
కాంగ్రెస్ గుర్తును దొంగలు ఎత్తుకుపోయారా ?
కాంగ్రెస్ ఎన్నికల గుర్తును దొంగలు ఎత్తుకు పోయారనే అంటున్నారు టీ జీవన్ రెడ్డి
డబ్బును దోచుకుపోతారు, నగలు దోచుకుపోతారు. లేదా అందుబాటులో ఉంటే వాహనాలను కూడా దొంగలించుకుని పోతారు. కాని ఒక పార్టీ ఎన్నికల చిహ్నాన్ని దొంగలు ఎత్తుకుపోగలరా ? కాంగ్రెస్ ఎన్నికల గుర్తును దొంగలు ఎత్తుకు పోయారనే అంటున్నారు టీ జీవన్ రెడ్డి. జగిత్యాల లో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్ కు ఏమాత్రం పడటంలేదన్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయటానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జి మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యంకావటంలేదు. ఇంతకాలంగా పై ఇద్దరి వర్గాలు గొడవలతో ఏదోలా నియోజకవర్గంలో నెట్టుకుని వస్తున్నాయి.
ఇపుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక రేవంత్, బొమ్మ, ఉత్తమ్ మళ్ళీ సర్దుబాటు చర్చలు మొదలుపెట్టి సర్దుబాటు చేశాము అనిపించారు. జగిత్యాల్, రాయికల్ మున్సిపాలిటీల్లో వార్డుల్లో పోటీ విషయంలో ఏ వర్గానికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. పై రెండు మున్సిపాలిటీల్లోని 62 వార్డుల్లో ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ వర్గానికి 36, జీవన్ వర్గానికి 26 టికెట్లను పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీలో సంజయ్ వర్గానికి 30 టికెట్లు, జీవన్ వర్గానికి 20 టికెట్లు ఇచ్చారు. అలాగే రాయికల్ లో ఇద్దరి వర్గాలకు చెరి 6 టికెట్లను పంచారు.
ఈ పంపిణీ విషయంలో జీవన్ మీద సంజయ్ ది పైచేయిగా అందరికీ అర్ధమైపోయింది. మొదటినుండి సంజయ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ టికెట్ల పంపిణీలో తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయారు. దాంతో రోడ్డుమీదకు వచ్చి బహిరంగంగానే సంజయ్ మీద ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ గుర్తును దొంగలు ఎత్తుకుపోయారని చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది.
జీవన్ మాట్లాడుతు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని సంజయ్ ఒకవైపు చెబుతూ మరోవైపు కాంగ్రెస్ బీఫారాలను దొంగలించుకుని పోవటం ఏమిటి అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే మరి ఆ పార్టీ తరపునే తన మద్దతుదారులను పోటీచేయించకుండా కాంగ్రెస్ బీఫారాలపై ఎలా పోటీచేయిస్తున్నాడు ? అంటు ప్రశ్నించారు. ఏదేమైనా సంజయ్-జీవన్ మధ్య విభేదాలు ఇప్పట్లో సమసేట్లుగా కనబడటంలేదు. ఈ నేపధ్యంలోనే సంజయ్ పై జీవన్ బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుంటే సంజయ్ మాత్రం తనపని తాను కామ్ గా చేసుకుని పోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవల్లో ఏ పార్టీ లాభపడుతుందో చూడాలి.

