
ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ఒంటరైపోయారా ?
ఈ కేసులో రాజకీయ ప్రత్యర్ధులు కాంగ్రెస్, బీజేపీతో పాటు కూతురు కల్వకుంట్ల కవిత కూడా గొంతు కలుపుతుండటమే కేసీఆర్ కు మింగుడుపడని అంశంగా మారింది
ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకమవుతోంది. ఈకేసు విచారణ వేగం పెరగడం, కీలక పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో “కేసీఆర్ ఒంటరైపోయారా?” అనేప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో పరిస్థితి మారిందన్న భావన వ్యక్తమవుతోంది. ఈ కేసులో రాజకీయ ప్రత్యర్ధులు కాంగ్రెస్, బీజేపీతో పాటు సొంతకూతురు కల్వకుంట్ల కవిత కూడా గొంతు కలుపుతుండటమే కేసీఆర్ కు మింగుడుపడని అంశంగా మారింది. కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవిత బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాబట్టే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పదేపదే డిమాండ్ చేస్తున్నారు.
రోజులు గడిచేకొద్దీ ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ దృష్టి క్రమంగా పైస్థాయిలకు చేరిందన్న విషయం అర్ధమైపోయింది. ట్యాపింగ్ వ్యవహారం కేవలం పోలీసు స్థాయి తప్పిదమా? లేక రాజకీయంగా అత్యున్నత స్ధాయిలోని వ్యక్తుల ఒత్తిడి ఫలితమా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈనేపథ్యంలో కేసీఆర్ పాత్రపై ఆధారాలున్నా లేకపోయినా రాజకీయ బాధ్యత అంశం ముందుకు వస్తోంది.
నేతల్లో చాలామంది నోరిప్పటంలేదు
బీఆర్ఎస్ లోపల కూడా ఒక రకమైన నిశ్శబ్దం కనిపిస్తోంది. గతంలో పార్టీకి బలంగా నిలిచిన నేతలు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. చాలామంది నాయకులు అసలు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై నోరిప్పటంలేదు. మరికొందరు వ్యక్తిగతంగా తమభద్రత చూసుకోవడంతో కేసీఆర్ “ఒంటరైపోతున్నారు” అన్న అభిప్రాయం బలపడుతోంది.
ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈకేసును రాజకీయఆయుధంగా మలచాలని చూస్తోందన్న ప్రచారం కూడా ఉంది. అయితే ప్రత్యర్ధి పార్టీని ఇరుకునపెట్టాలని చూసే ఏపార్టీ అయినా ఇపుడు కాంగ్రెస్ చేసే పనేచేస్తుందనటంలో సందేహంలేదు. అధికార మార్పు తర్వాత పాత పాలనపై దర్యాప్తు పేరుతో కేసులను ముందుకు తెస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా, విచారించినా తెలంగాణ అస్తిత్వానికే దెబ్బన్న పిచ్చి లాజిక్కులు కేటీఆర్, హరీష్ వినిపించటం ఆశ్చర్యంగా ఉంది. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ చేసిన అధికార దుర్వినియోగంపై విచారణ చేయకూడదా అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల వాదనలు, ఆరోపణలను తిప్పొకొడుతున్నారు. . వీళ్ళ ఆరోపణలు, వాదనలు ఎలాగున్నా ప్రజల దృష్టిలో మాత్రం “నిజాలు బయటపడాలి” అనే ఆకాంక్ష బలంగా కనబడుతోంది.
మౌనమా ? వ్యూహాత్మకమా ?
కేసీఆర్ రాజకీయంగా ఇప్పటికీ పెద్దనాయకుడే అయినా, పరిస్థితులు మారినప్పుడు మిత్రులు, వ్యవస్థలు కూడా మారిపోతాయని రాజకీయ చరిత్ర చెబుతోంది. గతంలో ఆయన చుట్టూ ఉన్న అధికార వలయం ఇప్పుడు లేదన్న విషయం వాస్తవం. అదే సమయంలో ఆయన నుంచి స్పష్టమైన రాజకీయ ఎదురుదాడి లేకపోవడం కూడా అనుమానాలను పెంచేస్తోంది.
మొత్తానికి ట్యాపింగ్ కేసు కేసీఆర్ భవిష్యత్ రాజకీయ దిశను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశముంది. ఆయన ఒంటరైపోయారా? లేక వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఈకేసు కీలకంగా మాత్రం నిలిచిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈకేసును రాజకీయంగా బలంగా ఉపయోగించుకుంటోందన్న వాదన కూడా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవహారాలపై విచారణలు వేగం పెంచడం ద్వారా ప్రజల్లో “పాత పాలనపై చర్యలు” అనే సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ట్యాపింగ్ కేసు విషయంలో కూడా ప్రభుత్వం దర్యాప్తును సీరియస్ గానే ముందుకు తీసుకెళ్తోంది.
