ఫిరాయింపులకు షాకిచ్చిన కాంగ్రెస్
x
BRS Defection MLAs

ఫిరాయింపులకు షాకిచ్చిన కాంగ్రెస్

బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్లుగా నియమించటం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు


బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏల అనర్హత కేసు క్లైమ్యాక్సుకు చేరుకుంటున్న సమయంలో ముగ్గురు ఫిరాయింపు ఎంఎల్ఏలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద షాకిచ్చింది. పదిమంది ఎంఎల్ఏలు (BRS)బీఆర్ఎస్ నుండి (T Congress)కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. పదిమందిలో ఎనిమిది మంది ఎంఎల్ఏలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా తీర్పిచ్చారు. అలాంటి ఎనిమిది మంది ఎంఎల్ఏల్లో ముగ్గురు ఎంఎల్ఏలను కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లుగా నియమించింది. శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీని నిజామాబాద్ కార్పొరేషన్ కు, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ టీ ప్రకాష్ గౌడ్ ను షాద్ నగర్ మున్సిపాలిటీకి, భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావును ఇల్లందు మున్సిపాలిటీకి కోఆర్డినేటర్లుగా నియమించింది.

బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కోఆర్డినేటర్లుగా నియమించటం ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఒకవైపు తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని మిగిలిన ఎంఎల్ఏలతో పాటు పై ముగ్గురు ఎంఎల్ఏలు కూడా పదేపదే చెప్పుకుంటున్నారు. అలాంటపుడు తమను కోఆర్డినేటర్లుగా నియమించటం ఏమిటని వీళ్ళు కాంగ్రెస్ పార్టీని అడగలేదు. పార్టీ నియామకంతో తమకు సంబంధంలేదని కూడా చెప్పలేదు. ఈనేపధ్యంలో కాంగ్రెస్ పార్టీయే పైముగ్గురు ఎంఎల్ఏల ఫిరాయింపులపై బీఆర్ఎస్ కు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా కోఆర్డినేటర్ల నియామకాన్ని అస్త్రంగా అందించినట్లయ్యింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించిన జాబితాలోనే కాంగ్రెస్ కో ఆర్డినేటర్లుగా బీఆర్ఎస్ ముగ్గురు ఎంఎల్ఏల పేర్లుండటం సంచలనంగా మారింది. ఒకవైపు తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అని పై ముగ్గురు ప్రతిరోజు మొత్తుకుంటున్న సమయంలోనే కాంగ్రెస్ జాబితాలో వీళ్ళ పేర్లుండటం ఆసక్తిగా మారింది. ఒకవైపేమో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పిచేశారు. స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ ఎంఎల్ఏలు తప్పుపడుతున్నారు. పార్టీ మారిన పదిమంది తమ ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నది స్పీకర్ కు కనిపించటంలేదా ? అని కేటీఆర్ తదితరులు మండిపోతున్నారు.

స్పీకర్ తీర్పుపైన తాము సుప్రింకోర్టులో మరో పిటీషన్ వేస్తామని కేటీఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఇంత గోలచేస్తుంటే కాంగ్రెస్ కో ఆర్డినేటర్లుగా ముగ్గురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ప్రకటించి స్పీకర్ తీర్పును కాంగ్రెస్ పార్టీనే అపహాస్యం చేసినట్లయ్యింది.

కాంగ్రెస్ చేసిన పనివల్ల ఏమవుతుందంటే అధికారికంగా జారీచేసిన ప్రకటన కాపీని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. తమ వాదనలకు కాంగ్రెస్ పార్టీ జారీచేసిన జాబితాను ఆధారంగా కేటీఆర్ చూపించబోతున్నట్లు సమాచారం. అంటే కాంగ్రెస్ పార్టీ తనంతట తానే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఫిరాయించారు అని సాక్ష్యం చెప్పినట్లయ్యింది. దీనివల్ల పోయేది స్పీకర్ పరువు, రేవంత్ రెడ్డి పరువే అన్న విషయాన్ని బహుశా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలోచించలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. లేకపోతే ఫిరాయింపుల్లో పై ముగ్గురిపైన ఎవరికైనా ప్రత్యేకంగా మంట ఏమన్నా ఉందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నియామకాలను బీఆర్ఎస్ సుప్రింకోర్టులో ఆధారంగా చూపిస్తే సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

సుప్రింకోర్టు సీరియస్ : కూరపాటి

సుప్రింకోర్టు సీరియస్ అయ్యే అవకాశముందని కూరపటి అన్నారు. ఎంఎల్ఏల ఫిరాయింపులపై తెలంగాణ ఫెడరల్ తో కాకతీయ యూనివర్సిటి రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతు ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తో ఫిరాయింపులు మొదలయ్యాయి అని గుర్తుచేశారు. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ప్రజాప్రతినిధులు అపహాస్యం చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులు బాగా ఎక్కువైపోయాయి’’ అని కూరపాటి తెలిపారు. రాజకీయాలు బాగా చెడిపోయాయి అన్నారు. ‘‘గట్టి ప్రధానమంత్రిని అని చెప్పుకుంటున్న నరేంద్రమోదీ కూడా ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తున్నారు’’ అని ఆరోపించారు.

‘‘తెలంగాణలో ఫిరాయింపుల కేసులు, అవినీతి, అదికార దుర్వినియోగం కేసుల విచారణ ఏళ్ళబట్టి టీవీ సీరియళ్ళు లాగ నడుస్తున్నాయి’’ అని ఎద్దేవాచేశారు. ‘‘ప్రజలు ఇలాంటి రాజకీయాలను పట్టించుకోవటంలేదు’’ అన్నారు. ‘‘ఇలాంటి దుర్మార్గపువ్యవస్ధ పోవాలంటే ప్రజాప్రాతినిధ్యచట్టాన్ని కఠినంగా అమలుచేయాలి’’ అని డిమాండ్. ‘‘తెలంగాణలో ఫిరాయింపుల వ్యవహారం బాగా లేదంటే జాతీయస్ధాయిలో మోదీ కూడా ఇదే రాజకీయాలు చేస్తున్నారు’’ అని గుర్తుచేశారు. ‘‘మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యర్ధిపార్టీల ఎంఎల్ఏలను ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నారు’’ అని కూరపాటి చెప్పారు. ‘‘సుప్రింకోర్టు సీరియస్ అయితే తెలంగాణలో ఐదు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డారు.

Read More
Next Story