బీఆర్ఎస్ ఫిరాయింపుల సమస్యలను రేవంత్ ఊహించలేదా ?
x
BRS defection MLAs and Revanth

బీఆర్ఎస్ ఫిరాయింపుల సమస్యలను రేవంత్ ఊహించలేదా ?

మాజీ ఎంఎల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కు వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.


బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల వ్యవహారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలాగంటే తొందరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఫిరాయింపు(BRS defection MLAs) ఎంఎల్ఏలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధులకు ఇచ్చే ‘బీ ఫారాల’ను ఫిరాయింపు ఎంఎల్ఏల ద్వారా ఇస్తే అంగీకరించేదిలేదని కాంగ్రెస్ సీనియర్లు రేవంత్(Revanth) ను హెచ్చరిస్తున్నారు. బీఫారం అంటే పోటీచేయబోయే అభ్యర్ధి సదరు పార్టీ తరపున అధికారిక అభ్యర్ధి అని పార్టీ అధ్యక్షుడు ధృవీకరించటమే. జగిత్యాల్, స్టేషన్ ఘన్ పూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎంఎల్ఏలు సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. బీఫారాల విషయంలో జోక్యం చేసుకుంటే సహించేదిలేదని ఇప్పటికే మాజీ ఎంఎల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డి ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కు వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.

పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఇప్పటికి బీఫారాలపై గొడవ మొదలైంది 3 నియోజకవర్గాల్లోనే. ఎన్నికల నోటిపికేషన్ వెలువడిన తర్వాత మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తబోతున్నాయి. బీఫారాల పంపిణీ అధికారం కాంగ్రెస్ సీనియర్ నేతల చేతికి వస్తే ఇక ఫిరాయింపు ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో ఉండి ఏమిచేయాలి ? అనేది పెద్ద ప్రశ్న. బీఫారాల పంపిణీ బాధ్యత ఫిరాయింపు ఎంఎల్ఏలకి ఇస్తే దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న సీనియర్లు, వాళ్ళ మద్దతుదారులు ఏమికావాలి ? అంటే ఫిరాయింపులకు ఇస్తే ఒక సమస్య, సీనియర్లకు ఇచ్చేస్తే మరో సమస్యగా మారబోతోంది. ఎన్నికల్లో బీఫారాల ప్రాధాన్యత ఎంతుంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి బీఫారాలను మామూలుగా అయితే నియోజకవర్గంలో ఎంఎల్ఏలే అభ్యర్ధులకు అందచేస్తారు. ఒకవేళ ఎంఎల్ఏలు లేకపోతే ఎన్నికల్లో ఓడిపోయిన నేతలో లేకపోతే మరో సీనియర్ నేతో అందిస్తారు. ఇలా ఎందుకంటే బీఫారాలు అందించటం అన్నది సదరు నేతకు పార్టీలో ఉండే పట్టుకు నిదర్శనంగా చెప్పుకుంటారు.

అంతేకాకుండా ఎన్నికల్లో వీలున్నంతలో తన మద్దతుదారులకే టికెట్లు ఇప్పటించుకునేందుకు ఎంఎల్ఏలు లేదా సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తారని అందరికీ తెలిసిందే. దీనివల్ల మున్సిపాలిటిలో కాని లేదా నియోజకవర్గంలో కాని సదరు నేత పరపతి పార్టీలో పెరుగుతుంది. ఇపుడు విషయం ఏమిటంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన వారిలో 10మంది కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. మద్దతుదారులతో కలిసి వాళ్ళు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు కాబట్టి తొందరలో జరగబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ మద్దతుదారులకే ఎక్కువ టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు బహిరంగంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

జగిత్యాల్ లో ఫిరాయింపు ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ను మాజీ ఎంఎల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టేషన్ ఘన్ పూర్ మరో ఫిరాయింపు ఎంఎల్ఏ కడియంశ్రీహరిని మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన సింగాపురం ఇందిర గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే పటాన్ చెరులో గూడెం మహిపాల్ రెడ్డిని మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన కాటా శ్రీనివాసగౌడ్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ఇలాంటి పరిస్ధితే శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గద్వాలలో కూడా కనబడుతున్నాయి. అరెకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు గట్టిగా ఎదుర్కొంటున్నారు. అభ్యర్ధులను ప్రకటించేటపుడు మొదలవుతుంది అసలు సినిమా.

ఎవరికి వారు తమ మద్దతుదారులకే టికెట్లు దక్కాలని, బీఫారాల పంపిణీ తమచేతుల మీదగానే జరగాలని రేవంత్ పై ఒత్తిడి పెడుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. దీంతోనే పై నియోజకవర్గాల్లో గొడవలు పెరిగిపోతున్నాయి. మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తమ మద్దతుదారులతో మాట్లాడుతు అనవసరంగా కాంగ్రెస్ లో చేరామని ఆంతరంగిక మీటింగుల్లో చెప్పిన విషయాలు కూడా మీడియాలో వచ్చేశాయి. తనను నమ్మి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలను రేవంత్ వదులుకోలేరు అదేసమయంలో పార్టీలోని సీనియర్లను పక్కనపెట్టేందుకు లేదు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో రెండువైపుల నుండి రేవంత్ కు తలనొప్పులు తప్పేట్లు లేవని అర్ధమవుతోంది. ఫిరాయింపు ఎంఎల్ఏల మద్దతుదారులతో పాటు సీనియర్ నేతల మద్దతుదారులకు టికెట్లను పంపిణీ చేస్తారా ? లేకపోతే మొత్తం బీఫారాలను ఒకరిచేతిలోనే పెడతారా అన్నది తెలీటంలేదు. ఈ సమస్యను రేవంత్ ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

Read More
Next Story