
బీఆర్ఎస్ కూ కెసిఆర్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభుత్వ భూమి
కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సొంతంచేసుకున్న 11 ఎకరాలు మాత్రం పక్కాగా అధికార దుర్వినియోగం అనేచెప్పాలి.
నిత్యం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భూకుంభకోణాలగురించి నానా యాగీచేస్తున్న బీఆర్ఎస్ కూడా ఏమీ తక్కువ తినలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు జరిగిన భూకుంభకోణాలపై లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. ధరణి పేరుతో లక్షలాది ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం కావాల్సిన వారికి సొంతంచేసినట్లు చాలా ఆరోపణలే ఉన్నాయి. బీఆర్ఎస్ ఓటమిలో ధరణి పోర్టల్ లో అవకతవకలు కూడా కీలకమనే చెప్పాలి. ఇప్పుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ చేతిలో నుండి 11 ఎకరాలు దాదాపు చేజారిపోయినట్లే అనిచెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన భూకుంభకోణాల ఆరోపణల సంగతిని పక్కనపెట్టేస్తే బీఆర్ఎస్ సొంతంచేసుకున్న 11 ఎకరాలు మాత్రం పక్కాగా అధికార దుర్వినియోగం అనేచెప్పాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖ వచ్చింది. అందులో ఏముందంటే పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం 11 ఎకరాలు కేటాయించాలని. రెండో ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి ఒకే చెప్పగానే విషయం క్యాబినెట్లో చర్చించటం, క్యాబినెట్ సమావేశం కూడా బీఆర్ఎస్ కు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, కోకాపేట గ్రామం సర్వే నెంబర్లు 239, 240లో 11 ఎకరాలను కేటాయిస్తు నిర్ణయం తీసుకోవటం అయిపోయింది. వెంటనే ప్రభుత్వం బీఆర్ఎస్ కు 11 ఎకరాలను కేటాయిస్తు ఉత్తర్వులు కూడా జారీచేసేసింది. ఇదంతా జరిగింది 2023లో. హైదరాబాద్ నగరంలో అత్యంత ఎక్కువ ధరలు ఉండే ప్రాంతాల్లో కోకాపేట కూడా ఒకటని అందరికీ తెలిసిందే. కోకాపేట ప్రాంతంలో భూములను కేసీఆర్ ప్రభుత్వం వేలంవేసినపుడు హాట్ కేకుల్లాగ అమ్ముడుపోయాయి. అక్కడ ఎకరం భూమి విలువ సుమారు రు. 100 కోట్ల పైమాటే.
అలాంటి భూమిని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం నామమాత్రపు ధరపైన 11 ఎకరాలను కేటాయించేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ కేసీఆర్ ది, లేఖ అందగానే భూములను కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వమే. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు 11 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందో వెంటనే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, లాయర్ వెంకట్రామరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా కేసులు వేశారు. వేల కోట్లరూపాయల విలువైన భూములను పార్టీఆఫీసుకోసం కేటాయింపులు చేసుకోవటం చెల్లదని పిటీషనర్లు వాదించారు. ప్రజల ఆస్తులను పార్టీలు తమసొంతానికి వాడుకునేందుకు లేదని పిటీషనర్లు స్పష్టంగా ప్రస్తావించారు. అప్పటినుండి కోర్టులో విచారణ జరుగుతునే ఉంది. పై రెండు కేసుల్లో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది.
భూముల విలువను బట్టి కేసీఆర్ రు. 1100 కోట్ల విలువైన భూమిని తన సొంతపార్టీకోసం ప్రభుత్వ భూములను కేటాయించేసుకున్నారన్న విషయం అర్ధమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ సొంత అవసరాలకు ప్రభుత్వ భూములను కేటాయించుకోవటం చట్టవిరుద్ధమని ప్రభుత్వం వాదించింది. రాజకీయ నేతలకు శిక్షణ ఇవ్వటానికి పైన చెప్పిన 11 ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ కు కేటాయించుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. రాజకీయనేతలకు శిక్షణ అంటే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ నేతలకు మాత్రమే అని అర్ధం. బీఆర్ఎస్ నేతలకు అవసరమైన శిక్షణకు బంజారాహిల్స్ లో ఇపుడున్న పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ సరిపోదన్నట్లు కోకాపేటలో వేలకోట్ల రూపాయల విలువచేసే భూములను కూడా సొంతం చేసుకోవటం అచ్చంగా అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది.
ప్రజావసరాలకు తప్ప వేరే అవసరాలకు మార్కెట్ ధరకన్నా తక్కువకు భూములను కేటాయించేందుకు వీల్లేదని ప్రభుత్వం కోర్టులో వాదించింది. పార్టీఅవసరాల కోసం అప్పట్లో కేసీఆర్ చేసుకున్న భూకేటాయింపులు ప్రజావసరాలకు కాదని ప్రభుత్వ లాయర్ స్పష్టంచేశారు. కాబట్టి వెంటనే కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ కు జరిగిన 11 ఎకరాల భూముల కేటాయింపును రద్దుచేయాలని ప్రభుత్వ లాయర్ వాదించగా విచారణను కోర్టు వాయిదావేసింది. చివరకు కోర్టు ఏమి తీర్పిస్తుందో అన్న విషయం ఆసక్తిగా మారింది.

