Telangana CM Revanth Reddy
x
Revanth Reddy

రేవంత్ వ్యూహాల వల్లే ఇంతటి సక్సెస్ సాధ్యమైందా ?

అభ్యర్ధుల ఎంపికనుండి ప్రచారం, పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను చేరవేయటం వరకు అంతా రేవంత్ వేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది


ఎన్నికల్లో గెలవాలంటే అనేక అంశాలు సానుకూలమవ్వాలి. ఇలాంటి అనేక అంశాల్లో కీలకమైనవి వ్యూహాలు. కొందరు అదృష్టం కూడా ఉండాలంటారు. అయితే అదృష్టమన్నది మనకు కంటికి కనిపించదు. కాబట్టి మనకు అనుభవంలోకి వచ్చినపుడు మాత్రమే తెలుస్తుంది. అయితే వ్యూహాలు అలాకాదు. జరుగుతున్న పరిణామాలను బట్టి ఎప్పటికప్పుడు మనం గ్రహించగలం. అందుకనే గెలుపులో ఈ రెండు కూడా చాలా కీలకమనే చెప్పాలి. ఇపుడు ఈ విషయం ఎందుకంటే తాజాగా వెల్లడైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. 116 మున్సిపాలిటీల్లో 74 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగరేసింది. మరో రెండు రోజులు అయితే అంటే 16వ తేదీన ఛైర్మన్ల ఎన్నిక పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ గెలుపు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అలాగే ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ 4 చోట్ల గెలిచి మరో రెండింటిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఎన్నికల్లో ప్రధానమైనవి గెలుపు-ఓటమి మాత్రమే. ప్రత్యర్ధుల ఎత్తులను చిత్తుచేస్తు పై ఎత్తులు వేయగలిగిన వాళ్ళే విజయానికి దగ్గరగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఎత్తులు, పై ఎత్తుల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరితేరిపోయారు. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. తన మార్కులను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగంటే 74 చోట్ల కాంగ్రెస్ గెలవగా, బీఆర్ఎస్ 14 చోట్ల గెలిచింది. ఇండిపెండెంట్లు కొన్నిచోట్ల గెలవగా మరికొన్నిచోట్ల హంగ్ వచ్చింది. ఈ హంగ్ వచ్చిన మున్సిపాలిటీలను కూడా గెలుచుకోవాలని రేవంత్ పక్కా వ్యూహాలు రచిస్తున్నారు.

హంగ్ విషయాన్ని పక్కనపెట్టేస్తే 74 మున్సిపాలిటీలను గెలుచుకోవటంలో రేవంత్ పాత్రే చాలా కీలకం. అభ్యర్ధుల ఎంపికనుండి ప్రచారం, పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను చేరవేయటం వరకు అంతా రేవంత్ వేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది. మామూలుగా కాంగ్రెస్ లో ఎలాగుంటుంది అంటే ఒకళ్ళు చెబితే మరొకళు వినేంత సీనుండదు. ఎవరికి వాళ్ళే రాజులు కాబట్టి మరొకళ్ళు చెప్పే అవకాశం లేదు, చెప్పినా ఎవరు వినరు. అలాంటిది ఇపుడు రేవంత్ మాత్రం పాత పద్దతికి స్వస్తిచెప్పించాడు. తాను చెప్పినట్లు మిగిలిన వాళ్ళు వినాల్సిందే అని చాలా స్పష్టంగా ఆదేశించాడు. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో ఇంతటి విజయం సాధ్యమైంది.

అభ్యర్ధుల ఎంపికలో కాంగ్రెస్ ఈసారి కచ్చితత్వం పాటించింది. గెలుస్తారని సర్వేల్లో నిర్ధారణ అయినవారికి మాత్రమే కాంగ్రెస్ టికెటిచ్చింది. అలాగే నామినేషన్లు వేయకముందు నుండే చాలామంది అభ్యర్ధుల తరపున పార్టీ ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. నామినేషన్లు వేసిన తర్వాత అభ్యర్ధుల తరపున మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలంతా ప్రచారంలోకి దిగేశారు. నామినేషన్లు వేసిన దగ్గర నుండి ప్రచారం ముగిసిన రోజువరకు అందరు తమకు కేటాయించిన మున్సిపాలిటీల్లోనే క్యాంపు ఉండేట్లుగా రేవంత్ చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ప్రచార తీరుతెన్నులతో పాటు అభ్యర్ధుల గెలుపుపై రెగ్యులర్ గా నివేదికలు తెప్పించుకున్నారు. అభ్యర్ధుల్లో ఎక్కడైనా వెనకబడ్డారని తెలియగానే పుంజుకునేందుకు సూచనలిస్తు, ప్రచారంలో అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు.

పోలింగ్ రోజున ఓటర్లను వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు చేర్చటానికి అవసరమైన ఏర్పాట్లను అభ్యర్ధులతో చేయించారు. ప్రయాణ ఏర్పాట్లు సవ్యంగా జరిగిందా లేదా అన్న విషయాలను క్రాస్ చెక్ చేసుకున్నారు. అడుగడుగునా రేవంత్ ఇలాంటి అనేక జాగ్రత్తలు తీసుకున్న కారణంగానే పార్టీకి ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది. అభ్యర్ధుల ప్రచారంతో పాటు పార్టీ ప్రచారంలో ప్రధానంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రు. 500 కే ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ, అర్హులైన పేదలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి పథకాలపై పదేపదే ప్రచారం చేయించారు. ఒకవైపు అభ్యర్ధి, అభ్యర్ధి తరపున వ్యక్తిగత ప్రచారం జరిగితే మరోవైపు పార్టీ పరమైన ప్రచారం జరిగేలా చర్యలు తీసుకున్నారు. తన ఆదేశాలన్నీ సవ్యంగా అమలవుతున్నాయా లేదా అని చూసేందుకు జిల్లాల ఇంచార్జి మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకోబట్టే ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం సాధ్యమైంది.

Read More
Next Story