ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ షాకిచ్చాయా ?
x
Congress, BRS and BJP hand in hand

ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ షాకిచ్చాయా ?

ఈ ఎన్నికలో పదవుల కోసం సిద్ధాంతాలు వదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు చేతులు కలిపాయి.


ఎన్నికల్లో మామూలుగా అయితే పోటీచేసిన అభ్యర్ధులు లేకపోతే గెలుపు గ్యారెంటీ అని అనుకుని ఓడిపోయిన అభ్యర్ధులు షాక్ తింటారు. కాని తెలంగాణమున్సిపల్ ఎన్నికల్లో కొన్నిచోట్ల మూడుపార్టీలు కలిసి ఓటర్లకే షాకిచ్చాయి. ఈ ఎన్నికలోమునిసిపాలిటీలను కైవసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ ఎస్, బిజెపిలు పోటీ పడ్టాయి. ఈ మూడు ప్రధాన పార్టీలు ప్రత్యర్ధిపార్టీలని ప్రజలనుకుంటారు. ఆ ప్రకారంగానే ఓటేశారు. అయితే అధికారం ముందు అన్నీ పార్టీల వైఖరి ఒకేలాగ ఉంటుందని అర్ధమైపోయింది. అధికారం కోసం మూడుపార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒకదానితో మరొకటి కొన్నిచోట్ల కలిసిపోయాయి. మరీ ముఖ్యంగా కొన్ని చోట్లు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిలు కలసి బిఆర్ ఎస్ ను ఓడిచేందుకు చేతులు కలపడం విచిత్రం. ప్రత్యర్థి పార్టీల మధ్య ఈ పొత్తులు కొన్ని చోట్ల ప్రత్యక్షంగా ఉంటే మరికొన్ని చోట్ల పరోక్షంగా సాగాయి. ఇలాంటి పొత్తులు జరిగాయనేందుకు బిజెపి మెదక్ ఎంపి రఘునందన్ రావు చేసిన ప్రకటనయే సాక్ష్యం. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆదేశాల మేరకే తాను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశానని బహిరంగంగా ప్రకటించారు.

"ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ పార్టీ నుండి నా మీద ఎంపీగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత పోటీలో ఉంది. వాళ్ళని ఓడించడానికి గూడెం మహిపాల్ రెడ్డి నా దగ్గరికి వచ్చి అడిగితే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశాను," అని రఘునందన్ ప్రకటించారు. బిజెపి ఏమిటి? బిఆర్ ఎస్ కు ఓటేయడమేమిటి?

ఈనెల 11వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు 13వ తేదీన వచ్చాయి. 13వ తేదీన వచ్చిన ఫలితాల ఆధారంగా పార్టీల తరపున ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక 16వ తేదీన జరిగాయి.

రాజకీయాల్లో శతృవుకు శతృవు మిత్రుడు అనే నానుడి ఉంది. అయితే విచిత్రం ఏమిటంటే శతృవులు, మిత్రులు మున్సిపాలిటిలో దక్కిన సీట్ల ఆధారంగా ఎక్కడికక్కడ మారిపోయారు. కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించాయి. మరికొన్ని చోట్ల కాంగ్రెస్-బీజేపీ కలిసిపోయి బీఆర్ఎస్ ను ఓడగొట్టాయి. మరికొన్ని మున్సిపాలిటీల్లో అయితే బీఆర్ఎస్-బీజేపీ ఏకమైపోయి కాంగ్రెస్ ను దెబ్బకొట్టాయి. ఒక కార్పొరేషన్లో అయితే బీఆర్ఎస్ ఓటింగును బహిష్కరించటం ద్వారా బీజేపీకి పోరక్షంగా సహకరించి కాంగ్రెస్ ను దెబ్బకొట్టింది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...

ఆదిలాబాద్ లో సరప్రైజ్

ఆదిలాబాద్ మున్సిపాలిటిలోని 49 వార్డుల్లో అత్యధిక వార్డులను బీజేపీ గెలిచింది. అయితే మ్యాజిక్ ఫిగర్ అయిన 25కి కాస్త దూరంలోనే ఉండిపోయింది. అందుకని ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్రులు కలిసిపోయి బీజేపీని దెబ్బకొట్టాయి.

భైంసాలో విచిత్రం

భైంసా మున్సిపాలిటి ఏఐఎంఐఎంకు కంచుకోటనే చెప్పాలి. 26 వార్డులకు జరిగిన ఎన్నికలో ఛైర్మన్ అవ్వాలంటే 14 వార్డుల్లో గెలిచితీరాలి. అయితే ఏ పార్టి కూడా 14 వార్డులను గెలవలేదు. అత్యధికంగా ఎంఐఎం 12 వార్డుల్లో గెలిచింది. మామూలుగా అయితే పోటీచేసిన అన్నీ పార్టీల్లో కలిపి అత్యధిక వార్డుల్లో గెలిచిన ఎంఐఎం అభ్యర్ధినే బలపరిచి ఛైర్మన్ను చేయాలి. కాని ఇక్కడ జరిగింది ఏమిటంటే ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసి బీజేపీ కౌన్సిలర్ దత్తారాం ను ఛైర్మన్ గా ఎన్నుకున్నాయి. అలాగే ఎంఐఎం తిరుగుబాటు అభ్యర్ధిగా గెలిచిన సిద్ధిఖీ వైఎస్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. అంటే ఇక్కడ ఎంఐఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి.

