
‘చెత్త మాటలు మాట్లాడకండి’
అసెంబ్లీలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం
బీహార్ అసెంబ్లీలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ ప్రభుత్వం “తుపాకులు, బుల్లెట్ల సాయంతో పాలన సాగిస్తుంది” అని ప్రతిపక్ష సభ్యులు ఘాటైన విమర్శలు చేయడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్న సభ్యులను మందలించారు. “అర్థంలేని మాటలు మాట్లాడకండి.’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభ ప్రారంభమైన వెంటనే స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో నిరసన తెలిపిన ‘చౌకీదార్ల’పై పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆర్జేడీ ఎమ్మెల్యే కుమార్ సర్వజీత్ ఆరోపించారు. హోం శాఖ ఉద్యోగులపై ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. దీనికి మద్దతుగా ఇతర ప్రతిపక్ష సభ్యులు కూడా “బందూక్ గోలి కి సర్కార్ నహిన్ చలేగి” అంటూ నినాదాలు చేశారు.
ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన నితీష్ కుమార్.. “అర్థంలేని మాటలు మాట్లాడకండి. ఈ ప్రభుత్వం బలంగా ఉంది” అంటూ ప్రతిస్పందించారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ 243 స్థానాల్లో 202 సీట్లు గెలుచుకుందని గుర్తుచేశారు. ఆర్జేడీ పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
తీవ్ర వాగ్వాదం మధ్య కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టడంతో సమావేశం కొద్దిసేపు గందరగోళంగా మారింది. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి జోక్యం చేసుకుని, చౌకీదార్ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతించింది.

