రోజంతా చర్చ పెట్టామని వివరించారు.
దేశంలో ఎవరు తెలంగాణకు వచ్చినా సాగునీటి విద్యా రంగాల్లో పాలమూరు జిల్లానే చూపించాలన్నదే తన కల అని సీఎం తెలిపారు. గతంలో పేదరికాన్ని చూపించేందుకు పాలమూరుకు తీసుకువచ్చేవారని ఇకపై అలా జరగదని స్పష్టం చేశారు. పాలమూరును అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని చదువే జీవితాలను మార్చే శక్తి అని సీఎం అన్నారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. పాలమూరు ఎస్ ఎల్ బీసీ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాలతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించారు.
పేదరికాన్ని తరిమికొట్టడమే తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పాలమూరు జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మహబూబ్‌నగర్‌కు వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తానని వెల్లడించారు.

