
74 ఏళ్ళ జీవన్ రెడ్డి చేసింది కరెక్టేనా ?
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనా లేకపోతే జగిత్యాలలో పెద్ద బహిరంగసభ పెట్టి పెద్ద సార్ కేసీఆర్ సమక్షంలో చేరుతారా అన్నది తేలుతుంది
సూత్రప్రాయంగా గురువారం తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినట్లే. ఎందుకంటే జీవన్ ఇంటిముందు బీఆర్ఎస్ వెలసిన పోస్టర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరుల ఫొటోలతో పాటు జీవన్ ఫొటో కూడా ప్రముఖంగా కనబడుతోంది. తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఈరోజు ఉదయం జీవన్ మీడియాతో చెప్పిన తర్వాత జగిత్యాలలో పెద్దఎత్తున పోస్టర్లు వెలిశాయి. కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోరుట్ల ఎంఎల్ఏ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీమంత్రులు గంగుల కమలాకర్ తదితరులు జీవన్ ఇంటికి వెళ్ళి భేటీ కాబోతున్నారు. భేటీ తర్వాత జీవన్ చేరిక ఎక్కడ ఉంటుంది ? ఎవరి సమక్షంలో, ఏరోజు ఉంటుంది అన్న విషయాలపై క్లారిటి వస్తుంది.
జీవన్ పార్టీలో ఈరోజు కాకపోతే రెండురోజుల తర్వాత చేరటం ఖాయమైపోయింది. అది ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనా లేకపోతే జగిత్యాలలో పెద్ద బహిరంగసభ పెట్టి పెద్ద సార్ కేసీఆర్ సమక్షంలో చేరుతారా అన్నది తేలుతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే అసలు జీవన్ రెడ్డి 74 ఏళ్ళ వయసులో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరటం కరెక్టేనా ? తెలివైన నిర్ణయమేనా ? అనే విషయమై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పైగా కేసీఆర్ స్టైల్ బాగా తెలిసిన జీవన్ బీఆర్ఎస్ పార్టీలో చేరి నెట్టుకురాగలరా ? అనే సందేహాలు పెరుగిపోతున్నాయి. ఎవరైనా ప్రముఖ నేతను పార్టీలో చేర్చుకునేముందు బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్దఎత్తున హడావుడి చేయటం మామూలే. చేరిన నాలుగురోజుల తర్వాత నుండి మొదలవుతుంది సదరు నేతకు అసలు సినిమా.
పార్టీలో చేరిన నేత డైరెక్టుగా మీడియాతో మాట్లాడేందుకు లేదు. స్వతంత్రంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశాలు పెట్టుకునేందుకు ఉండదు. తన ఆలోచనలు, విధానాలను బహిరంగంగా వెల్లడించే అవకాశం లేదు. ఈ మూడు లక్షణాలకు జీవన్ వ్యవహారశైలికి ఏమాత్రం పొంతనుండదు. ఎందుకంటే మీడియాతో మాట్లాడకుండా జీవన్ ఒక్కరోజు కూడా ఉండలేరు. నేతలు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టకుండా జీవన్ ఉండలేరు. తాను మాట్లాడాల్సిన ప్రతి అంశంపైన పార్టీ అధినాయకత్వం అనుమతి తీసుకోవటం జీవన్ కు మహా చిరాకు. ఇపుడేదో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మీద మంటతో ఆవేశంలో జీవన్ బీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. అయితే తన సహజ లక్షణాలకు భిన్నంగా పార్టీ నాయకత్వం లైన్ కు కట్టుబడి ఎంతకాలం ఉండగలరు ? అన్నది అనుమానమే.
సీనియర్ల పరిస్ధితి ఏమైంది ?
