
కాంగ్రెస్ లో ‘అజర్’ పై అయోమయం
ఇపుడు హాట్ టాపిక్ ఏమిటంటే మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ భవితవ్యం ఏమిటి అనే
కాంగ్రెస్ పార్టీ నేతల ఢిల్లీ పర్యటన తర్వాత ఇపుడు హాట్ టాపిక్ ఏమిటంటే మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ భవితవ్యం ఏమిటి అనే. ఢిల్లీలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చినా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే అజరుద్దీన్ భవిష్యత్తు గురించే అని పార్టీవర్గాల సమాచారం.
సమావేశంమధ్యలో అజర్ గురించి స్వయంగా రాహూలే ప్రస్తావించారు. అజర్ ను ఏమిచేయాలని అనుకుంటున్నారని రేవంత్, బొమ్మను రాహుల్ ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించారంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని మైనారిటీల ఓట్ల కోసం శాసనసభ, శాసనమండలిలో సభ్యుడు కాని అజర్ ను సడెన్ గా మంత్రివర్గంలోకి తీసుకున్నాడు రేవంత్. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పైన చెప్పిన ఉభయసభల్లో దేనిలోను సభ్యుడుకాని వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రమాణస్వీకారం చేసిన ఆరుమాసాల్లోపు సదరు వ్యక్తి ఏదో ఒకసభలో సభ్యుడైతీరాలి. ఈ లెక్కప్రకారం అజర్ మంత్రిగా ప్రమాణం చేసింది 2025, అక్టోబర్ 31వ తేదీ. వచ్చే ఏప్రిల్ 30వ తేదీతో ఆరుమాసాలు పూర్తవుతుంది.
డెడ్ లైన్ అక్టోబర్ 30
అజహర్ ను ఉభయసభల్లో ఎందులోకి సభ్యుడిగా పంపాలని రేవంత్ అనుకుంటున్నారు అన్నవిషయంలో అందరిలోను అయోమయం పెరిగిపోతోంది. ఇప్పటివరకు రేవంత్ తన మనసులోని మాటను ఎక్కడా బయటపెట్టలేదు. మిగిలినవాళ్ళ సంగతి పక్కనపెట్టినా అజర్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. తనకున్న లాబీ ద్వారా ఇదే విషయాన్ని రాహుల్ దృష్టికి అజహర్ తీసుకెళ్ళినట్లున్నాడు. అందుకనే రేవంత్, బొమ్మ, మంత్రుల సమావేశంలో రాహుల్ ప్రత్యేకించి ప్రస్తావించింది.
రాహుల్ ప్రశ్నకు రేవంత్ బదులిస్తు గవర్నర్ కోటాలో అజర్ ను ఎంఎల్సీగా ప్రతిపాదిస్తు ప్రభుత్వం పంపిన జాబితాకు ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ లభించలేదని చెప్పారు. ఏప్రిల్ 30వ తేదీలోగా గవర్నర్ నిర్ణయం ప్రకటించకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటని రాహుల్ మళ్ళీ అడిగారు. రేవంత్ బదులిస్తు గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా ఉన్నవారిలో ఒకరితో మాట్లాడి రాజీనామా చేయించి ఆప్లేసులో అజహర్ ను ప్రతిపాదిస్తు మళ్ళీ గవర్నర్ కు జాబితా పంపాలని చెప్పినట్లు సమాచారం. ‘అయితే ఆ పనేదో మార్చినెలలోగానే పూర్తిచేయండి’ అని రేవంత్ కు రాహుల్ సూచించినట్లు తెలిసింది.
త్యాగరాజు ఎవరు ?
ఇంతవరకు ఓకేనే గాని అజర్ కోసం పదవీ త్యాగం చేయబోయే ఎంఎల్సీ ఎవరు అన్న పాయింట్ మీదే పార్టీలో బాగా చర్చ జరుగుతోంది. అజహర్ కోసం పదవీత్యాగం చేయబోయే ఎంఎల్సీని వెతికి కన్వీన్స్ చేసి రాజీనామా చేయించాల్సిన బాధ్యత ఇపుడు రేవంత్ మీదపడింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతి, బల్మూరి వెంకట్, పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, దండే విఠల్ ఉన్నారు. వీరిలో అజర్ కోసం పదవీత్యాగానికి సిద్ధపడేది ఎవరు అన్నదే కీలకమైన పాయింట్.
రేవంత్ సిఫారసుతో సంబంధంలేకుండానే అధిష్ఠానం కారణంగా విజయశాంతి ఎంఎల్సీ అయ్యారు. కాబట్టి ఆమెను రాజీనామా చేయమని అడిగే అవకాశం రేవంత్ కు లేదు. ఇక బల్మూరి వెంకట్, అద్దంకి పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. పైగా అద్దంకి ఎస్సీ నేత. పట్నం బీఆర్ఎస్ లోనుండి వచ్చి కాంగ్రెస్ లో ఎంఎల్సీ అయ్యారు కాబట్టి తనను అడిగే అవకాశంలేదు. రంగారెడ్డి జిల్లాలో పట్నం కుటుంబం చాలా బలమైన కటుంబం. ఇక బీఆర్ఎస్ నుండి ఫిరాయించిన వారిని అడిగే అవకాశాలు తక్కువే ఎందుకంటే అజర్ కోసం తామెందుకు త్యాగాలు చేయాలని ఎదురు ప్రశ్నించే అవకాశాలు ఎక్కువ. ఏ కోణంలో నుండి చూసినా అజహర్ కోసం పదవీత్యాగం చేయటానికి అవకాశంతో పాటు బాధ్యత కూడా పీసీసీ అధ్యక్షుడు బొమ్మకే ఎక్కువగా ఉంది. పార్టీ కోసం తాను త్యాగం చేయకపోతే త్యాగాలు చేయాలని ఇతరులను బొమ్మ ఎలాగ అడగగలరు ?
బొమ్మకు తప్పదా ?
ఎలాగూ పీసీసీ అధ్యక్షుడు అనే హోదా ఉంది కాబట్టి ఎంఎల్సీగా రాజీనామా చేయించి వెంటనే ఏదో కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమిస్తే క్యాబినెట్ ర్యాంకు దక్కుతుంది. భవిష్యత్తులో మళ్ళీ ఎంఎల్సీ అయ్యే అవకాశాలను కొట్టేయలేము. కాబట్టి అజర్ కోసం బొమ్మ ఒక్కళ్ళే ‘త్యాగరాజు’ అవుతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

