మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం ‘కోట్లు’
x
Municipal elections in Telangana

మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం ‘కోట్లు’

మద్యం వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఇసుక కంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, బంగారం, వస్త్ర వ్యాపారులు పోటీచేస్తున్నారు.


రాజకీయాలు సంప్రదాయ పద్దతి నుండి పవర్ పాలిటిక్స్ గా ఎప్పుడైతే రూపాంతరం చెందాయో అప్పటినుండే రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి. ఒకపుడు రాజకీయాల్లోకి పూర్తిస్ధాయిలో ప్రజాసేవలో ఉండేవారే వచ్చేవారు. అంటే పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళని ఉదాహరణలుగా చెప్పుకునేవారు. తర్వాత కాలంలో వచ్చిన మార్పుకారణంగా ఇతరత్రా వ్యాపార రంగాల్లో నుండి కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ ఒరవడి ఎక్కువగా (TDP)తెలుగుదేశంపార్టీ ఆవిర్భావంతో మొదలైంది. తర్వాత(Chandrababu) చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ప్రవేశించటం ఒక్కసారిగా పెరిగిపోయింది.

చంద్రబాబు సీఎం అయిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో అచ్చంగా పారిశ్రామికవేత్తలనే రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంపీలుగా పోటీచేయించారు. అప్పటినుండే రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల్లో డబ్బుప్రభావం బాగా పెరిగిపోయింది. ఇపుడీ విషయాలన్నీ ఎందుకంటే తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 11వ తేదీన పోలింగ్, 13వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.

2996 వార్డులు, డివిజన్లలో అన్నీపార్టీల తరపున 12,994 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే అత్యధికంగా వ్యాపారుల హవా బాగా కనబడుతోంది. మద్యం వ్యాపారులు, రియల్ ఎస్టేట్, ఇసుక కంట్రాక్టర్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, బంగారం, వస్త్ర వ్యాపారులు పోటీచేస్తున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు పోటీలో ఉంటే ఇక డబ్బుకు కొదవేముంటుంది. ఇలాంటి వాళ్ళు గెలుపుకోసం కోట్లాది రూపాయలను చాలా తేలికగా ఖర్చు చేసేయగలరు. వీరితో పోటీపడి సంప్రదాయ రాజకీయాలు చేసేవారు నిలవలేకపోతున్నారు.

ఇపుడు పోటీచేస్తున్నవారు కేవలం కౌన్సిలర్ గానో లేకపోతే కార్పొరేటర్ గానో గెలవాలి అనుకుని పోటీచేయటంలేదు. వీరి దృష్టంతా మున్సిపల్ ఛైర్మన్ లేదా మేయర్ పోస్టుమీదే ఉంది. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వాళ్ళు అదృష్టంకొద్ది గెలిస్తే మరి చేసిన ఖర్చనంతా రాబట్టుకోకుండా ఉంటారా ? పార్టీలు కూడా ఎన్నికల్లో ఇలాగ డబ్బున్న వాళ్ళనే అభ్యర్ధులుగా పోటీచేయిస్తుండటంతో ఎన్నికల ఖర్చులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి.

ఇపుడు పోటీచేస్తున్న వారిలో వ్యాపారులు, కాంట్రాక్టర్లు చాలామందే ఉన్నారు.

వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లోని వార్డులకు 1072 మంది పోటీచేస్తున్నారు. పోటీచేస్తున్న వారిలో 115 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, 25 మంది మద్యం వ్యాపారస్తులు, ఇసుక, మొరం, మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నవారు 20, కాంట్రాక్టర్లు 36 మంది ఉన్నారు. వీరు కాకుండా రైస్ మిల్లులు, ఆభరణాల వ్యపారస్తులు, వస్త్ర దుకాణాల యజమానులు సుమారు 75 మంది పోటీచేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని నల్గొండ కార్పొరేషన్, 17 మున్సిపాలిటీల్లో 48 డివిజన్లు, 359 వార్డులున్నాయి. వీటన్నింటిలో ఏకగ్రీవాలు పోను 48 డివిజన్లు, 352 వార్డుల్లో 1617 మంది పోటీచేస్తున్నారు. వీరిలో 110 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, 17మంది మద్యం వ్యాపారులు, కాంట్రాక్టర్లు 14 మంది, రైస్ మిల్లర్లు 7, ఇతర వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు 10 మంది ఉన్నారు.

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 117 వార్డులకు 415 మంది పోటీచేస్తున్నారు. వీరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 31మంది, మద్యం వ్యాపారులు 4గురు, రైస్, పప్పు మిల్లర్లు 23మంది, బంగారం నగల వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారులు 20 మంది ఉన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు మరో తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగుతున్నాయి. 120 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, 22 మంది మద్యం వ్యాపారులు, మైనింగ్ వ్యాపారులు 29మంది, కాంట్రాక్టర్లు 15మంది, ఇతర వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు 20 మంది పోటీచేస్తున్నారు.

మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో 409 వార్డులకు 1486 మంది పోటీచేస్తున్నారు. వీరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 90మంది, గనుల వ్యాపారులు 25మంది, 25 మంది మద్యం వ్యాపారులు, 15మంది కాంట్రాక్టర్లున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో 674 వార్డులున్నాయి. వీటిల్లో 1574 మంది పోటీచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు 60మంది, మద్యం వ్యాపారులు 23మంది, మైనింగ్ వ్యాపారులు 20, కాంట్రాక్టర్లు 28మంది, ఇతర వ్యాపారులు 70 మంది ఉన్నారు.

కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీల్లో 467 వార్డుల్లో 2283 మంది పోటీచేస్తున్నారు. వీరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 90మంది, మైనింగ్ వ్యాపారులు 8మంది, ఇసుక వ్యాపారులు 12 మంది పోటీచేస్తున్నారు.

హైదరాబాదుకు ఆనుకుని ఉన్న 11 మున్సిపాలిటీల్లో 614 మంది పోటీచేస్తున్నారు. వీరిలో 350మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే. వీరంతా ముందు కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా గెలవాలన్నా పట్టుదలతో కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాదుకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎకరం ధర కోట్లరూపాయలు పలుకుతున్నాయి. ఒక ఎకరం అమ్మితే చాలు 10 లేదా 15 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. దాన్ని ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని అభ్యర్ధులు అనుకుంటే మిగిలిన వాళ్ళు ఆ ఖర్చులను తట్టుకోలేరు. అయితే కోట్లాది రూపాయలను ఖర్చులు చేస్తున్నా వాళ్ళల్లో ఎంతమంది గెలుస్తారు అన్నదే కీలకమైన పాయింట్.

Read More
Next Story