రాజకీయాల్లో 74 ఏళ్ళంటే పెద్ద వయసుకిందే లెక్క. మహాయితే జీవన్ వచ్చే ఎన్నికలు 2029 వరకూ యాక్టివ్ గా ఉండగలరేమో. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు జీవన్ వయసు 77 ఏళ్ళకు చేరుకుంటుంది. కాబట్టి ఆ వయసులో జీవనే కాదు ఎవరు కూడా అంత యాక్టివ్ గా ఉండలేరు. శారీరకంగానో లేకపోతే మానసికంగానో బాగా అలసిపోయుంటారు. మనసు యాక్టివ్ రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నా శరీరం సహకరించకపోవటం చాలా సహజమే. గతంలో బీఆర్ఎస్ లో చేరిన చాలామంది నేతలు చేరినకొత్తల్లో కాస్త హడావుడిగా కనిపించినా తర్వాత్తర్వాత వాళ్ళ ఉనికి కూడా కనబడలేదు. దీనికి ఉదాహరణలుగా కే కేశవరావు, ధర్మపురి శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సంభాని చంద్రశేఖర్, కేఆర్ సురేష్ రెడ్డి లాంటి ఎంతోమంది నేతలను చెప్పుకోవచ్చు. పైన చెప్పుకున్న నేతల్లో కేశవరావు, ధర్మపురి, కేఆర్ కు మాత్రం కేసీఆర్ రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు. మిగిలిన వాళ్ళకు ఏ పదవీ దక్కలేదు. పైన చెప్పిన నేతలందరూ కాంగ్రెస్ లో ఉన్నపుడు చాలా యాక్టివ్ గా ఉన్నవారే. ప్రతిరోజు మీడియాతో గంటలకొద్దీ మాట్లాడిన వాళ్ళే. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కేసీఆర్ అందరి గొంతులను నొక్కేయటమే కాకుండా నోటికి తాళం వేసేశారు. చివరకు ఆ సఫొకేషన్ తట్టుకోలేక దర్మపురి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తర్వాత అనారోగ్యంతో మరణించారు.
ఇక కేశవరావు అయితే పార్టీలో ఉన్నంతకాలం నోరెత్తలేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీతో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. మళ్ళీ ఇపుడు రెగ్యులర్ గా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇక కేఆర్ అయితే రాజ్యసభలో మాట్లాడటమ కాని బయట ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన మాజీమంత్రులు మండవ వెంకటేశ్వరరావు, ఎల్ రమణ తదితరులది కూడా అదే పద్దతి. ఒక్క తలసాని శ్రీనివాసయాదవ్, కేపీ వివేకానందగౌడ్ లాంటి ఇద్దరు ముగ్గురికి మాత్రమే మీడియాతో మాట్లాడే స్వేచ్చను కేసీఆర్ ప్రసాదించారు. తన కళ్ళముందే బీఆర్ఎస్ లో చేరిన పార్టీ ప్రముఖుల పరిస్ధితి ఏమిటో చూసి కూడా మళ్ళీ జీవన్ అదేపార్టీలో చేరటం అంటే తెలివైన పనేనా అనే చర్చలు జరుగుతున్నాయి.
కాస్త ఓపికపట్టుంటే
జీవన్ కాస్త ఓపిక పట్టుంటే బాగుండేదనే టాక్ ఎక్కువగా ఉంది. ఎలాగంటే జీవన్ కు ఇపుడేమీ కేసీఆర్ ఎలాంటి పదవి ఇవ్వలేరు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా జీవన్ కు కాకుండా తాను చెప్పిన వ్యక్తులకు ఇవ్వచ్చేమో. ఈ పద్దతిలో అయితే తన కోడలను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలాగూ 33శాతం మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అమల్లోకి వస్తే రిజర్వేషన్+పెరగబోయే నియోజకవర్గాల కారణంగా కాంగ్రెస్ పార్టీలోనే తన కోడలుకు జీవన్ టికెట్ ఇప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేతల అంచనా.
ఏది అధ్వాన్నం ?
రేవంత్ పాలన బాగా అధ్వాన్నంగా ఉందనే తాను బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు జీవన్ మీడియాతో చెప్పారు. గతంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ పాలన చాలా అధ్వాన్నంగా, ఘోరంగా ఉందని చాలాసార్లు జీవన్ మండిపడ్డారు. అదే విషయమై మీడియా గుర్తుచేసినపుడు అప్పట్లో తాను కేసీఆర్ పాలనపై ఆరోపణలు చేసింది వాస్తవమే అని అంగీకరించారు. అయితే రేవంత్ పాలనతో పోల్చినపుడు అప్పుడు కేసీఆర్ పాలనే మెరుగ్గా ఉందని ఇపుడు తనకు అనిపిస్తోందన్నారు. అందుకనే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. ఇదంతా చూసిన, విన్నవాళ్ళకు జీవన్ నిర్ణయం కరెక్టేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

