
లొట్టపీసులే కేటీఆర్ మెడకు తగులుకుంటాయా ?
లొట్టుపీసు కేసులని కేటీఆర్ పైకి ఎంత భింకం ప్రదర్శిస్తున్నా కేసుల్లో ఎంతపస ఉందో తనకు బాగానే తెలుసు
లొట్టపీసు కేసులని ఎద్దేవా చేస్తున్న కేసులే చివరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకుంటాయా ? ఇపుడిదే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. తనమీద నమోదైన కేసుల్లో పసలేదని, ఉత్త లొట్టుపీసు కేసులని కేటీఆర్(KTR) పైకి ఎంత భింకం ప్రదర్శిస్తున్నా కేసుల్లో ఎంతపస ఉందో తనకు బాగానే తెలుసు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసు(Formula E car race) కేసు తనమెడకు బాగానే చుట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఫలితమే ఇపుడు కేసులు, విచారణల రూపంలో తగులుకుంటున్నాయి. ఫార్ములా కార్ రేసు కేసులో అధికారదుర్వినియోగం, అవినీతి స్పష్టంగా బయటపడ్డాయి.
అధికారదుర్వినియోగం ఎలాగంటే బ్రిటన్ కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో కార్ రేసు నిర్వహించాలని కేటీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే చివరకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో రేసు జరగనేలేదు. రేసు నిర్వహణకు డిసైడ్ అయిన తర్వాత నుండి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన అయ్యేంతవరకు మధ్యలోనే అధికార దుర్వినియోగం, అవినీతి జరిగింది. రేసు నిర్వహణలో బ్రిటన్ కంపెనీకి రు. 50 కోట్ల చెల్లింపుకు ఆర్ధికశాఖ అనుమతిలేకపోవటం, క్యాబినెట్ లో చర్చించకుండానే, రిజర్వ్ బ్యాంక్ అనుమతి, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే నిధులు చెల్లించేయటం అంతా అధికార దుర్వినియోగం కిందకే వస్తుంది.
విదేశీకంపెనీకి నిధులు చెల్లించాలంటే ముందుగాఫైనాన్స్ శాఖ అనుమతి తీసుకోవాలి. తర్వాత క్యాబినెట్ సమావేశంలో చర్చించి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా తప్పదు. పై మూడు అనుమతులు లేకుండా ఎవరు కూడా విదేశీకంపెనీకి నిధులు చెల్లించేందుకు లేదు. కార్ రేసు ఎపిసోడ్ నడుస్తున్నపుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తప్పదు. అయితే కేటీఆర్ మాత్రం పై నాలుగు అనుమతులు తీసుకోకుండానే తనిష్టారాజ్యంగా హెచ్డీఎంఏ ఖాతాలో నుండి రు. 50 కోట్లు చెల్లించేశారు.
అనుమతులు ఉన్నాయా ?
అంతమొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే కేటీఆర్ ఎలా చెల్లించగలిగారు ? ఎలాగంటే అప్పటి ఎన్నికల్లో మూడోసారి గెలవబోయేది బీఆర్ఎస్సే అనే ప్రచారం బాగా జరిగింది. పైగా కేటీఆరే కాబోయే సీఎం అనే ప్రచారం అంతకుమించి జరిగింది. అప్పటికే యువరాజుగా, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న కేటీఆర్ ను ప్రశ్నించే ధైర్యం ఎవరుచేస్తారు ? అప్పట్లో జరిగింది అదే కాబట్టి కేటీఆర్ చెల్లింపులన్నింటినీ చేసేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన అర్వింద్ కుమార్ కు మొబైల్ వాట్సప్ లో ఆదేశాలిచ్చి పనులను కేటీఆర్ చక్కబెట్టేశారు.
మూడోసారి కూడా అధికారంలోకి వచ్చుంటే ఏమి జరిగేదో తెలీదు కాని ఖర్మకాలి బీఆర్ఎస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. అప్పటినుండి కేటీఆర్ కు సమస్యలు మొదలయ్యాయి. తన అనుమతి లేకుండానే విదేశీకంపెనీకి పెద్దఎత్తున నిధులు బదిలీచేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ సుమారు రు. 8 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. ఆర్బీఐ జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది అంటేనే తప్పుచేసినట్లు అంగీకరించినట్లే కదా. రు. 8 కోట్ల జరిమానా విధింపు తప్పు ఎందుకు జరిగింది ? ఎందుకంటే కేటీఆర్ కారణంగానే. ఇక్కడే కేటీఆర్ అధికారదుర్వినియోగం సాక్ష్యాలతో సహా బయటపడింది. దీన్నే కేటీఆర్ తట్టుకోలేక ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు విమర్శిస్తున్నారు.
అర్విందే కీలకమా ?
సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ పైన యాక్షన్ తీసుకునేందుకు పర్మీషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రహోంశాఖ పరిధిలోని డీవోపీటీకి లేఖ రాసింది. లేఖకు డీవోపీటీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సమాధానం రాగానే ప్రభుత్వం అర్వింద్ పై యాక్షన్ కు రెడీగా ఉంది. అప్పుడు మొదలవుతుంది అసలైన వ్యవహారం. అర్వింద్ గనుక అప్రూవర్ గా మారిపోయి అప్పట్లో ఏమి జరిగిందనే విషయాలను సాక్ష్యాధారాలతో సహా చెప్పేస్తే కేటీఆర్ పూర్తిగా ఇరుక్కోక తప్పదు. అర్వింద్ అప్రూవర్ గా మారిపోయారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది.
ఈ కేసు ఇలాగుండగానే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పైన ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి. ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆరే అసలు సూత్రదారులని, వాళ్ళపైన కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పదేపదే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పాత్రపైన సిట్ అధికారులకు సాక్ష్యాలు దొరికిన కారణంగానే విచారించినట్లు ప్రచారం పెరిగిపోతోంది. మొత్తానికి ఈ రెండు లొట్టపీసు కేసులే కేటీఆర్ మెడకు గట్టిగా చుట్టుకునేట్లుగా ఉన్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

