
వివాదాస్పదమవుతున్న కేసీఆర్ అడ్రస్
నందినగర్ ఇల్లు కూడా కేసీఆర్ ఇల్లే అన్న విషయంలో సందేహంలేదు.
టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను విచారించేందుకు సిట్ అధికారులు రెండోసారి జారీచేసిన నోటీసు చుట్టు వివాదం పెరిగిపోతోంది. సిట్ అధికారులు కేసీఆర్ కు జారీచేసిన నోటీసు అసలు చెల్లదంటు కొందరు లాయర్లు చెబుతున్నారు. వివాదానికి మూలకారణం ఏమిటంటే కేసీఆర్(KCR) నివాసం అని పేర్కొనటమే. సిట్(SIT) రెండుసార్లు నోటీసులు జారీచేసింది. రెండుసార్లు కూడా నందినగర్లోని కేసీఆర్ ఇంటికే నోటీసులు అందించింది. మొదటినోటీసులో ‘మీరు ఉంటున్న ఇంట్లో లేకపోతే మీరు ఎక్కడకు రమ్మంటే వచ్చి విచారిస్తాము’ అని సిట్ అధికారులు చెప్పారు. ఒకవేళ కేసీఆర్ రాదలచుకుంటే జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లోని సిట్ కార్యాలయానికి కూడా రావచ్చని అధికారులు చెప్పారు.
అయితే రెండో నోటీసులో సిట్ అధికారులు పేర్కొన్న నందినగర్ ఇంటి అడ్రస్సే ఇపుడు పెద్ద వివాదంగా మారింది. రెండోసారి ఇచ్చిన నోటీసులో కేసీఆర్ నందినగర్ ఇంట్లో విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీ రికార్డుల్లోను, ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న రికార్డుల్లో నందినగర్ అడ్రస్సే ఉందికాబట్టి తాము నోటీసులను నందినగర్ అడ్రస్ కే ఇచ్చామని సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ కో వాదన మరోరకంగా ఉంది. వీళ్ళ వాదన ఏమిటంటే నందినగర్ అడ్రస్ నుండి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మారిపోయి చాలా సంవత్సరాలు అయ్యిందని అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటున్న విషయం తెలిసికూడా సిట్ అధికారులు కావాలనే నందినగర్ అడ్రస్ కు నోటీసు జారీచేయటం ఏమిటి ? అని మండిపోతున్నారు. పైగా నందినగర్ ఇంట్లో ఎవరూ లేరనిచెప్పి ఇంట్లో గోడకు నోటీసులు అంటించటం అంటే కేసీఆర్ ను అవమానించటమే అని గోలచేస్తున్నారు.
ఫామ్ హౌసే అయినా...
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ చాలాకాలంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారన్నది వాస్తవమే. అయితే అవసరార్ధం కేసీఆర్ నందినగర్ ఇంటికి కూడా వస్తున్నారు. నందినగర్ ఇల్లు కూడా కేసీఆర్ ఇల్లే అన్న విషయంలో సందేహంలేదు. ఫామ్ హౌస్ అయినా నందినగర్ ఇల్లయినా కేసీఆర్ దే అయినపుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకింత రాద్దాంతం చేస్తున్నట్లు ? ఎందుకంటే సిట్ అధికారులు కేసీఆర్ కు నోటీసులు జారీచేయటాన్ని కేటీఆర్ తదితరులు అవమానంగా భావిస్తున్నారు. తెలంగాణకోసం ప్రాణాలను పణంగా పెట్టి, తెలంగాణను అభివృద్ధిచేసిన కేసీఆర్ ను విచారణపేరుతో వేధిస్తారా ? అవమానిస్తారా ? అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేటీఆర్ మండిపోతున్నారు.
తెలంగాణ సాధనకు, తెలంగాణను అభివృద్ధిచేయటానికి అవినీతి, అక్రమాల్లో ఆరోపణలు వచ్చినపుడు విచారించటానికి ఏమిటి సంబంధమో అర్ధంకావటంలేదు. తెలంగాణను సాధించిన కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు వస్తే విచారించకూడదు అని కేటీఆర్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కేటీఆర్ తదితరుల వాదన చూస్తుంటే సిట్ నోటీసులకు వ్యతిరేకంగా కోర్టులో కేసు దాఖలు చేస్తారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 65 ఏళ్ళ వయసు దాటిన వ్యక్తులను విచారించాలంటే వారున్న ఇంటికేవెళ్ళి విచారించాలన్న నిబంధనను సిట్ పట్టించుకోవటంలేదంటు కేటీఆర్ ట్విట్టర్లో మండిపోతున్నారు.
సిట్ ముందుజాగ్రత్త
కేసీఆర్ ఇంటి అడ్రస్ విషయంలో బీఆర్ఎస్ కోర్టులో కేసు వేస్తుందనే అనుమానాలు సిట్ అధికారులకు వచ్చినట్లుంది. అందుకనే ముందుజాగ్రత్తగా శుక్రవారం సాయంత్రం నోటీసు జారీచేశారు అధికారులు. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కాబట్టే శుక్రవారం పొద్దుపోయిన తర్వాత నోటీసులు జారీచేసింది. ఆదివారం మధ్యాహ్నం నందినగర్లో విచారణకు సిద్ధంగా ఉండాలన్న సిట్ అధికారులు కోరినట్లుగా కేసీఆర్ రెడీగా ఉంటారా అన్నదే ఆసక్తిగా మారింది. శుక్రవారం సాయంత్రం నుండి కేసీఆర్ అందుబాటులోని నేతలతో సమావేశాలతో బిజీగా ఉన్నారు.
నోటీసు చట్టవిరుద్ధం
విచారణ నోటీసును కేసీఆర్ ఇంటికి అంటించటం చట్టవిరుద్ధం అని ప్రముఖ లాయర గండ్ర మోహన్ రావు అభిప్రాయం వ్యక్తంచేశారు. నందినగర్ ఇంటికి వెళ్ళదలచుకున్న సిట్ అధికారులు ఫామ్ హౌస్ కు వెళ్ళి ఎందుకు విచారించకూడదు అని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు కూడా కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు అన్నట్లుగా లాయర్ వ్యాఖ్యానించారు. నోటీసులకు వ్యతిరేకంగా ఎవరైనా కేసు దాఖలుచేస్తే కోర్టు నోటీసును కొట్టేస్తుందని కూడా గండ్ర మోహన్ రావు చెప్పారు.

