
ప్రాజెక్టుల భూసేకరణకు కార్పస్ ఫండ్
జూన్ 2 లోపు భూసేకరణ కోసం రు. 600 కోట్ల మంజూరు చేయబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు
ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేవంత్ పర్యటించారు. దేవాదుల ప్రాజెక్టుపై ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు భూసేకరణ జాప్యం కారణంగా ప్రాజెక్టులు ఏవీ ఆగకూడదని అన్నారు. ఏప్రాజెక్టు మొదలుపెట్టాలన్నా, పూర్తవ్వాలన్నా భూసేకరణ విషయంలోనే అసాధారణ జాప్యం జరుగుతుందన్న విషయం తెలిసిందే. అందుకనే ఈ విషయానికి సీఎం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగకూడదంటే భూసేకరణ కోసం ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసినట్లు తెలిపారు.
జూన్ 2 లోపు భూసేకరణ కోసం రు. 600 కోట్ల మంజూరు చేయబోతున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. బడ్జెట్ లోపే అన్నీ అంచనాలను ప్రభుత్వం ముందుంచి అవసరమైన అనుమతులను తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి అన్నీ అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. నెలరోజుల్లోపే దేవాదుల పంప్ ను మరమ్మత్తులు చేయించాలని చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎంఎల్ఏలు, ఉన్నతాధికారులతో దేవాదుల ప్రాజెక్టు పురోగతిపైన సమీక్షించేందుకు అసెంబ్లీ కమిటి హాలులో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భూసేకరణ నేపధ్యంలో బాధితులకు పరిహారాన్ని గ్రీన్ ఛానల్లో అందించేందుకు నిధులను సిద్ధంగా పెట్టుకుంటామని తెలిపారు. రామప్ప చెరువు నుండి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళిక పైన నివేదిక ఇవ్వాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.

