మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం
x
Congress victory in T Municipalities

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జయకేతనం

116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 70 మున్సిపాలిటీలను గెలుచుకుంది


హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేసింది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 70 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ 15 మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచింది. బీజేపీ ఒక్క మున్సిపాలిటీలో గెలవగా 30 మున్సిపాలిటీల్లో స్వతంత్రులు గెలిచారు. 30 చోట్ల గెలిచిన స్వతంత్రులంటే ఇందులో సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఏఐఎంఐఎంతో పాటు కొన్నిచోట్ల ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఉన్నారు.

70 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 90శాతం విజయం అయితే కాదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకుంటున్నట్లు కారుపార్టీ అంత గొప్పగా ఏమీ పోరాటం చేయలేదని అర్ధమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో బీఆర్ఎస్ 29-36 మున్సిపాలిటీల్లో గెలుస్తుందని వచ్చినా అందులో సగం మున్సిపాలిటీలకు మాత్రమే పరిమితమైంది. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికలు రేవంత్ వర్సెస్ కేటీఆర్-రామచంద్రరావు అన్నట్లుగా జరిగింది. ఎందుకంటే రేవంత్ ను పదేపదే టార్గెట్ చేస్తు కేటీఆర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావుతో పాటు కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే రేవంత్ పై వీళ్ళ ఆరోపణలను ప్రజలు అంతగా పట్టించుకోలేదన్న విషయం అర్ధమవుతోంది.

పట్టణ ప్రాంతాల తీర్పు


మున్సిపాలిటీ ఎన్నికలంటే నూరుశాతం పట్టణ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఎన్నికలని తెలిసిందే. పట్టణాల్లో బీజేపీ బాగా పుంజుకున్నదని, తాము కనీసం సగం మున్సిపాలిటీల్లో గెలవబోతున్నట్లు రామచంద్రరావు ప్రతిరోజు చెప్పేవారు. అలాగే పట్టణాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగని కారణంగా ప్రజలు కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని కేటీఆర్ ప్రచారంలో హోరెత్తించారు. అయితే వీళ్ళ ప్రచారాన్ని జనాలు ఏమాత్రం పట్టించుకోలేదన్న విషయం తాజా ఫలితాలు నిరూపించాయి. అందుకనే 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కు 70 చోట్ల, ఏడు కార్పొరేషన్లలో 4 చోట్ల జనాలు ఓట్లేసి గెలిపించారు.

తాజా విజయంతో పార్టీతో పాటు ప్రభుత్వంలో రేవంత్ స్ధానం మరింత సుస్ధిరమైందనే అనుకోవాలి. సీఎంకు పార్టీ అధిష్ఠానంకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని, ఏరోజైనా రేవంత్ ను సీఎంగా తప్పించేస్తారని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రచారం అంతా ఉత్త డొల్లే అని అర్ధమైపోయింది. తాజా విజయంతో రేవంత్ కు పార్టీతో పాటు ప్రభుత్వంలో తిరుగులేదని నిరూపితమైంది. మంత్రివర్గంలో ఉన్న ఒకరిద్దరు వ్యతిరేకులు కూడా సమీప భవిష్యత్తులో రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహించే పరిస్ధితి కనిపించటంలేదు.

అప్పట్లో బీఆర్ఎస్ గెలుపు


2020లో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కారుపార్టీ 1704 వార్డుల్లో గెలిచింది. మొత్తం 2997 వార్డులకు గాను అప్పుడు బీఆర్ఎస్ 1704 వార్డుల్లో గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ 576 వార్డుల్లో మాత్రమే గెలవగలిగింది. అలాంటిది ఇపుడు సీన్ రివర్సయ్యిందనే చెప్పాలి. దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే ఏపార్టీ అధికారంలో ఉంటే జనాలు ఆ పార్టీవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నట్లు. ఎందుకంటే అధికారంలో ఉన్నపార్టీకి కాకుండా ప్రతిపక్షాలకు ఓట్లేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని జనాలకు అర్ధమైపోయింది. అధికారంలో ఉన్నపార్టీని గెలిపిస్తే ఎంతోకొంత అభివృద్ధి జరుగుతుందన్నది జనాల ఆశ. అందుకనే అప్పుడైనా, ఇప్పుడైనా జనాల మైండ్ సెట్ ఒకేలాగుంది. మొత్తం 2994 వార్డుల్లో కాంగ్రెస్ 1347, బీఆర్ఎస్ 719, బీజేపీ 263 వార్డులను గెలుచుకున్నాయి. మిగిలిన వార్డులను ఇతరులు గెలుచుకున్నారు.

అధికార దుర్వినియోగమే : కేటీఆర్

తాజా ఫలితాలపై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు అధికార దుర్వినియోగంతోనే కాంగ్రెస్ మెజారిటి మున్సిపాలిటీల్లో గెలిచినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ గెలుపు అసలు గెలుపే కాదన్నారు. ఇపుడు తమ క్యాడర్ చేసిన వీరోచిత పోరాటంతో రాబోయే గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మరింతగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ను ధీటుగా ఎదిరించిన పార్టీ నేతలు, క్యాడర్ ను కేటీఆర్ అభినందించారు.

మజ్లిస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయి : రామచంద్రరావు

తాజా ఫలితాలు తాము అనుకున్నట్లుగా రాలేదని రామచంద్రరావు అన్నారు. ఎక్కువ మున్సిపాలిటీల్లో త్రిముఖ పోటీ జరగటం వల్లే తాము నష్టపోయామని రావు అంగీకరించారు. చాలా మున్సిపాలిటీల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కవటం వల్లే తమ పార్టీ దెబ్బతిన్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు తమను ఇంత దెబ్బకొట్టినా రెండు కార్పొరేషన్లను గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పోయిన ఎన్నికలకన్నా తాజా ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలను రాబట్టిందని చెప్పారు.

Read More
Next Story