కేటీఆర్ కు షాకిచ్చిన సీపీఐ
x
Congress and CPI pact in kothagudem Corporation

కేటీఆర్ కు షాకిచ్చిన సీపీఐ

కేసీఆర్ అపాయిట్మెంట్ కోరితే వామపక్షాలను ఇంటి గేటుదగ్గరకు కూడా రానీయలేదు


కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సీపీఐ భారీ షాక్ ఇచ్చింది. సీపీఐ కోరుకుంటే తాము మద్దతు ఇవ్వటానికి సిద్దంగా ఉన్నామని కేటీఆర్ రెండురోజుల క్రితం ఆఫరిచ్చారు. కారణం ఏమిటంటే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ఏ పార్టీకి సింగిల్ మెజారిటి రాకపోవటంతో హంగ్ ఏర్పడింది. కార్పొరేషన్లో 66 డివిజన్లున్నాయి. వీటిల్లో కాంగ్రెస్ 22, సీపీఐ 22 డివిజన్లు గెలిచాయి. బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సీపీఎం 1 డివిజన్ గెలవగా ఇతరులు 6 చోట్ల గెలిచారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 33+1 డివిజన్=34 రావాలి.

34 డివిజన్లు ఎవరికీ రాకపోగా కాంగ్రెస్, సీపీఐకి చెరిసగం డివిజన్లు రావటంతో హంగ్ ఏర్పడింది. నిజానికి కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలే. అయితే కార్పొరేషన్లో ఎవరు ఎన్ని డివిజన్లలో పోటీచేయాలనే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దాంతో రెండుపార్టీలు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాయి. ఫ్రెండ్లీ కంటెస్టులో ఏ పార్టీకి ఎక్కువ డివిజన్లు వస్తే ఆ పార్టీ తరపున మేయర్ ఉండేట్లు రెండోపార్టీ తరపు డిప్యుటి మేయర్ ఉండేట్లుగా ఎన్నికలకు ముందే మాటలు జరిగాయి. అయితే రెండుపార్టీలకు చెరి 22 డివిజన్లు వచ్చాయి. దాంతో మేయర్ పీఠం ఎవరు దక్కించుకోవాలి అనే విషయంలో ప్రతిష్టంభన వచ్చింది.

ఇదే అదునుగా కేటీఆర్ పావులు కదిపారు. తాము సీపీఐకి మద్దతిస్తామని, సీపీఎం, ఇతరుల మద్దతుతో మేయర్ గా సీపీఐ అభ్యర్ధే ఉండచ్చని ప్రతిపాదించారు. కేటీఆర్ ఉద్దేశ్యం ఏమిటంటే మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐని విడగొట్టడమే. అయితే సీపీఐ కొత్తగూడెం ఎంఎల్ఏ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాస్త విజ్ఞత ప్రదర్శించారు. కేటీఆర్ ఆఫర్ తీసుకుని తాత్కాలిక లబ్ది పొందటమా లేకపోతే కాంగ్రెస్ తోనే ప్రయాణించి దీర్ఘకాలిక లాభాలు అందుకోవటమా అనే విషయంలో పార్టీలో చర్చించారు. పార్టీ కాంగ్రెస్ తో నడవటమే మంచిదని తీర్మానించింది.

ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు సీపీఐ, సీపీఎంలను అవసరానికి వాడుకుని తర్వాత కరివేపాకును తీసి పడేసినట్లు పడేసింది. కేసీఆర్ అపాయిట్మెంట్ కోరితే వామపక్షాలను ఇంటి గేటుదగ్గరకు కూడా రానీయలేదు. అలాంటి బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకునేకన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందాన్ని మన్నించి ఒక ఎంఎల్సీ ఇచ్చిన కాంగ్రెస్ తోనే ప్రయాణించాలని సీపీఐ నిర్ణయించింది. దాంతో కాంగ్రెస్ తోనే ఒప్పందం చేసుకుంది.

తాజా ఒప్పందం ప్రకారం మొదటి రెండున్నరేళ్ళు సీపీఐ మేయర్ ఉంటారు. ఈ రెండున్నరేళ్ళు కాంగ్రెస్ తరపున డిప్యుటి మేయర్ ఉంటారు. చివరి రెండున్నరేళ్ళు కాంగ్రెస్ మేయర్, సీపీఐ డిప్యుటి మేయర్ ఉండేట్లుగా ఒప్పందం ఖరారైంది. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కూనంనేని సాంబశివరావు స్వయంగా మీడియాతో చెప్పారు. సాంబశివరావు ప్రకటన తర్వాత చేసేదిలేక బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంటుందని కేటీఆర్ ప్రకటించారు.

Read More
Next Story