
పత్రికా సంపాదకులు, జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడుతున్న కూనంనేని
కమ్యూనిస్టుల 100ఏళ్ల ఖమ్మం సభకు సీఎం రేవంత్ రెడ్డి
"కమ్యూనిజానికి చావులేదు" అనే నినాదంతో 18న ఖమ్మంలో సభ, తరలివస్తున్న దేశదేశాల కమ్యూనిస్టులు
కమ్యూనిస్టుల ఖిల్లా ఖమ్మం జిల్లా.. కార్మిక వర్గ రాజ్య ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటైన కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి 18న ఖమ్మం నడిబొడ్డులో ఎర్రజెండాలు పోటెత్తనున్నాయి. కమ్యూనిస్టు శ్రేణులు కదం తొక్కనున్నాయి. కమ్యూనిజం అజేయం అనే నినాదంతో సాగే ఈ మహాప్రదర్శనకు సకల సన్నాహాలు చేస్తున్నారు. శతవార్షికోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం హైదరాబాద్ లో జరిగిన ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వివరాలను వెల్లడించారు.
కమ్యూనిస్టులు అంతరించిపోతున్నారనే విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చేలా, జనవరి 18న ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నామన్నారు.
ముఖ్య అతిథులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ జాతీయ నేతలు పాల్గొంటారని చెప్పారు. మత సామరస్య సందేశాన్ని చాటడానికి ఈ సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు కూనంనేని వెల్లడించారు. ఈ వేడుకల్లో జాతీయ వామపక్ష పార్టీల నేతలతో పాటు 40 దేశాల ప్రతినిధులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు.
జనవరి 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ తర్వాత జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు పార్టీ జాతీయ సమితీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీ సహా వివిధ వామపక్షపార్టీల నాయకులు హాజరవుతున్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ మాట్లాడుతూ.. దేశ వనరులను కాపాడుతున్న త్యాగధనులను శత్రువులుగా చిత్రీకరిస్తూ, దోపిడీదారులను దేశభక్తులుగా ప్రచారం చేస్తున్నారని పాలకులపై విమర్శలు గుప్పించారు.
చారిత్రక పోరాటాల స్మరణ
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పార్టీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, దాదాపు 3,500 గ్రామాలను విముక్తి చేసిందని కొనియాడారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన CPI స్వాతంత్య్రానికి ముందే 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో ఏర్పాటైంది. పార్టీ వందేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా, లక్షలాది మంది హాజరయ్యేలా ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, సామాన్యుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, ఎన్నికల విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కమ్యూనిస్టు పార్టీ సమరశీల శక్తిగా తయారు కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలంగాణలోని ఖమ్మం నగరం వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టింది. ఈ సభ ద్వారా కమ్యూనిస్టుల ఉనికిని, సిద్ధాంత బలాన్ని చాటి చెప్పాలని పార్టీ నిర్ణయించింది. ఈ ముగింపు సభ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, దేశవ్యాప్త ప్రాముఖ్యత సంతరించుకోనుంది. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, తదితర పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఐదు లక్షల మంది తరలివస్తారని పార్టీ అంచనా వేస్తోంది.
శత వార్షికోత్సవాల్లో భాగంగా ఇప్పటికే వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఖమ్మం సభను వీటన్నింటికీ మకుటాయమానంగా తీర్చిదిద్దేందుకు స్థానిక నేతలు భారీగా సమీకరణలు చేస్తున్నారు.
Next Story

