
పరిషత్ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలైన తర్వాతే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ఆధ్వర్యంలోని మంత్రివర్గం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి
తెలంగాణలో పరిషత్ ఎన్నికలనిర్వహణపై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. స్ధానికసంస్ధల ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలని గతంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను నిర్ణయించింది ప్రభుత్వం. మార్చి లేదా ఏప్రిల్ లో మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహించేస్తుందని అందరు అనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలైన తర్వాతే పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ ఆధ్వర్యంలోని మంత్రివర్గం నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సోమవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రేవంత్ మాట్లాడుతు బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లులను కేంద్రానికి పంపినందున దానిపై కేంద్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నట్లు సమాచారం. కేంద్ర నిర్ణయం తెలిసేంతవరకు పరిషత్ ఎన్నికలను వాయిదావేయాలని కూడా మంత్రులతో రేవంత్ అన్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ సూచనలకు మంత్రులు కూడా సానుకూలంగానే స్పందించినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్లుగానే పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అదేపద్దతిలో విజయం సాధించాలని మంత్రులకు రేవంత్ సూచించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలంతా కలిసి ఏకతాటిపైన కష్టపడినట్లుగానే పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కష్టపడి సమిష్టి విజయాన్ని సాధించాలని నిర్దేశించారు. రాష్ట్రంలో 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలున్నాయి. మంత్రులతో రేవంత్ చెప్పింది చూస్తుంటే పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనబడటంలేదు.
రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అప్పుడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సదస్సులో మాట్లాడుతు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు 42 రిజర్వేషన్లు ప్రకటించారు. నిజానికి రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాని రాష్ట్రాల పరిధిలోనిది కాదని అందరికీ తెలుసు. ఆ ఎన్నికల్లో బీసీల ఓట్లను కొల్లగొట్టడమే టార్గెట్ గా రేవంత్ ప్రకటించారంతే. తనహామీ ఆచరణ సాధ్యంకాదని రేవంత్ కూ తెలుసు, బీసీలకూ తెలుసు.
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ చాలాకాలం బీసీ రిజర్వేషన్ల ఊసే ఎత్తలేదు. రేవంత్ వైఖరి గమనించిన బీసీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళనలు మొదలుపెట్టాయి. దాంతో కొంతఒత్తిడికి లోనైన రేవంత్ ప్రభుత్వం అర్జంటుగా స్ధానికసంస్ధల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపగా ఢిల్లీలో పెండింగులో ఉండిపోయింది. కొంతకాలం తర్వాత రెండోసారి తీర్మానంచేసి కేంద్రహోంశాఖకు పంపింది ప్రభుత్వం.
తీర్మానాలు, ఆర్డినెన్స్ పెండింగ్
రెండో తీర్మానం కూడా కేంద్రంలో పెండింగులోనే ఉండిపోయింది. దాంతో ఏమి చేయాలో తోచని రేవంత్ ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అసెంబ్లీలో బిల్లుపై చర్చించి ఆర్డినెన్సు రెడీచేసింది. ఆర్డినెన్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపగా అది కూడా పెండింగులోనే ఉండిపోయింది. అందుకనే బిల్లు, ఆర్డినెన్స్ పక్కనపెట్టేసి ఏకంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు ప్రభుత్వం జీవోనే జారీచేసేసింది. ప్రభుత్వం ఇలా జీవో జారీచేసిందో లేదో వెంటనే రెడ్డి జాగృతి సంస్ధ వ్యవస్ధాపకుడు బుట్టెంగారి మాధవరెడ్డి కోర్టులో జీవోను సవాలు చేశారు. రెండువైపుల వాదనలు విన్న కోర్టు జీవో అమలును నిలిపేసింది. అందరికీ తెలిసిన పై విషయాలను బట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకావాలంటే నరేంద్రమోదీ ప్రభుత్వం అనుకుంటె మాత్రమే సాధ్యమవుతుందని.
బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు కనబడటంలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తొక్కిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. రేవంత్ ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం ఆమోదించాలంటే అందుకు పెద్ద ప్రక్రియ జరగాలి. ముందుగా తెలంగాణప్రభుత్వం పంపిణ బిల్లును అవసరమైతే కేంద్ర న్యాయశాఖ సమీక్షిస్తుంది. సమీక్షలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేవని తేలితే అప్పుడు సదరు బిల్లును ప్రధానమంత్రి కార్యాలయంకు పంపుతుంది. ఒకవేళ న్యాయపరమైన సమస్యలున్నాయని న్యాయశాఖ భావిస్తే వాటిని ప్రస్తావిస్తు క్లారిఫికేషన్ కోసం సదరు బిల్లును తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి పంపేస్తుంది. ప్రధానమంత్రి కార్యాలయంకు చేరిన బిల్లు అజెండాలో చేరి క్యాబినెట్ లో చర్చ జరిగి ఆమోదించాలి. తర్వాత క్యాబినెట్ ఆమోదం పొందిన బిల్లును పార్లమెంటరీ వ్యవహారాలశాఖ పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టి చర్చజరుపుతుంది. అవసరమైతే బిల్లు ఆమోదానికి ఓటింగ్ జరుగుతుంది. పార్లమెంటులో బిల్లు పాసైన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందాలి. రాష్ట్రపతి సంతకం అయిన తర్వాత చట్టంగా మారుతుంది.
బిల్లుతో రాజకీయం
ఇంత పెద్ద ప్రక్రియ జరిగి తెలంగాణ పంపిన బిల్లు చట్టమైతే ఎవరికి లాభం ? కచ్చితంగా రేవంత్ ప్రభుత్వానికే లాభం. ఎందుకంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించింది రేవంత్ ప్రభుత్వం అని జనాలంటారే కాని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనరు. బీసీల తరపున కేంద్రంతో పోరాడి 42శాతం రిజర్వేషన్లు సాధించిన సీఎంగా రేవంత్ కు క్రెడిట్ దక్కుతుంది. ఈవిషయాలన్నీ ఎన్డీయే ప్రభుత్వానికి తెలుసుకాబట్టే వచ్చిన బిల్లును పక్కనపెట్టేసింది. అందుకనే ఇపుడీ బిల్లు రాజకీయం అంశంగా మారిపోయింది. సమీప భవిష్యత్తులో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రప్రభుత్వం ఆమోదం లభించేది అనుమానమే.
కాబట్టి బీసీ రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకునేంతవరకు వెయిట్ చేద్దామని రేవంత్ అన్నారంటే ఇప్పట్లో పరిషత్ ఎన్నికల నిర్వహణ జరగదు అని అర్ధమైపోతోంది. కేంద్రం నిర్ణయంతో సంబంధంలేకుండా పరిషత్ ఎన్నికలు జరగాలంటే అందుకు కోర్టుజోక్యం చేసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది.
గత ఎన్నికల్లో ఏమైంది ?
2019లో జరిగిన ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పై చేయి సాధించింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో 446 జడ్పీటీసీల్లో బీఆర్ఎస్ గెలవగా, కాంగ్రెస్ 75, బీజేపీ 8 జడ్పీటీసీల్లో గెలిచాయి. అలాగే ఎంపీటీసీల్లో బీఆర్ఎస్ 3,556, కాంగ్రెస్ 1377, బీజేపీ 211 గెలిచాయి. ఈ నేపధ్యంలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ? అందులో ఏపార్టీ ఎన్నిస్ధానాలను గెలుచుకుంటుందో చూడాల్సిందే.