నర్సాపూర్ వింత

నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులున్నాయి. వీటిల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 వార్డుల్లో గెలిచాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇవ్వటంతో కాంగ్రెస్ అభ్యర్ధి ఛైర్మన్ అయ్యారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చింది కాబట్టి బీజేపీ కౌన్సిలర్ వైస్ ఛైర్మన్ అయ్యారు. మెదక్ మున్సిపాలిటీలో బీజేపీ సహకారంతో కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని గెలుచుకుంది. అలాగే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఎంపీ రఘునందనరావు ఎక్స్ అఫీషియో ఓటును బీఆర్ఎస్ కు వేసి కారుపార్టీ అభ్యర్ధి ఛైర్మన్ అవటానికి సహకరించారు. జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు 6, బీజేపీకి 4 వార్డులు దక్కాయి. అయితే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చేతులు కలపటంతో బీఆర్ఎస్ కు ఛైర్మన్ పదవి, బీజేపీకి వైస్ ఛైర్మన్ పదవి దక్కాయి. రంగారెడ్డి జిల్లా అమనగల్లు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీలు ఒకటయ్యాయి. ఇక్కడ 15 వార్డుల్లో కాంగ్రెస్ కు 1, బీఆర్ఎస్ 8, బీజేపీ 6 వార్డుల్లో గెలిచాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీకి ఒకటైపోయాయి. దాంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్, బీజేపీలు దక్కించుకున్నాయి. అత్యధిక సీట్లు బీఆర్ఎస్ గెలిచినా ఆ పార్టీలో నుండి ఒక కౌన్సిలర్ పార్టీ నుండి బయటకు వచ్చేసి కాంగ్రెస్ కు మద్దతు పలికారు. అలాగే కాంగ్రెస్ ఎంఎల్ఏ ఎక్స్ అఫీషియో ఓటు కారణంగా కాంగ్రెస్, బీజేపీలకు పదవులు వరించాయి.

కామారెడ్డి ఏమి జరిగింది?

కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్-బీఆర్ఎస్ ఏకమైపోయి పదవులను పంచుకున్నాయి. ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్ధులు (కెసిఆర్, రేవంత్ రెడ్డి) లను ఓడించి గెలిచారు.ఆయనకు నియోజకవర్గంలో మంచిపేరుంది. సహజరంగానే ఈ మునిసిపాలిటీ బిజెపి చేతిలోకి వెళ్తుతుందనుకుంటారు. అలా జరగలేదు.

ఆలియా బాద్ ఎన్నిక

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆలియాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ ఏకమై పదవులను పంచుకున్నాయి. ఇక్కడ ఇరవై వార్డులున్నాయి. కాంగ్రెస్ 8 వార్డలును, బిఆర్ ఎస్ 7 వార్డులను గెల్చుకుంటే బిజెపి మూడు వార్డులలోగెలిచ్చింది.ఛైర్మన్ పదవి రావాలంటే 11 మంది కౌన్సిలర్ల సపోర్టు ఉండాలి. ఇక్కడ బిఆర్ ఎస్ కు వ్యతిరేకంగా బిజెపి కాంగ్రెస్ కు మద్దతు నిచ్చింది. కాంగ్రెస్ సభ్యుడు చైర్మన్అయ్యాడు. బిజెపి సభ్యుడు వైస్ చైర్మన్ అయ్యాడు.

బిజెపి ‘చేతి‘కి చేయూత

మెట్ పల్లిలో కూడా ఇలాంటి సమీకరణాలే పనిచేశాయి. అక్కడ ఒక్క బిజెపి కౌన్సిలర్ మద్దతు కాంగ్రెస్ విజయానికి నిర్ణయాత్మకంగా మారింది. అమంగల్, సిర్పూర్-కాగజ్ నగర్ లలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ప్రతి సందర్భంలోనూ బిజెపి సమయానుకూలంగా కాంగ్రెస్ కు మద్దతు నిచ్చింది, ప్రతిఫలం పొందింది.

ఇక కరీంనగర్ సంగతి చూద్దాం

కరీంనగర్ కార్పొరేషన్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడున్న 66 డివిజన్లలో అత్యధికంగా 30 చోట్ల బీజేపీ గెలిచింది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లు+ఎంఎల్ఏ, ఎంఎల్సీల ఎక్స్ అఫీషియో ఓట్లతో అయితే టై అవ్వాలి లేదా కాంగ్రెస్ కూటమికి పదవులు దక్కాలి. ఈ పద్దతిలోనే ఫలితాలు వెలువడిన 13వ తేదీనుండి 15వ తేదీవరకు మంతనాలు జరిగాయి. 15వ తేదీ రాత్రి తెరవెనుక ఏమి చర్చలు జరిగాయో తెలీదు. 16వ తేదీ ఉదయం ఎన్నికను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. దాంతో బీజేపీ అభ్యర్ధి మేయర్ అయిపోయారు. అంటే బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ ఓటింగును బహిష్కరించినట్లు అర్ధమవుతోంది.

Read More
Next Story