x

బొగ్గు తవ్వకాలు మొదలైతే ఉద్యమం తప్పదు

రామప్ప దేవాలయంకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు తవ్వకాలకు యాజమాన్యం సిద్ధమవుతోందని రామ్మోహన్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్పదేవాలయంకు సమీపంలో ఉన్న సింగరేణి గనుల్లో బొగ్గు తవ్వకాలు జరిపితే ఉద్యమం తప్పదని రామ్మోహన్ రావు హెచ్చరించారు. రామప్ప దేవాలయం పరిరక్షణకు దశాబ్దాలుగా రామప్ప దేవాలయ పరిరక్షణ కమిటి కన్వీనర్ గా ఆకిరెడ్డి రామ్మోహన్ రావు కృషిచేస్తున్నారు. రామప్ప దేవాలయంకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు తవ్వకాలకు యాజమాన్యం సిద్ధమవుతోందని రామ్మోహన్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

బొగ్గు గనికి 5 కిలోమీటర్ల దూరంలోని టెంపుల్ తో పాటు అంతే దూరంలో ఉన్న చెరువు కూడా ధ్వంసం అయిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బొగ్గు తవ్వకాలకు యాజమాన్యం చేసే బ్లాస్టింగ్ వల్ల భూమి పొరలు బలహీనపడిపోయి అటు చెరువు గర్భంతో పాటు ఇటు రామప్ప దేవాలయం పునాదులు కూడా పూర్తిగా దెబ్బతింటాయి. పునాదులు లేకుండా శాండ్ బాక్స్ పద్దతిలో మట్టినే పునాదులుగా మలుచుకుని అద్భుతమైన టెక్నాలజీతో రామప్ప దేవాలయం నిర్మించిన విషయం తెలిసిందే.

కాకతీయుల హయాంలో 900 ఏళ్ళ క్రితం నిర్మించిన దేవాలయం పై కప్పు ఇప్పటికే బలహీనపడి వర్షం వస్తే కురుస్తోంది. ఇపుడు సింగరేణి బొగ్గు తవ్వకాలు కూడా మొదలుపెడితే పునాదులు బలహీనపడితే మొత్తం దేవాలయమే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ మొత్తం మీద యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఉనికి సింగరేణి కారణంగా ప్రశ్నార్ధకమవటం గమనార్హం.

ఇదే విషయమై స్ధానికంగా ఉన్న అన్నీ పార్టీలతోను పరిరక్షణ కమిటి మాట్లాడుతోందని రామ్మోహన్ చెప్పారు. బొగ్గు తవ్వకాలు మొదలుపెడితే దేవాలయాన్ని పరిరక్షించుకునేందుకు తెలంగాణ వ్యాప్తంగా మరో ఉద్యమం నిర్మించటం ఖాయమని రామ్మోహన్ హెచ్చరించారు. దేవాలయ పరిరక్షణను, దేవాలయ ఉనికి జరగబోయే ముప్పును దృష్టిలో పెట్టుకుని సింగరేణి బొగ్గు తవ్వకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కన్వీనర్ యాజమాన్యానికి విజ్ఞప్తిచేశారు.

Read More
Next Story