
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తగ్గేది లేదంటున్న పొంగులేటి
ఇళ్ల నిర్మాణ పురోగతిపై అసెంబ్లీలో వివరాలు వెల్లడి. కొత్త కేటాయింపులు, పూర్తి పనులపై కీలక సమాచారం బయటపడింది.
పేదల సొంతింటి కల సాకారం దిశగా తెలంగాణలో కొత్త దశ ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలోని 10 జిల్లాల్లో సుమారు 21 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించినట్లు మంత్రి గుర్తుచేశారు. అదే పథకాన్ని ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మొదటి విడత కేటాయింపు జరిగిందని వెల్లడించారు. ఇప్పటికే 1 లక్ష ఇళ్లు పూర్తయ్యాయని, మరో 2 లక్షల ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుందని చెప్పారు. ఏప్రిల్‌లో రెండో విడత కేటాయింపుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం 2 లక్షలకు పైగా ఇళ్లు కేటాయించినప్పటికీ, అందులో హైదరాబాద్‌కు లక్ష ఇళ్లు ఇచ్చినట్లు మంత్రి వివరించారు.
అయితే వాటిలో సుమారు 70,861 ఇళ్లకు మౌలిక వసతులు లేకుండా నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇంకా 21,838 ఇళ్లు వివిధ దశల్లో అసంపూర్తిగా మిగిలిపోయాయని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సుమారు 26 వేల అసంపూర్తి ఇళ్లను 738 కోట్లతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. అదనంగా గతంలో నిలిచిపోయిన 62 వేల ఇళ్లను కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
మిగిలిన ఇళ్లకు అవసరమైన మౌలిక వసతులు త్వరలోనే పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి వివరించారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో గృహ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

