కేసీఆర్ కు గూడెం పెద్ద గిఫ్ట్ ఇచ్చారా ?
x
BRS defection MLA Gudem Mahipal Reddy

కేసీఆర్ కు గూడెం పెద్ద గిఫ్ట్ ఇచ్చారా ?

తొందరలోనే మహిపాల్ తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్ళి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముందు ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవక్కర్లేదు.


బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏల్లో కొందరి మనసు మళ్ళిందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల వల్లే చాలామందిలో ఇలాంటి అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు సాక్షంగా పటాన్ చెరు నియోజకవర్గాన్ని తీసుకోవచ్చు. 2023 ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి గెలిచారు. ఈయన స్వతహాగా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కాంట్రాక్టర్ కమ్ మైనింగ్ బిజినెస్ మెన్. అధికారంలో ఏ పార్టీ ఉంటే అందులో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకనే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించాడు.

గడచిన రెండేళ్ళుగా గూడెం కాంగ్రెస్ తోనే ఉంటున్నారు. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. కారణం ఏమిటంటే తన మైనింగ్ సంస్ధపైన విజిలెన్స్ సంస్ధ దాడులు చేయటం, క్వారీలను సీజ్ చేయటమే కాకుండా మద్దతుదారులను అరెస్టు కూడా చేసింది. కొద్దిరోజుల క్రితం మహిపాల్ రెడ్డి తమ్ముడు మదుసూధనరెడ్డి బీఆర్ఎస్ లో చేరాడు. కారణాలు ఏమైనా తాజా మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచింది. మహిపాల్ కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది తాను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవకుండా బీఆర్ఎస్ గెలవటం ఏమిటి ? అనే సందేహాలు అందరిలోను పెరిగిపోయాయి.

ఇదే సమయంలో ఎన్నికల ఫలితాలపై మీడియాతో ఎంఎల్ఏ మాట్లాడుతు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఐదుమున్సిపాలిటీలను బహుమతిగా ఇచ్చినట్లు చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. అంటే ఐదుమున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు మద్దతుగా గూడెం పనిచేసినట్లు అర్ధమవుతోంది. బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీల్లో అత్యధికం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలు డైరెక్టుగాను, మరో రెండు మున్సిపాలిటీలు పరోక్షంగాను మహిపాల్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ గెలిచింది. ఎంఎల్ఏ సహకరించకపోతే బీఆర్ఎస్ కు రాష్ట్రంలో 17 మున్సిపాలిటీల్లో గెలిచేదే కాదు. తాజా డెవలప్మెంట్లతో ఎంఎల్ఏ మనసు మళ్ళీ బీఆర్ఎస్ వైపు మళ్ళినట్లే అనుకోవాలి. ఈ విషయాన్ని ఎంఎల్ఏ దాచుకోకుండా డైరెక్టుగా మీడియాతోనే చెప్పారు. కేసీఆర్ కు ఐదు మున్సిపాలిటీలను పుట్టినరోజు బహుమతిగా ఇచ్చానని ఎంఎల్ఏ చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటో అర్ధమైపోతోంది.

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలను తిరిగి ఎట్టి పరిస్ధితిలోను పార్టీలోకి చేర్చుకునేది లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలాసార్లు మీడియాలోనే చెప్పిన విషయం తెలిసిందే. పైగా ఈ పదిమందిపైన అనర్హత వేటు వేయించేందుకు సుప్రింకోర్టులో కేటీఆర్ కేసులు కూడా వేశారు. విచారణలు వివిధ దశల్లో ఉన్నాయి. అలాంటపుడు పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడని కేటీఆర్ మరి ఫిరాయింపుల సహకారం మాత్రం ఎలా తీసుకున్నట్లు ?

ఎలాగంటే, నిజానికి ఫిరాయింపులపై అనర్హత వేటుపడటం కేటీఆర్ కు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయం అర్ధమైపోతోంది. అలాగే పదిమందిని ఒత్తిడిలోకి నెట్టి వాళ్ళందరినీ తిరిగి పార్టీలోకి వచ్చేట్లు చేయటమే కేటీఆర్ అసలు ఉద్దేశ్యంగా అర్ధమవుతోంది. నిజంగానే ఫిరాయింపులపై కేటీఆర్ లో అంతటి వ్యతిరేకతే ఉంటే ఇపుడు మహిపాల్ సహకారం తీసుకునేవారే కాదు. అయినా సహకారం తీసుకున్నారంటే తెరవెనుక కేటీఆర్-మహిపాల్ మధ్య ఏదో ఒప్పందం జరిగే ఉంటుంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సో, తొందరలోనే మహిపాల్ తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్ళి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ముందు ప్రత్యక్షమైనా ఆశ్చర్యపోవక్కర్లేదు.

బొమ్మ కామెంట్స్

పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి తాను ఏపార్టీలో ఉన్నానో అతనే చెప్పాడు కదాని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపుకు ఎంఎల్ఏ సహకరించిన విషయం బొమ్మ మీడియా సమావేశంలో చర్చకు వచ్చింది. మీడియా అడిగిన ప్రశ్నకు బొమ్మ సమాధానమిస్తు మహిపాల్ రెడ్డి ప్రకటనపై తాను మాట్లాడటానికి ఏమీలేదు అన్నారు. ఢిల్లీలో మీటింగ్ తర్వాత పార్టీలో చేరిన ఎంఎల్ఏల వ్యవహారంపై పూర్తి స్పష్టత ఇస్తాను అని బొమ్మ చెప్పారు.

రేవంత్ స్పందన ఏమిటో ?

మహిపాల్ ప్రకటనపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్పందన ఏమిటో అంతుబట్టడంలేదు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తర్వాత తిరిగి బీఆర్ఎస్ లోకి ఎంఎల్ఏ వెళ్ళేట్లయితే అనర్హత వేటు పడకుండా ఉంటుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు కాంగ్రెస్ తోనే ఉన్నారు కాబట్టి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ తర్వాత గూడెం కాంగ్రెస్ లోకి ఫిరాయించారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేశారు. అదే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళితే ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా ? వ్యాపారాల్లోని లొసుగులను పట్టుకుని ఎంఎల్ఏపై యాక్షన్ కు దిగకుండానే ఉంటుందా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మహిపాల్ నుండి స్పష్టత వస్తే ప్రభుత్వం నుండి రియాక్షన్ ఎలాగుంటుందో చూడాలి.

Read More
Next Story