
మేడారంలో క్యాబినెట్ మీటింగ్ చారిత్రక క్షణం: సీఎం రేవంత్ రెడ్డి
ఫిబ్రవరి 6, 2023న మేడారంలో చేసిన మొక్కు అభివృద్ధి రూపంలో తీర్చుకున్నానని అన్నారు సీఎం రేవంత్.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం ఒక చారిత్రక అంశమని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బయట క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి తెలిపారు. ఈ సందర్బంగానే ‘‘ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం. గుడి లేకున్నా తల్లులను గుండె నిండా కొలిచే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర ఇది. కాకతీయుల కత్తికి ఎదురుగా నిలిచిన ధీరవనితలు సమ్మక్క–సారలమ్మల త్యాగానికి ప్రతీకగా మేడారం నిలుస్తోంది’’ అని అన్నారు. దక్షిణాది కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. హైదరాబాద్ వెలుపల తొలిసారి మంత్రివర్గ సమావేశం జరగడం మేడారం ప్రత్యేకతను మరింత పెంచింది.
2023 ఫిబ్రవరి 6న ఇదే మేడారం నుంచి ప్రజా కంఠక పాలనకు ముగింపు పలకాలని పాదయాత్ర ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. తల్లుల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మేడారం అభివృద్ధి చేయడం తన జీవితంలో అరుదైన, గర్వపడే అవకాశమని వెల్లడించారు. సమ్మక్క–సారలమ్మ తల్లుల ప్రాంగణాన్ని వంద రోజుల్లో రాతి కట్టడాలతో అభివృద్ధి చేయాలని ఆదేశించామని, జాతర నాటికి అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఫిబ్రవరి 6, 2023న మేడారంలో చేసిన మొక్కు అభివృద్ధి రూపంలో తీర్చుకున్నానని అన్నారు.
జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని, రామప్ప, లక్నవరం నుంచి నీటిని జంపన్న వాగుకు తరలించే ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం సమ్మక్క–సారలమ్మ ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని చెప్పారు. మేడారం జాతరను కుంభమేళా స్థాయిలో అత్యంత ఘనంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

