
కాంగ్రెస్ జీవన్ లొల్లి.. ఢిల్లీ నుంచి పిలుపు
హుటాహుటిన బయలుదేరిన మాజీ మంత్రి. కానీ దారి మధ్యలో మనసు మార్చుకున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఒక థ్రిల్లింగ్ సినిమాలో కొనసాగుతోంది. తన అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ, అధిష్టానాన్ని దెప్పిపొడుస్తున్నారు. దానికి తోడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌పై కూడా అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి చెందిన వారికి బీఫాం రాకపోవడంపై కూడా జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీపై విమర్శలనాస్త్రాలు సంధించారు. దానికి తోడు పలు సందర్భాల్లో పార్టీ పాలన వైఖరిని కూడా ఆయన తప్పుబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు, చర్యలపై జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు కాకిపుండులా తయారయ్యారన్న వాదన కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.
అర్జంట్‌గా వచ్చి కలవాలని కేసీ వేణుగోపాల్ ఫోన్ చేసినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం పిలవడం, జీవన్ రెడ్డి వెళ్లకపోవడం ఉంటుందా అని అంతా అనుకున్నారు. అదే విధంగా జీవన్ రెడ్డి కూడా జగిత్యాల నుంచి హుటాహుటిన ఢిల్లీకి పయనం అయ్యారు. ఇంతలో హైదరాబాద్ చేరుకునే సరికి ఏమైందో ఏమో కానీ మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా మనసు మార్చుకోవడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రభావమా?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల మున్సిపాలిటీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సంజయ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వర్గాల మధ్య నువ్వానేనా అన్నతీరులో పోటీ ఏర్పడింది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 స్థానాలు ఉంటే వాటిలో కాంగ్రెస్ 23 స్థానాలు సాధించింది. వారిటో సంజయ్ వర్గం నుంచి 33 మంది పోటీ చేయగా వారిలో 14 మంది మాత్రమే విజయం సాధించారు. జీవన్ వర్గం నుంచి 17 మంది పోటీ చేస్తే 9 మంది విజేతలుగా నిలిచారు. దానికి తోడు స్వతంత్రుల్లో కూడా జీవన్ రెడ్డి స్వతంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. సంజయ్‌కి జీవన్ రెడ్డి మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అన్న ఉత్కంఠ ఏర్పడింది. అయితే ఆఖరికి ఎలాగైతేనేం సంజయ్‌కు జీవన్ మద్దతు దొరికింది. జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతమైంది.
విభేదాలపై చర్చకే ఫోన్ చేశారా!
అయితే జగిత్యాలలో జీవన్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా పంటికింద రాయిలా మారింది. దీంతో ఈ విభేదాలు, వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనతోనే పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డికి ఫోన్ చేసి.. ఢిల్లీకి రమ్మందా? అన్న చర్చ జరుగుతోంది. అసలు సంజయ్‌తో జీవన్‌కి ఉన్న వివాదం ఏంటి అని తెలుసుకుని, దానిని పరిష్కరించడానికే అయ్యుండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బహుశా ఢిల్లీ నుంచి మరో ఫోన్ వచ్చి.. డేట్ మార్చడంతోనే ఆయన వెనక్కి వచ్చ ఉండొచ్చని కూడా పార్టీ శ్రేణుల్లో వాదన వినిపిస్తోంది.

