
సి.ఎం. రేవంత్ ఫత్వా జారీ!
హరీశ్ రావును ఓడిస్తే మంత్రిపదవి ఇస్తా!
సిద్ధిపేట… ఒకప్పుడు కాంగ్రెస్ బలమైన కోట. కానీ 1983 తర్వాత ఆ చరిత్ర పూర్తిగా మారిపోయింది. 1985 నుంచి ఈ సీటు కేసీఆర్ కుటుంబానికి అడ్డాగా మారింది. టీడీపీ తరఫున కేసీఆర్ నాలుగు సార్లు గెలిచి, మంత్రి, ఉపసభాపతి పదవులు కూడా చేపట్టారు. 2001లో టీడీపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత, టీ.ఆర్.ఎస్. తరఫున కూడా సిద్ధిపేట నుంచే గెలిచారు.
2004 నుంచి సీన్ పూర్తిగా మారింది. సిద్ధిపేట అంటే హరీష్ రావు… హరీష్ రావు అంటే సిద్ధిపేట అన్నట్టైంది. వరుసగా ఐదు సార్లు గెలిచి, ఆ నియోజకవర్గంపై పూర్తి పట్టును సాధించారు. వైఎస్సార్ హయాంలో మంత్రి, కేసీఆర్ పాలనలో కీలక శాఖలు నిర్వహిస్తూ తన రాజకీయ భవిష్యత్‌కు బలమైన పునాది వేసుకున్నారు. గత నాలుగున్నర దశాబ్దాలుగా కేసీఆర్ కుటుంబమే అక్కడ రాజ్యం చేస్తోంది. కేసీఅర్, హరీష్ రావు చెరో ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు.
హరీష్ రావుకు సిద్దిపేట ప్రజలతో ఉన్న బంధం విడదీయలేనిది. ఆయనకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంపై, ప్రతి ఓటరుపై పట్టు వుంది. తిరుగులేని నాయకుడిగా ఆ ప్రాంతంలో ఎదిగారు. స్థానికులు ఆయనను అభివృద్ధికి మారు పేరుగా చెప్పుకుంటారు. ఎందుకంటే అవకాశం వున్న ప్రతి ప్రాజెక్ట్‌ను ఆయన సిద్ధిపేటలో ప్రారంభించి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు.
అంతే కాదు, పార్టీలో వ్యూహకర్తగా హరీష్‌రావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌పై ఆయనకు బలమైన పట్టు ఉంది. వ్యూహరచనలో కేసీఆర్ తర్వాత స్థానాన్ని హరీష్‌రావే దక్కించుకున్నారు. అందుకే ఆయనను పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా గుర్తు చేసుకుంటారు.
ఎన్నికల సమయంలో కేటీఆర్ నియోజకవర్గంలోనూ వ్యూహకర్తగా ఆయన కీలక పాత్ర పోషించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించడంలో హరీష్‌రావు కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటికి రావడం లేదు. అంతా హరీష్‌రావే చూస్తున్నారు. అలాంటి హరీష్‌నే టార్గెట్ చేస్తే మొత్తం క్యాడర్ ను సైకలాజికల్‌గా దెబ్బకొట్టవచ్చు. మొత్తం పార్టీ మరింత బలహీనపడుతుంది. అందుకే రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటనను రాజకీయంగానూ వాడుకున్నారు.
ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట నియోజకవర్గంలో ఘోర పరాభవం ఎదురైంది. ఇక్కడ బీఆర్‌ఎస్ పార్టీ భారీ స్థానాలు సొంతం చేసుకోవడంతో హరీశ్ రావును దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి నర్మెట్ట సభను ఉపయోగించుకున్నారు.
దశాబ్దాలుగా సిద్దిపేటలో ఒక కుటుంబాన్ని గెలిపిస్తున్నారని.. ఈసారి సిద్దిపేటలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 'గత పాలకులు విపక్ష నాయకుల నియోజకవర్గాలపై వివక్ష చూపించారు. నేను నాయకులతో వ్యతిరేకిస్తాను కానీ ప్రజలపై వివక్ష చూపను' అని స్పష్టం చేశారు. సిద్దిపేటకు కూడా నిధులు భారీగా ఇచ్చానని.. వివక్ష చూపేవాడినైతే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని కొడంగల్‌కు తీసుకెళ్లేవాడినని తెలిపారు. 'వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలోనూ కాంగ్రెస్ గెలవాలి. ఇక్కడి నుంచి గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తా' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేసీఆర్ కుటుంబ ఏకఛత్రాధిపత్యానికి స్వస్తి పలకాలంటూ సిద్దిపేట పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్ ప్రకటించేశారు. 2029 ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ గెలిచిన వ్యక్తిని నేరుగా క్యాబినెట్ మంత్రిని చేస్తామని సి.ఎం. రేవంత్ ఫత్వా జారీ చేశారు. ఆ బాధ్యత మంత్రులు వివేక్ వెంకట స్వామి, దామోదర రాజనర్సింహలకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో “ఒక్క అవకాశం ఇవ్వండి” అనే నినాదాన్ని బలంగా వినిపించారు. రేవంత్ రెడ్డి స్పీచ్ కి సభలో మంచి స్పందన లభించింది అంతే కాదు 2028లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అని ఆయన అన్నపుడు కూడా జనాలు పెద్ద ఎత్తున మద్దతుగా చప్పట్లు కొట్టారు.
హరీశ్ రావు గెలిచినా ఎమ్మెల్యేగా ఉంటారని, అదే కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీ నియోజకవర్గానికి మంత్రి అవుతారంటూ నర్మెట్ట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కేవలం మంత్రి పదవి ఆశ చూపి హరీష్‌రావుకు-సిద్దిపేటకున్న ఆ బంధాన్ని తెంచడం అంత సులభం కాదు. 2029 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉంటే, అధికార పార్టీ వైపు మొగ్గు చూపే ఓటర్లను ఈ ‘మంత్రి’ ఆఫర్ ఆకర్షించవచ్చు. అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? లేక సిద్ధిపేటలో అదే పాత కథ రిపీట్ అవుతుందా? అన్నది రాబోయే ఎన్నికల్లో తేలనుంది.

