Deputy CM Bhatti Vikramarka
x

‘సింగరేణి టెండర్ల వివాదం ఒక కట్టుకథ మాత్రమే’

కట్టుకథలు అల్లి భయపెడదాం అనుకుంటే తాను లొంగే వ్యక్తిని కాదన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.


సింగరేణి టెండర్ల వివాదంపై కొన్ని మీడియా సంస్థలు కట్టుకథలు అల్లుతున్నాయంటూ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తమ ప్రభుత్వ మంత్రులపై తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఈ సింగరేణి టెండర్ల వివాదం కూడా వాటిలో ఒకటని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. ఆస్తుల సంపాదన కోసం, పదవుల ఆశతో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంగా చెప్పారు. ప్రజాభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లపై ఒక పత్రిక అడ్డగోలు కథనం రాసిందని ఆరోపించారు. కట్టుకథలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరిగిందని అన్నారు.

సింగరేణి టెండర్లు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పిలవడం జరిగిందని తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తిగా సంస్థ ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పారు. ఇందులో మంత్రి ప్రమేయం ఉండదని తేల్చి చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను సన్నిహితుడిని కావడంతో ఆయనపై ఉన్న కోపాన్ని తనపై చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ కథనం వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశం బయటపడిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.

“సింగరేణి ఒక సంస్థ మాత్రమే కాదు. అది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల ఆత్మ. దోపిడీదారులు, గద్దలు, నేరగాళ్ల నుంచి ఈ ఆస్తులను కాపాడటమే నా బాధ్యత” అని భట్టి విక్రమార్క అన్నారు. గనులు క్లిష్ట ప్రాంతాల్లో ఉన్న కారణంగా ఫీల్డ్ విజిట్ నిబంధన తప్పనిసరిగా పెట్టామని తెలిపారు. ఇలాంటి నిబంధనలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కూడా అమల్లో ఉన్నాయని చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా కథనాలు రాయడం తగదని సూచించారు.

వ్యక్తిత్వాన్ని హననం చేసే కథనాలు రాయడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. నాయకుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్ కథనంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేశారు. మీడియా సంస్థల మధ్య ఉన్న అంశాల్లోకి ప్రజాప్రతినిధులను లాగొద్దని హితవు పలికారు. వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లడం తగదన్నారు.

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం సింగరేణి దరిదాపుల్లోకి దోపిడీదారులు రానివ్వనని ధీమా వ్యక్తం చేశారు. నిజం చివరకు ప్రజల ముందే నిలుస్తుందని అన్నారు.

సింగరేణి టెండర్ల వివాదం

తెలంగాణలో సింగరేణి నైనీ బొగ్గు గనుల టెండర్లపై అవినీతి ఆరోపణలు వచ్చిన వార్తలు హల్‌చల్ సృష్టించాయి. కొన్ని మీడియా రిపోర్ట్‌లు టెండర్ల ప్రక్రియలో నియంత్రణలు పాటించలేదన్న తీరుగా ప్రచారం చేశాయి. వాస్తవానికి, టెండర్లు సింగరేణి బోర్డు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పిలవబడ్డాయి. మంత్రులు ప్రక్రియలో జోక్యం లేకుండా టెండర్లు పూర్తయ్యాయి. వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత, కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి సంస్థ స్వతంత్రంగా ఆ ప్రక్రియను నిర్వహిస్తోంది.

Read More
Next Story