
లిక్కర్ స్కామ్ రాజకీయ కుట్రే: కవిత
ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినా చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుందని మరోసారి నిరూపితమైందన్న కవిత.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది రాజకీయ కుట్రేనని ఈరోజు తేటతెల్లం అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ సందర్భంగానే కవిత.. సంతోసం వ్యక్తం చేశారు. న్యాయాన్ని ఎవరూ ఓడించలేరని, అధికారం ఉందని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా, కేసులు పెట్టించినా చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుందని మరోసారి నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్(ట్విట్టర్) వేదికగా కూడా ‘సత్యమేవ జయతే’ అంటూ పోస్ట్ పెట్టారు.
కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిపై సరైన సాక్ష్యాధారాలు లేవని సిబిఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులు తప్పు చేశారని నిరూపించేందుకు అవసరమైన బలమైన ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.
ఐదున్నర నెలలు తాను జైలులో ఉన్న సమయంలో తనకు అండగా ఎవరెవరు నిలిచారు అనేది తనకు తెలుసని, వారిని తాను జీవితాంతం కళ్లల్లో పెట్టుకుని కాపాడుకుంటానని అన్నారు కవిత. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా తనపై పెట్టిన తప్పుడు కేసుల నుంచి తాను కడిగిన ముత్యంలా బయటపడ్డానని చెప్పారు. తాను గతంలో కూడా ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపనే చెప్పానని, ఇప్పుడు అదే విషయం తేలిందని అన్నారు. ఐదు నెలల పాటు తాను జైలులో ఉన్న సమయంలో కొందరు తనను నానామాటలు అన్నారని, వారందరి నోళ్లు ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు మూయించిందని కవిత అన్నారు.

