కవితను ఈ ‘సెంటిమెంట్’ గట్టెక్కిస్తుందా  ?
x
Kalvakuntla kavitha

కవితను ఈ ‘సెంటిమెంట్’ గట్టెక్కిస్తుందా ?

నిజామాబాద్ కు చెందిన దేవనపల్లి రామయ్యగారి అనీల్ కుమార్ ను కవిత వివాహం చేసుకున్నారు.


అత్తగారి ఊరు నిజామాబాద్ మీద కల్వకుంట్ల కవిత చాలా ఆశలే పెట్టుకున్నారు. మొన్నటి ఉగాది పండుగ రోజున కొత్తపార్టీ తెలంగాణ ప్రజా జాగృతిని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రకటనకన్నా ముందు ఒక సందర్భంగా కవిత మాట్లాడుతు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీచేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. పై రెండింటిలో కూడా సిద్ధిపేటే తన మొదటి చాయిస్ అనికూడా అన్నారు. అలాంటిది పార్టీ ప్రకటించిన రోజున తాను పోటీచేయబోయే నియోజకవర్గాల గురించి మాటమాత్రంగా కూడా మాట్లాడలేదు. పైగా తనను తన అత్తగారి ఊరు ఆదరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు. కవిత అత్తగారి ఊరంటే నిజామాబాద్.

2003లో నిజామాబాద్ కు చెందిన దేవనపల్లి రామయ్యగారి అనీల్ కుమార్ ను కవిత వివాహం చేసుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో రెండోసారి మళ్ళీ ఎంపీగా అక్కడినుండే పోటీచేసి ఓడిపోయారు. ఎంపీగా పనిచేసిన ఐదేళ్ళల్లో కవిత జనాగ్రహాన్ని బాగా మూటకట్టుకున్నారు. కవితపైన ముఖ్యంగా రైతాంగం మండిపోయింది. కవితకు వ్యతిరేకంగా, కవితను ఓడించటమే లక్ష్యంగా సుమారు 100 మంది రైతులు ఎంపీగా నామినేషన్లు వేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది. వివిధ కారణాల వల్ల బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్ చేతిలో కవిత ఓడిపోయారు.

తర్వాత 2018లో జరిగిన స్ధానికసంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేసిన కవిత గెలిచారు. అంటే ఎంపీగా ఒకసారి గెలిచి మరోసారి ఓడిపోయిన కవిత ఎంఎల్సీగా గెలవటంతో అత్తగారి ఊరు తనను ఆదరిస్తోందనే భావనలో ఉన్నారు. అందుకనే పార్టీ బలోపేతం అయ్యేవిషయంతో పాటు రాబోయే ఎన్నికల్లో గెలుపుమీద కూడా కవిత అత్తగారి ఊరైన నిజామాబాద్ మీద గట్టి ఆశలే పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అయితే కవిత ఆశలుపెట్టుకున్నట్లుగా నిజామాబాద్ ఆదరిస్తుందా ? అన్నదే కీలకమైన ప్రశ్న.

ఈ ప్రశ్న ఎందుకు కీలకమైనది అంటే కేసీఆర్ కూతురి హోదాలో రెండోసారి ఎంపీగా పోటీచేస్తేనే జనాలు గెలిపించలేదు. అధికారంలో ఉన్నపుడు జరిగిన స్ధానికసంస్ధల్లో మెజారిటి స్ధానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కాబట్టి స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీగా పోటీచేసిన కవిత గెలవటంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. అప్పుడు కవిత అంటే కేసీఆర్ గారాల పట్టి. కానీ ఇపుడు.. తండ్రి కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న కూతురు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీ, రేవంత్ తో పాటు తన తండ్రి కేసీఆర్ కూడా తనకు ప్రత్యర్ధే అని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి కవితకు సహకారం అందే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. సహకారం అందకపోగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల నుండి గట్టిపోటీని ఎదుర్కోక తప్పదు. అత్తగారి ఊరు, అమ్మగారి ఊరనే సెంటిమెంటు డైలాగులు పనిచేయవు. క్షేత్రస్ధాయిలో పార్టీకి ఆధరణ ఉంటేనే ఎన్నికల్లో ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇవ్వగలరు లేదంటే అంతే సంగతులు.

బీఆర్ఎస్ ఎంఎల్ఏలు టచ్ లో ఉన్నారా ?

కవిత బీఆర్ఎస్ నాయకత్వంపైన మైండ్ గేమ్ ఆడుతున్నట్లుంది. తనతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, మాజీలు టచ్ లో ఉన్నట్లు చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. కవిత పార్టీలో ఏముందని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, మాజీలు టచ్ లో కి వెళతారు ? అధినేత కేసీఆర్ దూరంపెట్టేసిన నేతలు లేదా వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దొరకదని గట్టి అనుమానం ఉన్న నేతల్లో ఎవరైనా కవితతో టచ్ లోకి వెళితే వెళ్ళచ్చంతే. అదికూడా అలాంటి వాళ్ళ ఫస్ట్ ఛాయిస్ బీజేపీ అవుతుందే కాని తెలంగాణ ప్రజా జాగృతి అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

ఇక, పోటీ విషయాన్ని చూస్తే కవిత ప్రకటించిన సిద్ధిపేట, బోధన్ లో గెలుపు అంత వీజీకాదు. సిద్ధిపేటలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తన్నీరు హరీష్ రావు పోటీచేయటం ఖాయం. గడచిన ఆరుఎన్నికల్లో ఓటమి ఎరుగని అభ్యర్ధిగా హరీష్ డబుల్ హ్యాట్రిక్ సాధించారు. కాబట్టి హరీష్ ను ఢీకొనటం కవితకు అంత ఈజీకాదు. అయితే సిద్ధిపేటలో పోటీచేస్తే తన పరిస్ధితి ఎలాగుంటుందనే విషయం తెలియని అమాయకురాలైతే కాదు కవిత. గ్రౌడ్ లెవల్లో ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించుకునే ఉంటుంది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అలాగే బోధన్ లో కూడా గెలుపు గ్యారెంటీ లేదు. ఇక్కడ కాంగ్రెస్ రెండుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచింది. కాబట్టి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కవిత సిద్ధిపేటతో పాటు బోధన్ లో కూడా పోటీచేస్తారేమో చూడాలి. సిద్ధిపేటలో పరిస్ధితులు ఎలాగ మారినా అత్తగారి ఊరు ఆధరిస్తుందనే సెంటిమెంటును ప్రయోగించే ఆలోచనలో ఉన్నారేమో చూడాలి.

Read More
Next Story