మున్సిపల్ ఎన్నికల్లో జనాల బాగోగులు ఒక్కళ్ళకీ పట్టలేదా ?
x

మున్సిపల్ ఎన్నికల్లో జనాల బాగోగులు ఒక్కళ్ళకీ పట్టలేదా ?

ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరూ మినహాయింపు కాదు


మున్సిపల్ ఎన్నికలంటేనే జనాలకు తాము కల్పించిన సౌకర్యాల గురించి చెప్పుకోవటం. కాని అదేమి విచిత్రమో సోమవారం సాయంత్రంతో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా జనాలకు కల్పించిన లేదా కల్పిస్తున్న, కల్పించబోతున్న సౌకర్యాల గురించి పెద్దగా ప్రస్తావన తేలేదు. ఎంతసేపు ప్రత్యర్దులపైన తాము పై చేయి సాధించటమే లక్ష్యంగా ఎదుటివారిపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయటంతోనే ప్రచారాన్ని ముగించేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరూ మినహాయింపు కాదు.

నిజానికి రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం సరిగాలేదు. మురుగు కాల్వలను బావు చేయటం తగ్గిపోయింది. రోడ్లపైన చెత్తను సుభ్రంగా ఊడ్వటం తగ్గిపోయింది. రోడ్లను మంచిగా వేయటం లేదా గుంతలు పడిన రోడ్లను రిపేర్లుచేయటం జరగటంలేదు. మున్సిపల్ ఎన్నికలంటే ఓటర్లు లేదా జనాలు పైన చెప్పిన సమస్యల పరిష్కారాన్నే పాలకుల నుండి ఎక్కువగా ఆశిస్తారు. కనీసం ఎన్నికల ముందన్నా ప్రభుత్వం తమకు సౌకర్యాలు కల్పిస్తుందని ప్రజలు ఆశిస్తారు. అయితే జనాలు ఆశించిన లేదా జనాలకు ఉపయోగపడే పనులు చేయకుండా ఎంతసేపు ప్రత్యర్ధులను తిట్టడం లేదా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయటంతోనే పార్టీలకు సరిపోయింది.

సోమవారంతో ముగిసిన ఎన్నికల ప్రచారంలో కూడా పార్టీల నేతల మధ్య ఇలాంటి ధోరణే ఎక్కువగా కనబడింది. ప్రజలకు కల్పించబోయే సౌకర్యాల గురించి రేవంత్ పెద్దగా ఎక్కడా ప్రస్తావించలేదు. 5 మున్సిపాలిటీల్లో రేవంత్ ప్రచారంచేసినా గడచిన రెండేళ్ళల్లో మున్సిపాలిటీల్లో తాము చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయారు. తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలోఉన్న బీఆర్ఎస్ మున్సిపాలిటీల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోయిందన్న ఆరోపణలకే పరిమితమయ్యారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని పదేపదే ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేదని మండిపోయారు. మూడేళ్ళ తర్వాత జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని నమ్మబలికారు. అంతేకాని తాము అధికారంలో ఉన్నపుడు మున్సిపాలిటీల అభివృద్ధికి ఖర్చుచేసిన నిధులు, చేసిన అభివృద్ధి పనుల గురించి పెద్దగా చెప్పుకోకపోవటమే ఆశ్చర్యమేసింది. నిజంగానే బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను అద్దాల్లాగ తీర్చిదిద్దితే ఇపుడిన్ని సమస్యలు ఎక్కడినుండి వచ్చాయని అడిగితే సమాధానం చెప్పలేదు.

బీఆర్ఎస్ హయాంలో కూడా గుంతలుపడిన రోడ్లు, కంపుకొట్టిన డ్రైనేజీ వ్యవస్ధ, వర్షంపడితే రోడ్లమీదకు లేదా ఇళ్ళల్లోకి పొంగిపొర్లిన డ్రైనేజీ నీళ్ళ సంగతి అందరికీ తెలిసిందే. మిగిలిన రాష్ట్రం సంగతి వదిలేసినా చివరకు గ్రేటర్ హైదరాబాదును కూడా బీఆర్ఎస్ ఏమంత అద్భుతంగా చేసిందిలేదు.

ఇక బీజేపీ సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా కేంద్రం నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నట్లు చెబుతారు. ఏ మున్సిపాలిటీని కేంద్రం నిదులతో అభివృద్ధి చేశారో చెప్పమంటే చెప్పరు. ఏ మున్సిపాలిటీ అభివృద్దికి కేంద్రం నిధులు ఎంత ఇచ్చిందో చెప్పమంటే మళ్ళీమాట్లాడరు. ఎంతసేపు ప్రత్యర్దులపైన ఆరోపణలతో విరుచుకుపడటంతోనే సరిపోతోంది కేంద్రమంత్రులకు.

ఈ ఒరవడి ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. అన్నీపార్టీల్లోని అందరు నేతల పద్దతి ఇలాగే ఉంది. ఉదాహరణకు మూడు రోజుల క్రితం నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ మొదటి అంతస్తు మంటల్లో కాలిపోయింది. అగ్నిప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, కొన్ని కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ మెటీరియల్, ల్యాబ్ పరికరాలు, ఫైల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం జరిగిందో లేదో వెంటన కేటీఆర్ స్పందించేసి ఓటుకునోటు కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కాల్చేసేందుకు రేవంత్ రెడ్డే కుట్ర చేశాడంటు గోల మొదలుపెట్టేశారు. కేటీఆర్ ఆరోపణలు మొదలుపెట్టినపుడు అసలు మొదటి అంతస్తులో ఉన్న మెటీరియల్ ఏమిటి ? కాలిపోయింది ఏమిటన్న విషయాలు ప్రభుత్వానికే తెలియదు. అంత తొందరగా రేవంత్ పైన కేటీఆర్ ఎందుకు ఆరోపణలు చేసినట్లు ?

ఓటుకునోటు కేసులోని ఆడియో ఫైల్స్ ను రేవంతే తగలబెట్టేశాడన్నట్లుగా కేటీఆర్ రెచ్చిపోయారు. ఓటుకు నోటు కేసులోని ఆడియో ఫైళ్ళు తగలబెడితే మరి టెలిఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ టేపులు కూడా అందులోనే ఉన్నాయి కదా. సాక్ష్యాలు లేకుండా చేయటం కోసమే కేటీఆరే తన మనుషులతో కాలిపోయేట్లు చేశాడంటూ కాంగ్రెస్ ఎంఎల్సీ అద్దంకి దయాకర్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎదురు దాడులు మొదలుపెట్టారు. అగ్నిప్రమాదంలో కీలకమైన సాక్ష్యాలు ఏవీ కాలిపోలేదని, ఓటుకునోటు కేసుకు సంబంధించిన ఆడియో ఫైల్స్, సాక్ష్యాలు తమదగ్గర ఏవీలేవని అన్నీ ఏసీబీ కోర్టులోనే ఉన్నాయని ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పినా కేటీఆర్ వినిపించుకోవటంలేదు.

అంటే, నేతల మధ్య ఒకరంటే మరొకరికి ఎంతటి వ్యక్తిగత ధ్వేషం పెరిగిపోయిందో అర్ధమవుతోంది. ఏదో రకంగా ఎదుటివారిపైన ముందు బురద ఎవరు చల్లుతారు అన్నదే ఇక్కడ ముఖ్యమైపోయింది. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో జనాల సమస్యలు, పరిష్కారాలకన్నా వ్యక్తిగత ఆరోపణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకున్నారు.

Read More
Next Story