నిజంగా ప్రతీకార చర్యేనా ?
అయితే బీఆర్ఎస్ మాత్రం దీనిని రాజకీయ ప్రతీకారంగా చిత్రీకరిస్తోంది. ఎన్నికల తర్వాత కేసులను తెరపైకి తెచ్చి కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయాలని రేవంత్ కుట్రపన్నుతున్నారంటు కేటీఆర్, హరీష్ నానా గోలచేస్తున్నారు. కానీ మరోవైపు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యత, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా వంటి అంశాలు తీవ్రమైనవిగా ఉండటంతో తప్పుచేసిన వారు ఎవరైనా సరే బాధ్యత వహించాల్సిందే అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ట్యాపింగ్ లేదు ఏమీలేదు అంతా ఉత్తదే అని జనాలను నమ్మించేందుకు కేటీఆర్, హరీష్ ప్రయత్నాలుచేస్తున్నారు. అయితే వీళ్ళ ఆరోపణలు, విమర్శల్లోని డొల్లతనం బయటపడుతునే ఉంది.
కాంగ్రెస్‌కు ఈకేసు రాజకీయంగా లాభపడుతుందా ? లేక మైనస్ అయి కాంగ్రెస్ పార్టీపైన దెబ్బపడుతుందా ? అన్నది కీలక ప్రశ్న. కేసు విచారణ పారదర్శకంగా సాగితే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. కానీ ఇది కేవలం రాజకీయ పోరాటంగా మారితే తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది.
ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ పైన కేసులు నమోదుచేసి వెంటనే అరెస్టుచేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండ సంజయ్ లాంటి వాళ్ళు పదేపదే డిమాండ్ చేస్తున్నారు. అయితే తగినన్ని ఆధారాలు లేకుండా అరెస్టుచేస్తే కోర్టులో నిలబడవని గ్రహించటంలేదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడం, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం తీవ్రమైన అంశమని రేవంత్ తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలతో పాటు చాలామంది అంటున్నారు. ఈ కేసు కేవలం పోలీసు స్థాయి తప్పిదం కాదని, అత్యున్నతస్ధాయిలోని వ్యక్తుల రాజకీయ బాధ్యత కూడా ఉందన్న కోణంలో బీఆర్ఎస్ ప్రత్యర్ధులు దాడి చేస్తున్నారు.
బీజేపీ కూడా ఒత్తిడి పెంచేస్తోెందా ?
ఇక బీజేపీ కూడా ఈ కేసులో కేసీఆర్‌పై ఒత్తిడి పెంచుతోంది. బండి సంజయ్, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా కేసీఆర్ ను అరెస్టుచేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవహారాలపై ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నిజాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాపింగ్ లాంటి ఘటనలు రాష్ట్ర పరిపాలనపై మచ్చగా మిగిలాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అని వీళ్ళు రేవంత్ ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తున్నారు.
ఇక ఈ కేసులో మరో కీలక మలుపు కవిత ఆరోపణలు, డిమాండ్లు. పదేళ్ళు బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ కూడా ట్యాపింగ్ కు బాధ్యత వహించాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబంతో పాటు సీనియర్ నేతలకు మింగుడుపడటంలేదు. కారణంగా ఏమిటంటే తమ హయాంలో తనతో పాటు తన భర్త ద్యవనపల్లి అనీల్ కుమార్ ఫోన్ కూడా ట్యాపవ్వటమే. బీఆర్ఎస్ ప్రత్యర్ధుల నుండి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అనే డిమాండ్లు పెరిగిపోతుందటంతోనే కేసీఆర్ “ఒంటరైపోతున్నారా?” అన్న సంకేతాలు బలంగా కనబడుతున్నాయి.
కేసీఆర్ పరిస్ధితి ఏంటి ?
బీఆర్ఎస్ మాత్రం దీనిని రాజకీయ ప్రతీకారంగా చూస్తోంది. అధికార మార్పు తర్వాత కేసులను తెరపైకి తెచ్చి కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్, హరీష్ తదితరులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం “నిజాలు బయటపడాలి” అనే ఆకాంక్ష బలంగా ఉంది.
మొత్తానికి ట్యాపింగ్ కేసు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశంగా మారే అవకాశముంది. కాంగ్రెస్, బీజేపీ, కవిత వేర్వేరు వర్గాలు ఒకేమాటగా ‘బాధ్యలపై కఠిన చర్యలు’ అన్న డిమాండును ముందుకు తెస్తుండటంతో కేసీఆర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇది వ్యూహాత్మక మౌనమా? లేక నిజంగానే రాజకీయంగా ఒంటరితనమా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

