
కల్వకుంట్ల కవితను జనాలు నమ్ముతారా ?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నరేళ్ళు కవిత కూడా అపరిమితమైన అధికారాలను చెలియించారనే ప్రచారం అందరికీ తెలిసిందే
ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికను కల్వకుంట్ల కవిత బయటపెట్టారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నది ఒక సంతకంతో లక్షలమంది ప్రజల కష్టాలను తీర్చటానికేనని చెప్పారు. తాను చూడని అధికారం కాదని కూడా అన్నారు. ఈ మాట మాత్రం నిక్కచ్చిగా చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదిన్నరేళ్ళు కవిత కూడా అపరిమితమైన అధికారాలను చెలియించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేసీఆర్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన అంశాలపై ఒక్కరోజు కూడా ప్రస్తావించని కవిత ఇపుడు వాటికి విరుద్ధంగా మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది. ఈ నేపధ్యంలోనే కవితను జనాలు నమ్ముతారా ? అనే అంశం కీలకమైపోయింది.
రాజకీయపార్టీ ఎవరైనా పెట్టవచ్చు కాబట్టి కవిత పార్టీ పెట్టాలని అనుకోవటంలో తప్పులేదు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఉండటంలో తప్పులేదు కాని ఆ విషయం జనాల మద్దతుపైన ఆధారపడుందన్నది వాస్తవం. మూడో ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సీఎం అనిపించుకోవాలని కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ప్రజల ఆలోచన ఎలాగుంది ? కేసీఆర్ ను మూడోసారి గెలిపించాల్సిన అవసరంలేదని జనాలు అనుకున్నారు కాబట్టే కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారు. మూడుజాతీయ పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఓట్లను చీల్చుకుంటామని కవిత చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు జనాలు కవిత పెట్టబోయే పార్టీకి ఎందుకు మద్దతిస్తారు ? ఒకవేళ ఇవ్వాలని అనుకున్నా బీఆర్ఎస్ విధానాలు నచ్చని వారే కవిత పార్టీకి ఓట్లేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి కవితపార్టీ వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందంటే అది బీఆర్ఎస్ కే ఎక్కువ. ప్రజలకోసం, సమాజంకోసం, మంచికోసమే తాను పార్టీ పెట్టబోతున్నట్లు కవిత ఇపుడు చెబుతున్నారు. మరి ఇపుడు చెబుతున్న ప్రజలకోసం, మంచికోసం, సమాజం కోసం తొమ్మిదిన్నరేళ్ళు తనకు ఉన్న అధికారాలను ఎందుకు ఉపయోగించలేదు అనే ప్రశ్నకు కవిత ఏమి సమాధానం చెబుతారో చూడాలి. అక్రమనిర్మాణాలను కూల్చేస్తానని నిండు అసెంబ్లీలో అప్పట్లో కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ చెప్పిన లెక్కప్రకారం అప్పట్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 వేల అక్రమనిర్మాణాలున్నాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా అక్రమనిర్మాణాలను కూల్చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో అప్పట్లో కేటీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అప్పట్లో తామిచ్చిన ఆదేశాలనే ఇపుడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తుంటే కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరీ విషయంలో కవిత ఎందుకు నోరుమెదపటంలేదు ? అప్పట్లో కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలను కవిత ఎందుకు వ్యతిరేకించలేదు ?
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, హత్యా, దౌర్జన్య రాజకీయాలు పెరిగిపోయాయి కాబట్టే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు ఓడించారని ఇపుడు చెబుతున్న కవిత ఇదే మాటను అప్పట్లో ఒక్కసారి కూడా ఎందుకు చెప్పలేదు ? అన్నది కీలకం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నది కాబట్టే ఇపుడు కవిత ఇన్నిమాటలు మాట్లాడుతున్నారు. మూడోసారి కూడా గెలిచి బీఆర్ఎస్ అధికారంలోనే ఉండుంటే ఇపుడు కూడా నోరిప్పేవారు కాదేమో. పైగా కేటీఆర్, దగ్గరి బంధువులు తన్నీరు హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ రావుతో పంచాయతీ పెరిగిపోయింది కాబట్టి ఇపుడు ఘాటు వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయాన్ని జనాలకు క్లారిటి ఇవ్వాలి. మొత్తంమీద కవితను జనాలు బీఆర్ఎస్ తానులోని ముక్కగానే చూస్తున్నారు కాబట్టి పార్టీ పెట్టినంతమాత్రాన నమ్ముతారా ? అన్నదే అనుమానంగా ఉంది.

