
ఎంఎల్సీగా ఫెయిలై, రాజ్యసభకు సక్సెస్ అయిన రేవంత్
అనుంగుమిత్రుడు వేం నరేందర్ రెడ్డితో రేవంత్ కు ఉన్న అనుబంధం గురించి, అనుబంధంతోనే రేవంత్ చేసిన దుస్సాహసం, కేసుల్లో ఇరుక్కోవటం గురించే.
హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఈ స్టోరి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సంబంధించింది కాదు. రేవంత్ అనుంగుమిత్రుడు వేం నరేందర్ రెడ్డితో రేవంత్ కు ఉన్న అనుబంధం గురించి, అనుబంధంతోనే రేవంత్ చేసిన దుస్సాహసం, కేసుల్లో ఇరుక్కోవటం గురించే. ఇంతకీ విషయం ఏమిటంటే రాజ్యసభ ఎంపీగా గురువారం నామినేషన్ దాఖలు చేయబోతున్న వేం నరేందర్ రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అన్న విషయం తెలిసిందే. వీరి స్నేహం సుమారుగా 20 ఏళ్ళ క్రితమే మొదలైంది.
ఇద్దరు తెలుగుదేశంపార్టీలో చేరినతర్వాత మొదలైన స్నేహం తర్వాత అతితొందరలోనే బలపడింది. నిజానికి ఇద్దరి మనస్తత్వాలు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. రేవంత్ వ్యక్తిత్వం ఏమో బాగా దూకుడుమీదుంటుంది. తాను ఎక్కడుంటే అక్కడ సందడి సందడిగా ఉంటుంది. ప్రత్యర్ధులపై పదునైన ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటం రేవంత్ అలవాటు. అదే వేం విషయం చూస్తే తాను ఎక్కడుండేది కూడా తెలీకుండా ఉంటుంది. ఏ విషయంలో కూడా చాలా లోప్రొఫైల్ మెయిన్ టైన్ చేస్తాడు. ప్రత్యర్ధులున్నప్పటికీ ఎవరిగురించీ పెద్దగా మీడియాతో మాట్లాడడు. తనకు అప్పగించిన పనిని కామ్ గా చాపకిందనీరులా చేసుకుపోవటం వేం స్టైల్.
కేసులో ఇరుక్కున్న రేవంత్
అయితే ఇలాంటి వేం కోసం రేవంత్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఏ విషయంలో అంటే 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏపీలో చంద్రబాబునాయుడు సీఎం అయ్యారు. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరి సచివాలయాలు ఒకే కాంపౌండులో ఉండేవి. 8 బ్లాకుల సచివాలయాన్ని అప్పటి గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో రెండుగా విభజించారు. నాలుగు బ్లాకులు తెలంగాణ సచివాలయంగాను, మిగిలిన నాలుగు బ్లాకుల్లో ఏపీ సచివాలయం ఉండేది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు సచివాలయాల నుండే తమ పాలన నిర్వహించేవారు.
ఇలాంటి సమయంలోనే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. టీడీపీ తరపున వేం నరేందర్ రెడ్డిని చంద్రబాబు పోటీలోకి దించారు. వేంను గెలిపించే బాధ్యతను రేవంత్ మీద చంద్రబాబు మోపారు. ఎందుకంటే వేం-రేవంత్ ఇద్దరు అత్యంత సన్నిహితులు కాబట్టి గెలుపు బాధ్యతలుంచారు. నిజానికి వేంకు గెలిచేంత సీన్ లేదు. అయినా పోటీలో వేంను చంద్రబాబు ఎందుకు దింపారు ? ఎందుకంటే ప్రత్యర్ధి పార్టీల్లోని ఎంఎల్ఏల ఓట్లను వేంకు మద్దతుగా వేయించుకోవచ్చన్న ఆలోచనతో. ఆలోచన చంద్రబాబుదా లేకపోతే రేవంత్ దా అన్నది కాదు పాయింట్. అసలు ఆలోచనే దుర్మార్గమైనది అనటంలో సందేహంలేదు.
అలాంటి పద్దతిలో పోటీకి దిగిన వేం తరపున రేవంత్ నడుంబిగించాడు. ప్రత్యర్ధిపార్టీల ఓట్లకు గాలం వేయటం మొదలుపెట్టాడు. మొదటిగాలమే బీఆర్ఎస్ నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ కు వేశాడు. గాలానికి పెద్దచేపే తగిలింది. వేంకు అనుకూలంగా ఓటు వేయటానికి స్టీఫెన్ ను రేవంత్ ఒప్పించాడు. ఎలా ఒప్పించాడు అంటే ఓటు వేసినందుకు స్టీఫెన్ కు రు. 50 లక్షలు ఇచ్చేట్లుగా. బేరం కుదిరిన తర్వాత ఇంకా ఎందుకు ఆలస్యం అనుకుని రేవంత్ డైరెక్టుగా రంగంలోకి దిగేశాడు. ఇద్దరిని వెంటపెట్టుకుని స్టీఫెన్ ఇంటికి రేవంత్ వెళ్ళాడు.
ఏసీబీ ఎంట్రీతో షాక్
స్టీఫెన్ ఇంటి హాలులో టేబుల్ పైన బ్యాగ్ పెట్టగానే రేవంత్ సహాయకుడు బ్యాగులో నుండి నోట్ల కట్టలను టేబుల్ పైన పెట్టి లెక్కిస్తున్నాడు. డబ్బుల లెక్కలు ఎందుకంటే రు. 50 లక్షలు తెచ్చాము అని స్టీఫెన్ కు చూపించటం కోసమే. డబ్బులు లెక్కపెడుతుండగానే సడెన్ గా ఇంట్లోకి ఏసీబీ పోలీసులు దూరారు. ఏసీబీ పోలీసులను చూడగానే రేవంత్, సహాయకుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తర్వాత జరిగిందంతా అందరికీ తెలిసిందే. అలా ఎంఎల్సీగా వేంను గెలిపించేందుకు రంగంలోకి దిగిన రేవంత్ ప్రయత్నం ఫెయిలైంది. ఫలితంగా వేం ఎన్నికల్లో ఓడిపోయాడు.
అప్పుడు జరిగిన వ్యవహారాలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుంటే మిత్రుడు వేంను ఎంఎల్సీ చేయలేకపోయిన రేవంత్ ఇపుడు రాజ్యసభ ఎంపీని చేయటంలో సక్సెస్ అయ్యాడు. ఎలాగంటే పార్టీలోను, ప్రభుత్వంలోను రేవంత్ కు తిరుగులేదు. పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ అంటే అధిష్ఠానం దగ్గర కూడా మంచి మార్కులే ఉన్నాయి. అందుకనే ఇపుడు భర్తీ అవబోతున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని తన మిత్రుడు, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వేంకు కేటాయించాలని రేవంత్ అడగాన్నే అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందుకనే వేంను ఎంఎల్సీని చేయటంలో ఫెయిలైన రేవంత్ ఇపుడు రాజ్యసభ ఎంపీని చేయటంలో సక్సెస్ అయినట్లు చెప్పింది.

